కాక్రోచ్‌ ఎఫెక్ట్‌: యువ‌త‌కు మోడీ ఇంపార్టెన్స్‌!

దేశంలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) ఉద్య‌మం ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. తొలుత దీనిని సీరియ‌స్‌గా తీసుకోక‌పోయినా.. త‌ర్వాత త‌ర్వాత దీని ప్ర‌భావం బాగానే క‌నిపిస్తోంది.

Update: 2026-06-29 14:07 GMT

దేశంలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) ఉద్య‌మం ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. తొలుత దీనిని సీరియ‌స్‌గా తీసుకోక‌పోయినా.. త‌ర్వాత త‌ర్వాత దీని ప్ర‌భావం బాగానే క‌నిపిస్తోంది. యువ‌త‌ను పెద్ద ఎత్తున సీజేపీ ఆక‌ర్షించింది. వైద్య విద్యా ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించి న నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్ కావ‌డం, పునః ప‌రీక్ష నిర్వ‌హించ‌డం వంటివి తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ రాజీనామా చేయాల‌న్న డిమాండ్ మాత్రం కొన‌సాగుతోంది. దీనికి మ‌ద్ద‌తుగా వేల మంది విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కూడా దేశ‌వ్యాప్తంగాత‌మ వాణిని వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో యువ‌త దూకుడు, వారి ప్ర‌భావం వంటివాటిపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ దృష్టి పెట్టారు. అంతేకాదు.. సోష‌ల్ మీడియా ద్వారా యువ‌త‌ను ఆక‌ట్టుకోవాల‌ని కూడా మంత్రుల‌కు ఆయ‌న సూచించారు. దీనిని ఎంత మంది పాటిస్తున్నార‌న్న ది ప‌క్క‌న పెడితే.. తాజాగా ప్ర‌ధాని యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని బీజేపీ వ‌ర్గాలు చెబుతు న్నాయి. ఇటు పార్టీలోను.. అటు కేంద్ర ప్ర‌భుత్వంలోనూ యువ‌త ప్రాధాన్యం పెంచేలా మోడీ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ముందుగా కేంద్ర మంత్రివ‌ర్గంలో 60 సంవ‌త్స‌రాలు పైబ‌డిన‌వారిని పక్క‌న పెట్టి.. 45-60 మ‌ధ్య వ‌య‌సున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

45 ఏళ్ల‌లో ఉన్న వారిలో ముగ్గురు మాత్ర‌మే ప్ర‌స్తుతం మోడీ మంత్రివ‌ర్గంలో ఉన్నారు. వీరి సంఖ్య‌ను పెంచాల‌న్న‌ది ప్ర‌స్తుత వ్యూహం. అలానే వృద్ధులుగా ఉన్న‌వారిని ప‌క్క‌న పెట్ట‌నున్నారు. అలానే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిని.. త‌మ త‌మ శాఖ‌ల‌పై పెద్ద‌గా ప‌ట్టులేద‌ని భావిస్తున్న‌వారిని కూడా త‌ప్పించి.. వారి స్థానంలో యువ‌తకు ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్టు స‌మా చారం. అలానే.. పార్టీలో ఉంటూ.. ఇన్‌ఫ్లుయెన్స‌ర్లుగా గుర్తింపు పొందిన వారిని పార్టీలో కీల‌క స్థానాల‌కు కేటాయించ‌నున్నారు. ఇక‌, ఎంపీలుగా ఉంటూ.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ప‌ద‌వులు ఇవ్వాల‌ని భావిస్తున్నారు. త‌ద్వారా యువ‌త‌ను ఆక‌ట్టుకోవాల‌న్న‌ది ప్ర‌ధాని అంతిమ ల‌క్ష్యంగా ఉంది.

ఎందుకు?

ప్ర‌స్తుతం పొరుగు దేశాల్లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌న్‌-జీ ఎఫెక్ట్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. నేపాల్‌, బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్‌ల‌లో ప్ర‌భుత్వాలు కూలిపోయి.. కొత్త పాల‌కులు ప‌గ్గాలు చేప‌ట్ట‌డానికి యువ‌త తిరుగుబాటే కీల‌కంగా మారింది. ఈ ప‌రిస్థితి ఇప్ప‌టికిప్పుడు భార‌త్‌లో రాక‌పోయినా.. మ‌రో మూడేళ్ల త‌ర్వాత‌.. కాక్రోచ్‌జ‌న‌తా పార్టీ ఉద్య‌మాలు పెరిగి, యువ‌త‌లో చైత‌న్యం పెరిగితే.. అది త‌న‌కు ఇబ్బంది అవుతుంద‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. అందుకే.. ఇప్ప‌టి నుంచే యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చేందుకు.. వారిని త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అందుకే తొలి మెట్టుగా త‌న మంత్రివ‌ర్గంలోనే మార్పులు చేయాల‌ని ప్ర‌ధాని నిర్ణ‌యించిన‌ట్టు బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News