టీమిండియాను చావుదెబ్బతీసిన భారతీయుడు.. ఎవరితను.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
జై మూండ్రా..! ఐర్లాండ్ జట్టు సభ్యుడైన ఇతడి పేరు వినగానే మొన్నటివరకు ఏ విదేశీ ఆటగాడో అనుకున్నారు.
టి20ల్లో ప్రపంచ చాంపియన్.. అది కూడా వరుసగా రెండోసారి..! మొత్తమ్మీద మూడుసార్లు ఈ ఫార్మాట్ లో విశ్వ విజేత..! వరసగా 16 సిరీస్ విజయాలు..! అటు చూస్తే.. పసికూన..! ఇటీవలే మనవాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దుమ్మురేపి ఉన్నారు.! కొత్త కెప్టెన్..! కొత్త వైస్ కెప్టెన్..! ఇంకేం.. అవతలి జట్టు తుక్కుతుక్కు కావడం ఖాయం..! ఇదీ ఐర్లాండ్ తో రెండు మ్యాచ్ ల టి20 సిరీస్ కు ముందు టీమ్ ఇండియా పరిస్థితి. అసలు ఈ సిరీస్ ఫలితం గురించి కాకుండా.. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని ఆడించాలి అనే డిమాండ్లు..! తీరా ఇప్పుడు చూస్తే.. 0-2తొ సిరీస్ కోల్పోయిన ఘోర ఓటమి. వాస్తవానికి ఐర్లాండ్ వంటి జట్టు చేతిలో టీమ్ ఇండియా ఓడిందని కాదు.. మన ఆటగాళ్లు గెలుపును మర్చిపోయారా? అనే విధంగా పరాభవం ఎదురైంది. దీనంతటికీ ప్రధాన కారకుల్లో ఒకడున్నాడు. అతడు కూడా మన భారతీయుడే కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.
ఇంతకూ అతడు ఎవరు?
జై మూండ్రా..! ఐర్లాండ్ జట్టు సభ్యుడైన ఇతడి పేరు వినగానే మొన్నటివరకు ఏ విదేశీ ఆటగాడో అనుకున్నారు. కానీ, తొలి టి20లో టీమ్ ఇండియాను దెబ్బకొట్టిన తర్వాత అతడు భారతీయుడే అని తేలింది. 29 ఏళ్ల మూండ్రా ఈ సిరీస్ తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఎడమచేతి వాటం పేస్ బౌలర్ అయిన ఇతడు రెండు మ్యాచ్ లలో ఐదు వికెట్లు పడగొట్టి టీమ్ ఇండియాను కోలుకోలేని దెబ్బతీశాడు. తొలి మ్యాచ్ లో 25 పరుగులకు రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన మూండ్రా.. ఆదివారం నాటి రెండో మ్యాచ్ లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో టీమ్ ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ ను వరుసగా రెండుసార్లు ఔట్ చేయడం గమనార్హం. రెండో మ్యాచ్ లో తొలి ఓవర్లోనే సంజూతో పాటు విధ్వంసక అభిషేక్ శర్మనూ పెవిలియన్ కు పంపి టీమ్ ఇండియాకు కోలుకునే చాన్స్ లేకుండా చేశాడు.
టోంక్ లో పుట్టి..
మూండ్రా 1997లో రాజస్థాన్ లోని టోంక్ లో పుట్టాడు. 2021లో ఎంటెక్ కోసం డబ్లిన్ వెళ్లాడు. అప్పటికి క్రికెట్ అనేది అతడి చివరి ప్రాధామ్యం. కానీ, ఇప్పుడు జీవితంలో టర్నింగ్ పాయింట్ గా మారింది. మొదట ఎడమచేతి వాటం స్పిన్నర్ అయినా.. తర్వాత ఫాస్ట్ బౌలర్ గా మారాడు. ఐర్లాండ్ రాజధాని డబ్లింగ్ లో లీగ్ క్రికెట్ ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. ఇక క్రికెట్ కోసం తన కార్పొరేట్ జాబ్ ను కూడా వదిలేసిన మూండ్రా.. ఇప్పుడు అందరి కంట్లో పడ్డాడు. తాజాగా భారత్ తో సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇతడే. రెండో మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా దక్కించుకున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ముండ్రాను ఏ ఫ్రాంచైజీ తీసుకుంటుందో చూడాలి.