మున్సిపోల్ సిత్రాలు: 3 పార్టీల అభ్యర్థుల పేర్లు ఒక్కటే

తెలంగాణలో జరుగుతున్న మున్సిపోల్స్ కు సంబంధించి పలు సిత్రవిచిత్రాలు బయటకు వస్తూ పలువురిని విస్మయానికి గురి చేస్తున్నాయి.;

Update: 2026-02-07 04:24 GMT

తెలంగాణలో జరుగుతున్న మున్సిపోల్స్ కు సంబంధించి పలు సిత్రవిచిత్రాలు బయటకు వస్తూ పలువురిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతాలు ఈ కోవకు చెందినవే. సాధారణంగా ఎన్నికల వేళ చాలా తక్కువ చోట్ల.. ఒకే పేరుతో ఉండే అభ్యర్థులు కనిపిస్తుంటారు. అయితే.. ప్రధాన పార్టీలకు చెందిన వారి విషయంలో అలా జరగదు. అందుకు భిన్నంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థుల పేర్లు మాత్రమే కాదు వారి ఇంటిపేర్లు కూడా సేమ్ టు సేమ కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో రెండోవార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు ప్రధానఅభ్యర్థుల పేర్లు.. ఇంటిపేర్లు ఒకటే కావటం మహా తికమకగా మారింది. వీరిద్దరి పేర్లు బీసోళ్ల సంధ్యారాణి. దీంతో.. ఓటర్లు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీరి భర్తలు వరుసక అన్నదమ్ములు కావటంతో ఈ పరిస్థితి నెలకొంది. కానీ.. ఈ తరహా పరిస్థితి చాలా అరుదుగా చోటు చేసుకుంటుందని చెప్పాలి.

ఈ ఇద్దరు ప్రధాన పార్టీ అభ్యర్థులు కావటంతో ఓటర్ల కన్ఫ్యూజన్ ఎవరికి లాభంగా మారుతుంది? మరెవరికి నష్టాన్ని కలిగిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇంటిపేర్లతో సహా అభ్యర్థుల ఇద్దరి పేర్లు ఒకటే కావటంతో.. అభ్యర్థుల పేర్లను పట్టించుకోకుండా పార్టీని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తమ ప్రచారంలో పదే పదే చెప్పటం కనిపిస్తోంది. మరి.. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ ఇద్దరు చాలా కాలంగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న వారే కావటం.

ఇదిలా ఉంటే.. 83 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలో దిగిన ఒక పెద్ద వయస్కురాలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుననారు. సుదీర్ఘకాలం కష్టపడిన ఈ మహిళా రైతు తన 83వ ఏట ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఆసక్తికర ఘటన నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆమె (దొండపాటి కాంతమ్మ) ఎనిమిదో వార్డు కౌన్సెలర్ గా పోటీ చేస్తున్నారు.

ఇంత వయసులోనూ చురుగ్గా పని చేయటమే కాదు.. వ్యవసాయ పనులు చేయటంలోనూ దిట్టగా ఆమెకు పేరుంది. మందితో పనులు చేయించే విషయంలోనూ ఆమె టాలెంట్ వేరే లెవల్ అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఆమెకు ఒక కొడుకు.. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆమె భర్త 2017లో మరణించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇదే మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో ఆమె కుమారుడు పోటీలో ఉంటే.. ఊళ్లో తనకున్న పరిచయాల నేపథ్యంలో కాంతమ్మ ఎనిమిదో వార్డు నుంచి బరిలోకి దిగారు.

మిర్యాలగూడ పట్టణంలో తండ్రీకొడుకు వేర్వేరు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. దేవరకొండ మున్సిపాలిటీలో అక్కాచెల్లెళ్లు బరిలో నిలిచారు. ఈ సిస్టర్స్ దేవరకొండకు చెందిన వ్యక్తుల్ని పెళ్లాడారు. 5 వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా జక్కుల రాజేశ్వరి పోటీలో ఉంటే.. ఆమె అక్క కొండ్ర మల్లేశ్వరి 20 వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మల్లేశ్వరి ఇదే వార్డులో కౌన్సెలర్ గా విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్ టికెట్ రాకపోవటంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.

మరో ఆసక్తికర పొలిటికల్ సన్నివేశం భువనగిరి మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. ఛైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయిన నేపథ్యంలో అన్ని పార్టీల ముఖ్యనేతలు తమ సతీమణులను బరిలోకి దింపారు. మూడు పార్టీల పరధాన నాయకులు జనరల్ వార్డుల్లో తాము పోటీ చేయకుండా.. తమ భార్యల్ని బరిలోకి దింపిన ఆసక్తికర సీన్ ఇక్కడ నెలకొంది. మొత్తం 35 వార్డుల్లో మహిళలకు 17 స్థానాలు రిజర్వు అయ్యాయి. ఈ స్థానాలలో మొత్తం 75మంది బరిలో ఉన్నారు. ఛైర్మన్ పదవి మహిళలకు కేటాయించటంతో తాము బరిలోకి దిగే కన్నా.. తమ భార్యల్ని గెలిపించుకోవటం ద్వారా ఛైర్మన్ గిరి తమ ఇంటికే సొంతం అయ్యేలా ఆయా పార్టీల ప్రధాన నేతలు సీరియస్ గా పని చేస్తున్నారు.

Tags:    

Similar News