అనాగరికం.. దశదిన కర్మ రోజున స్వీటు పెట్టలేదని ఊరి బహిష్కరణ

ఇప్పుడు అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. మానవత్వానికే మాయని మచ్చలా మారిన ఈ ఉదంతం గురించి తెలిస్తే.. నోట మాట రాదంతే.

Update: 2026-06-27 08:10 GMT

డిజిటల్ యుగం.. జెన్ జీ తరం.. ఇలా చెప్పుకోవటానికే తప్పించి.. కొన్నిచోట్ల చోటు చేసుకుంటున్న ఉదంతాల్ని చూస్తే.. అనాగరికత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. మానవత్వానికే మాయని మచ్చలా మారిన ఈ ఉదంతం గురించి తెలిస్తే.. నోట మాట రాదంతే. నిరుపేద ఇంట్లో చావు వేళ.. సంప్రదాయంగా పెట్టాల్సిన భోజనాల్లో వడ్డించాల్సిన స్వీట్ వడ్డించలేదన్న కారణంతో.. ఆ కుటుంబానికి చెందిన 42 కుటుంబాలను ఊరి బహిష్కరణ చేసిన దుర్మార్గం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ కాప్ పంచాయితీ కొత్త చర్చకు తెర తీసింది.

రాజస్థాన్ లోని శిరోహి జిల్లా మాండవరియా గ్రామానికి చెందిన సాదారామ్ రోజువారీ కూలీ. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద స్థితిలో ఉంది. సొంతంగా ఎలాంటి స్థిరాస్తి లేని అతడు.. అకస్మాత్తుగా మరణించాడు. అతడి అంత్యక్రియలకు అయ్యే ఖర్చులకు సైతం ఆ కుటుంబం తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన వచ్చింది. ఇదిలా ఉంటే.. రాజస్థానీ గ్రామీణ ఆచారం ప్రకారం మరణించిన వ్యక్తి పదమూడో రోజు నిర్వహించే దశ దిన కర్మను భారీ ఎత్తున విందు ఏర్పాటు చేయాలి. పేరుకు మృత్యు భోజనం మాటే కానీ.. అందులో స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసే నేతి మాల్ పువా మిఠాయిను కచ్ఛితంగా వడ్డించాల్సి ఉంది.

అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబం నాదూరామ్ మరణించిన పదమూడో రోజున దశదినకర్మను నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి అయ్యే ఖర్చును వీలైనంత తగ్గించుకోవటానికి సాదాసీదా శాఖాహార భోజనాన్ని వడ్డించారు. సంప్రదాయంగా వడ్డించే మిఠాయిను మిస్ చేశాడు. దీంతో.. గ్రామ పెద్దలకు కోపం వచ్చింది. కుల పంచాయితీ అనూహ్య రీతిలో వీరికి.. వీరికి బంధువులైన 42 కుటుంబాలకు గ్రామబహిష్కరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు.. కుల పెద్దలు విధించిన బహిష్కరణ వేటుతో నోటి వెంట మాట రాని పరిస్థితి.

ఈ ఆదేశంతో వారు ఉన్న ఊళ్లో ఎవరికి వీరికి పనులు ఇవ్వకపోవటం.. కిరాణా షాపులో సామాన్లు మొదలు చివరకు ఊళ్లో వీరు వినియోగించే నీళ్ల మీదా ఆంక్షలు పెట్టేశారు. చివరకు ఆ కుటుంబాల్లోని చిన్నారులు ఉండే వారి చిన్నారులకు కనీసం తిండి కూడా దొరకకుండా చేసి.. ఆకలితో అలమటించేలా చేశారు. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో తమ మీద విధించిన కుల బహిష్కరణ దారుణాన్ని స్థానిక పోలీసు స్టేషన్ ను ఆశ్రయించారు. ఈ నెల 20న బాధితులు బర్లూట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. అయినప్పటికి ఎఫ్ఐఆర్ ను రాయని పరిస్థితి.ఈ నేపథ్యంలో వారంతా కలిసి కలెక్టరేట్ కు వెళ్లి.. తమ గోడును వినిపించుకున్నారు.

వీరు తమకు ఎదురైన ఇబ్బంది గురించి చెప్పినప్పుడు.. నోటి వెంట మాట రాని పరిస్థితి. పోలీస్ స్టేషన్ లో వీరు ఎఫ్ఐఆర్ కోసం బలవంతం చేసినప్పుడు వీరి ఉదంతం బయటకు వచ్చింది. దీంతో పోలీసుల మీద పెరిగిన ఒత్తిడితో కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఉదంతంపై సమగ్రవిచారణకు చేపట్టారు. అంతేకాదు.. వీరిపై విధించిన బహిష్కరణను వెంటనే తీసివేయాలని.. వీరికి అవసరమైన నిత్యవసర వస్తువుల్ని ఇవ్వాలని ఆదేశించారు.

ఒకవేళ.. ఈ ఆదేశాల్ని నిర్వహించని పక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సైతం హెచ్చరించారు. ఇలా.. చావింటి భోజనంలో స్వీట్ లేని కారణంగా సదరు కుటుంబం మీదా.. వారికి సంబంధించినకుటుంబాల మీద సమగ్రంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా.. మిఠాయి వడ్డించలేని కారణంగా ఇదంతా జరగలేదని.. బాధిత కుటుంబం మీద గొడవలు ఉన్నాయని.. ఇందులో భాగంగాపగ తీర్చుకోవటానికి వీలుగా వీరు ఈ తరహా దుర్మార్గానికి తెర తీశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగు చూసే వీలుంది.

Tags:    

Similar News