సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలో చెప్పుల‌తో కొట్టుకున్న కౌన్సిల‌ర్లు

Update: 2022-03-31 13:30 GMT
అది సాక్షాత్తూ.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌. అందునా.. కీల‌క‌ల‌మైన ప్రొద్దుటూరు మునిసిపాలి టీ.  ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించి ప‌రిష్క‌రించాల్సిన‌.. వైసీపీ నాయ‌కులు.. ఒక‌రిపై ఒక‌రు ప‌డి చెప్పుల‌తో కొట్టుకున్నారు. బాధ్య‌తగ‌ల స్థానాల్లో ఉన్న‌వారే.. బండ‌బూతులు తిట్టుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు చెప్పులు విస‌ర‌డం కాదు.. నేరుగా చెంప‌ల‌పైనే వాయించుకున్నారు.. దీంతో ఒక్క‌సారిగా ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

విష‌యంలోకి వెళ్తే.. క‌డప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ కౌన్సిల్ సమావేశం గురువారం ఉద‌యం 12 గంట‌ల‌కు ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా.. స్థానిక స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు అధికార పార్టీ నేత‌లు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో ప్రొద్దుటూరు కౌన్సిర‌ల్‌,  వైఎస్ చైర్మ‌న్‌ల మ‌ధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్ర‌మంలో తొలుత ప‌ర‌స్ప‌రం దూషించుకున్నారు. త‌ర్వాత‌.. ఒక‌రిపై ఒక‌రు చెప్పుల‌తో కొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

ప్రొద్దుటూరు మునిసిపాలిటీలోని 13వ వార్డులో తాగునీటి సమస్య ఉంద‌ని.. దీనిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోవట్లేదని కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ ప్రశ్నించారు. దీంతో  వైస్‌ఛైర్మన్‌ ఖాజామొహిద్దీన్ గొడవకు దిగారు. ఛైర్పర్సన్ లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పట్టణంలోని కొన్ని పనుల విషయమై 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ తన వార్డులో నీటి సమస్య ఉందని.. ఎన్నిసార్లు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై వైస్ ఛైర్మన్ బంగారు మునిరెడ్డి సమాధానమిచ్చారు. కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా వినకపోవడంతో పక్కనే ఉన్న మరో వైస్ఛైర్మన్ ఖాజా మోహిద్దీన్ సర్దిచెప్పాలని చూశారు. అనంతరం మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో మిగిలిన సభ్యులు విస్తుపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు.. అదుపు చేసే ప్ర‌య‌త్నం చేశారు.కానీ, దూష‌ణ‌ల ప‌ర్వం,చెప్పులు విసురుకోవ‌డం మాత్రం చాలా సేపు కొన‌సాగింది.

మ‌రి త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లోనే జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ కానీ.. లేదా.. ఇదే జిల్లాకు చెందిన చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డికానీ.. లేక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి కానీ.. ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల్సిన మునిసిప‌ల్ స‌మావేశాలు.. బ‌ల ప్ర‌యోగాల‌కు వేదిగా మార్చ‌డం. స్థానికంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
Tags:    

Similar News