వైఫ్ ఇండియా సపోర్టర్: పాక్ క్రికెటర్‌ని బతకనిస్తారా?

చరిత్రను పరిశీలిస్తే... క్రికెట్ వెలుప‌ల‌ భారతదేశం ఎల్లప్పుడూ ప్రతిభావంతులైన ఎందరో పాకిస్తానీ కళాకారులకు సపోర్ట్‌గా నిలిచింది.

Update: 2026-06-25 23:30 GMT

క్రికెట్ ప్రపంచంలో భారత్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. అదొక హై-వోల్టేజ్ ఎమోషన్. మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు గెలవడానికి సర్వశక్తులూ ఒడ్డుతుంటారు. అయితే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ ఇటీవల భారత్-పాక్ క్రికెట్ రైవల్రీ పై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. భారత్‌తో జరిగే మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఎందుకు వరుసగా ఓడిపోతోంది? మీ భారతీయ భార్య కారణంగానే పాక్ ఓడుతోందా? అని ప్ర‌శ్నించ‌గా, హసన్ అలీ స్పందిస్తూ.. తన భార్య తనకు మద్దతు ఇస్తుందని.. అయితే ఆమె భారతీయ మహిళ కాబట్టి భారత్ కూడా గెలవాలని కోరుకుంటుందని షాకింగ్ విషయాలను వెల్లడించారు.

భారతదేశానికి చెందిన ఫ్లైట్ ఇంజనీర్ సామియా అర్జూను హసన్ అలీ 2019లో దుబాయ్‌లో వివాహం చేసుకున్నారు, వీరికిద్దరు కుమార్తెలు ఉన్నారు. క్రికెట్ విషయంలో తమ ఇంట్లో ఎలాంటి గొడవలు లేదా విభేదాలు లేవని... సామియా వ్యక్తిగతంగా తనకు అండగా ఉంటూనే... మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం భారత్ విజయాన్ని ఆకాంక్షిస్తుందని హసన్ అలీ స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్ ఓటమికి భార్య సపోర్ట్ కారణం కాదని... భారత్ సరైన మార్గంలో పయనిస్తుండటమే అందుకు అసలు కారణమని ఆయన ఒప్పుకున్నారు. టీమిండియా అనుసరిస్తున్న అత్యుత్తమ క్రికెట్ వ్యవస్థే వారిని ప్రపంచ వేదికపై తిరుగులేని శక్తిగా నిలబెట్టిందని ఆయన కొనియాడారు.

భారత క్రికెట్ బోర్డు-బీసీసీఐ నడుపుతున్న ఐపీఎల్.. బలమైన డొమెస్టిక్ క్రికెట్ నిర్మాణం వల్ల భారత ఆటగాళ్లకు ఏడాది పొడవునా అత్యున్నత స్థాయి పోటీలో ఆడే అనుభవం లభిస్తుందని హసన్ అలీ విశ్లేషించారు. ఈ క్రమబద్ధమైన ప్రణాళికే భారత్‌ను ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చలాయించేలా చేస్తోందని... ప్రతీ పెద్ద టోర్నమెంట్‌లో స్థిరంగా రాణించగల బలమైన జట్టును తయారు చేసుకోవడానికి ఇది భారత్‌కు సహాయపడిందని అలీ పేర్కొన్నారు. గతంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్... 2021 టీ20 వరల్డ్ కప్‌లలో పాకిస్తాన్ భారత్‌పై చిరస్మరణీయ విజయాలు సాధించినా.. ఇటీవలి కాలంలో మాత్రం భారత్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తోందని ఆయన అంగీకరించారు.

నిజానికి వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్‌పై భారత్ అజేయమైన రికార్డును కలిగి ఉంది. టీ20 ప్రపంచకప్‌లతో పాటు ఆసియా కప్ హెడ్-టు-హెడ్ రికార్డులలోనూ టీమిండియాదే స్పష్టమైన పైచేయిగా సాగుతోంది. భారత్ సాధిస్తున్న తాజా ఐసీసీ విజయాలే వారి గ్లోబల్ హ‌వాకు నిదర్శనమని.. వారి విజయాలు కేవలం పాకిస్తాన్‌పై గెలవడానికే పరిమితం కాలేదని అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియా సమగ్ర బలానికి విజ‌యాలు అద్దం పడుతున్నాయని హసన్ అలీ వివరించారు.

చరిత్రను పరిశీలిస్తే... క్రికెట్ వెలుప‌ల‌ భారతదేశం ఎల్లప్పుడూ ప్రతిభావంతులైన ఎందరో పాకిస్తానీ కళాకారులకు సపోర్ట్‌గా నిలిచింది. గాయకుడు అద్నాన్ సమీని సాదరంగా ఆదరించడమే కాకుండా... ఎందరో పాకిస్తానీ నటీనటులు బాలీవుడ్‌లో నటించి ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారి సినిమాలు కూడా ఇక్కడ ఆడాయి. మంచిత‌నం భార‌త్ వైపు ఉంది గ‌నుక‌నే ఇది సాధ్య‌మైంది. కానీ తీవ్రవాదులు జరిపిన పహల్గామ్ దాడులు... ఆపై జరిగిన `ఆపరేషన్ సింధూర్` వంటి పరిణామాల తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు, సంబంధాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతానికైతే మైదానం వెలుపల ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా... మైదానంలో మాత్రం భారత క్రికెట్ బోర్డు నిర్మించిన పటిష్టమైన పునాదే వారి విజయాలకు కారణమని ఒక పాక్ ఆటగాడే బహిరంగంగా ఒప్పుకోవడం విశేషం. హాస‌న్ అలీ కంటే ముందే పాకిస్తాన్ క్రికెట‌ర్ అఫ్రిదీ బీసీసీఐ నేరుగా విచ‌క్ష‌ణ‌తో రాజ‌కీయాల‌కు తావివ్వ‌కుండా, ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించే విధానంపై ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. త‌మ దేశంలో అయితే క్రికెట్ గాడ్ అయిన‌ స‌చిన్ టెండూల్క‌ర్ వార‌సుడిని ప్ర‌తిభ‌తో సంబంధం లేకుండా జాతీయ టీమ్ లో ఆడించేస్తార‌ని, ఇండియాలో అలా కుద‌ర‌ద‌ని స‌చిన్ వార‌సుడు అర్జున్ ఐపిఎల్ 2026లో డ్రెస్సింగ్ రూమ్ కే ప‌రిమిత‌మైన వైనాన్ని ఎత్తి చూపారు.

Tags:    

Similar News