ట్వీట్ల గేట్లు దాటి ఆయన రావాల్సిందేనా ?

గతంతో పోలిస్తే జనంతో కనెక్షన్ బాగా పెరిగింది. దానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. ఒక్క ట్వీట్ చేస్తే చాలు అది వైరల్ అవుతుంది.

Update: 2026-06-29 18:05 GMT

గతంతో పోలిస్తే జనంతో కనెక్షన్ బాగా పెరిగింది. దానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. ఒక్క ట్వీట్ చేస్తే చాలు అది వైరల్ అవుతుంది. చేరాల్సిన వారి అందరికీ చేరుతుంది. ఈ విధంగా సెలిబ్రిటీలు ఇపుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ ని సమయానుకూలంగా వాడుతున్నారు. అయితే ఇతర రంగాలలోని సెలిబ్రిటీలకు సోషల్ మీడియా ఎంత బాగా ఉన్నా పొలిటీషియన్స్ కి మాత్రం అది ఒక కీలక సాధనం మాత్రమే అన్నది గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. సోషల్ మీడియా ద్వారా అప్పటికప్పుడు ఏ విషయం మీద అయినా తమ భావాలను ఆలోచనలను సంతోషాలను సంతాపాలను వ్యక్తం చేయగలరు. కానీ అంతటితో పొలిటీషియన్లకు అది సరిపోదు, వారు రియల్ గా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. జనంతో నేరుగా కనెక్ట్ కావాల్సి ఉంటుంది. అలా చేసినపుడు కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లుగా సోషల్ మీడియా ప్రభావం కూడా రెట్టింపు అవుతుంది.

జనంతోనే మమేకం :

జగన్ జనంలో ఉన్న నాయకుడు. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఆలోచించినపుడు జనంతోనే ఉంటూ వచ్చారు. అసలు కాంగ్రెస్ నుంచి జగన్ వేరు పడడానికి అసలైన రీజన్ జనంతో తాను ఉంటాను అని చెప్పినందుకే అన్నది తెలిసిందే. ఓదార్పు యాత్ర ద్వారా వారిని తాను డైరెక్ట్ గా కలుస్తాను అని జగన్ చెప్పారు. ప్రతీ ఇంటి గడప తాను తొక్కుతాను స్వయంగా పరామర్శిస్తాను అని జగన్ చెప్పినందువల్లనే కాంగ్రెస్ అధినాయకత్వానికి జగన్ కి మధ్యన గ్యాప్ అన్నది ఏర్పడింది.

జగన్ విత్ మీడియా :

అయితే జగన్ 2009లో నల్లకాలువ నుంచి చేసిన తొలి ప్రసంగంతో మొదలు పెడితే 2019 ఎన్నికల ముందు జనవరి 9న ముగించిన భారీ పాదయాత్ర వరకూ జనం మధ్యనే ఉంటూ వచ్చారు. అలాంటి జగన్ 2019 తరువాత సీఎం అయ్యాక అతి తక్కువ సందర్భాలలో మాత్రమే బయటకు వచ్చేవారు. ఇక బహిరంగ సభలు ఆయన నిర్వహించేవారు. మీడియా సమావేశాలు అయితే అసలు లేవు. కానీ 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ మీడియా మీటింగ్స్ ఎక్కువగా నిర్వహిస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియాలో ఎక్స్ ఖాతాలో ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. నిజానికి జగన్ జనంతోనే తన ప్రయాణం అన్నట్లుగా 2014 నుంచి 2019 మధ్యలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆయన ఓటమి తరువాత వెంటనే అప్పట్లో జనంలోకి వచ్చారు. కానీ 2024 తరువాత సీన్ మొత్తం చేంజ్ అయింది. ఇక వైసీపీ ఓటమికి రెండేళ్ళు పూర్తి అయిన వేళ జగన్ ఇంకా జనంలోకి రావడం లేదు అన్న చర్చ అయితే ఉంది.

వేదిక మీద నాయకుడు :

నాయకుడు అన్న వారు వేదిక మీద కనిపించాలి. జనానికి అందుబాటులో ఉండాలి. కానీ జగన్ మాత్రం తాను ఒక భారీ పాదయాత్ర ఎన్నికల ముందు చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి సరైన వేదికగా అసెంబ్లీ ఉంటుంది. సభ జరిగినన్నాళ్ళూ అక్కడ గొంతు ఎత్తి ప్రభుత్వ తీరు మీద విమర్శలు చేయవచ్చు. సభ లేని నాడు ప్రజా సమస్యల మీద పోరాటాలు జనంతో కలసి ఉద్యమించడాలు ఇలా చేస్తేనే వేదికలను సరిగ్గా ఉపయోగించుకున్నట్లు. ఆ మీదట ఎటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగే సోషల్ మీడియా ఉంటుంది. అధికారంలో ఉన్న వారు ఎపుడూ రాజకీయ తెర మీద మెరుస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా ఫోకస్ కావాల్సింది ప్రతిపక్షమే అని గుర్తు చేస్తున్నారు.

ట్వీట్లతోనే అంటేనే :

జగన్ అయితే ప్రతీ అంశం మీద ట్వీట్లు చేస్తున్నారు. అది బాగానే ఉంది కానీ దానిని దాటుకుని జనం వద్దకు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఎల్ నినో ఉంది. ఏపీలో ఖరీఫ్ సీజన్ సాగుతోంది. వర్షాభావం వల్ల రైతాంగం దిగాలుగా ఉంది. వారి సమస్యలను ఆలకించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అలాగే విద్యా సంస్థలు తెరచారు, దాంతో విద్యార్ధుల సమస్యలు ఉంటాయి అని గుర్తు చేస్తున్నారు. వీటికి తోడు ప్రపంచం ఆర్ధిక సంక్షోభం మూలంగా దేశంలో రాష్ట్రంలో ద్రవ్యోల్బనం ఉంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. ఆర్ధిక సవాళ్ళు అనేకం ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చూడాలే కానీ ప్రతిపక్షానికి కాదేదీ సమస్య అన్నట్లుగా ఉంటుంది. జగన్ జిల్లాల పర్యటనలు చేపట్టేందుకు ఇదే తగిన సమయం అని అంటున్నారు. రెండేళ్ళ కూటమి పాలన పూర్తి అయింది కాబట్టి సమస్యలు ఏమి ఉన్నాయో జనం మధ్యకు వచ్చి జగన్ తెలుసుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు. పనిలో పనిగా అసెంబ్లీకి కూడా వెళ్తే వైసీపీ పొలిటికల్ గ్రాఫ్ పెరుగుతుందని సూచిస్తున్నారు.

Tags:    

Similar News