ఒలింపిక్స్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సాధ్యమేనా? ఐసీసీ ట్విస్ట్ ఏంటంటే
క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. అది కోట్ల మంది అభిమానుల భావోద్వేగాల కలయిక.
క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. అది కోట్ల మంది అభిమానుల భావోద్వేగాల కలయిక. ప్రపంచకప్‌లలో లేదా ఆసియా కప్‌లలో ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ రేటింగులు బద్దలైపోతాయి. మైదానంలో ఆటగాళ్ల మధ్య.. మైదానం బయట అభిమానుల మధ్య ఉండే ఉత్కంఠ అంతా ఇంతా కాదు అయితే, రాబోయే రోజుల్లో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ వేదికగా ఈ చిరకాల ప్రత్యర్థుల పోరును చూసే అవకాశం ఉందా? అంటే ప్రస్తుత పరిస్థితులు.. నిబంధనలను పరిశీలిస్తే అది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది.
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్ రీ-ఎంట్రీ
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. దాదాపు 128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్‌లోకి అడుగుపెడుతుండటంతో క్రీడా ప్రపంచం ఎంతో సంబరపడుతోంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రికెట్ జట్ల సంఖ్య చాలా పరిమితంగా ఉండనుంది. పురుషుల, మహిళల విభాగాలలో కేవలం ఆరేసి జట్లకు మాత్రమే లీగ్ ఆడే అవకాశం కల్పించనున్నారు. ఈ పరిమిత జట్ల సంఖ్యే ఇప్పుడు భారత్-పాక్ క్లాష్ అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేస్తోంది.
అర్హత నిబంధనలు.. పాకిస్థాన్‌కు పెద్ద మైనస్
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ , అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రాథమికంగా రూపొందించిన అర్హత నిబంధనల ప్రకారం.. ప్రతి ఖండం నుంచి అత్యుత్తమ ర్యాంక్ కలిగిన ఒక జట్టుకే ప్రధాన ప్రాధాన్యం లభిస్తుంది. ఆసియా ఖండం పరంగా ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్, ప్రదర్శనల పరంగా టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాబట్టి ఆసియా కోటాలో భారత్‌కు ఒలింపిక్స్ అర్హత దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఆసియా ఖండంలో భారత్ కంటే వెనుక స్థానంలో ఉన్న పాకిస్థాన్‌కు అదే ఖండం నుంచి మరో స్లాట్ దక్కే అవకాశం చాలా తక్కువ. ప్రస్తుత రూల్స్ ప్రకారం ఒకే ఖండం నుంచి ఒక జట్టుకే ప్రాధాన్యం ఇస్తే, భారత్ ఎంపికైన వెంటనే పాక్ అవకాశాలు మూసుకుపోతాయి.
భారత్-పాక్ మ్యాచ్ సాధ్యం కావాలంటే ఏం జరగాలి?
ఒలింపిక్స్ వంటి గ్లోబల్ వేదికపై భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగాలంటే ముందుగా పాకిస్థాన్ కూడా టోర్నీకి అర్హత సాధించాలి. అందుకు ప్రస్తుతం ఉన్న క్వాలిఫికేషన్ విధానంలో మార్పులు రావాల్సి ఉంటుంది.
ఖండాల వారీ కోటా స్థానంలో పూర్తిగా ఐసీసీ ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా లేదా ప్రత్యేక క్వాలిఫైయర్ టోర్నమెంట్ల ద్వారా ఎక్కువ జట్లను ఎంపిక చేసే విధానాన్ని అమల్లోకి తేవాలి. అప్పుడే రెండు జట్లు ఒకేసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టే వీలుంటుంది.
ప్రపంచకప్‌లలో ఐసీసీ షెడ్యూల్స్ ఎలా ఉన్నా భారత్-పాక్ మ్యాచ్ ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేస్తారు. కానీ ఒలింపిక్స్‌లో ఐఓసీ నిబంధనలు కఠినంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఇలాంటి ప్రత్యేక మినహాయింపులు ఉండవు. భవిష్యత్తులో అర్హత నిబంధనల్లో ఐసీసీ ఏవైనా ఊరట కలిగించే మార్పులు తెస్తే తప్ప, అభిమానులు కలలుగంటున్న ఈ ఒలింపిక్ హై-వోల్టేజ్ మ్యాచ్ సాకారం కావడం ప్రస్తుతానికైతే చాలా కష్టమే..