మా పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు వంట బాగా చేస్తారు.. క్రికెట్ చేతకాదు.. ఆఫ్రిది పరువు తీసేశాడు

అవును పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి తన అద్భుతమైన "జ్ఞానాన్ని" లోకానికి చాటుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ ట్రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.

Update: 2026-06-23 12:19 GMT

క్రికెట్ మైదానంలో ఉన్నప్పుడు బంతిని ఎటు పడితే అటు బాదడం మన 'బూమ్ బూమ్' అఫ్రిదికి అలవాటే. అయితే ఈసారి ఆయన తన నోటి దురుసు బ్యాట్‌తో ఒకే దెబ్బకు ఇటు మహిళా క్రికెటర్లను, అటు చైనా దేశాన్ని కలిపి సరిహద్దులు దాటించేశారు. అవును పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి తన అద్భుతమైన "జ్ఞానాన్ని" లోకానికి చాటుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ ట్రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.

అసలేమన్నారు మన 'యంగ్' అఫ్రిది?

ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న అఫ్రిదికి, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు ఎదుగుదలపై ఒక ప్రశ్న ఎదురైంది. దానికి మన మాజీ కెప్టెన్ ఇచ్చిన సమాధానం వింటే ఆధునిక సమాజం ఒక్కసారిగా కోమాలోకి వెళ్లడం ఖాయం. "క్రికెట్ అనేది రక్తంలో ఉంటేనే ఆడగలరు. ఉదాహరణకు చైనీయులు అస్సలు క్రికెట్ ఆడలేరు, ఎందుకంటే అది వాళ్ల రక్తంలో లేదు. మరి మన పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు సంగతి అంటారా? వాళ్లు వంటలు చాలా బాగా చేస్తారు. ఎందుకంటే రుచికరమైన వంటలు చేయడం మన మహిళల రక్తంలోనే ఉంది." అని వరుస ఓటములపై ఎద్దేవా చేశారు. అబ్బా.. ఎంతటి లోతైన విశ్లేషణ.. అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున పరుగుల వరద పారిస్తున్న మహిళా క్రికెటర్ల చేతికి బ్యాట్ తీసేసి, నేరుగా గరిటెలు, బాండీలు ఇచ్చేసిన అఫ్రిది గారి క్రీడా స్ఫూర్తికి నెటిజన్లు జోహార్లు అర్పిస్తున్నారు.

నెటిజన్ల రియాక్షన్.. ట్రోల్స్ పండగ

అఫ్రిది గారు అంతటి మేధోసంపత్తితో మాట్లాడిన తర్వాత సోషల్ మీడియా ఊరుకుంటుందా? ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో నెటిజన్లు అఫ్రిదిపై మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. "అఫ్రిది గారూ.. ఇంకా మీరు 18వ శతాబ్దంలోనే బతుకుతున్నారా? మహిళలు మైదానంలో సిక్సర్లు కొడుతుంటే, మీకు మాత్రం వారు చేసే బిర్యానీలే గుర్తొస్తున్నాయా?" అంటూ ఒకరు మండిపడ్డారు.

ఒలింపిక్స్‌లో పతకాల వేటలో దూసుకుపోయే చైనాకు క్రికెట్ ఆడటం రాదని అఫ్రిది సర్టిఫికేట్ ఇవ్వడంపై కూడా నవ్వులు పూస్తున్నాయి. "చైనా వాళ్లు ఏ క్రీడనైనా ప్రాక్టీస్‌తో సాధిస్తారు, మీలాగా రక్తం గ్రూపులు చూసి టీమ్‌ని సెలెక్ట్ చేయరు" అంటూ కొందరు క్రీడాభిమానులు చురకలు అంటించారు.

పీసీబీ సైలెన్స్.. ఎందుకంటే?

మహిళా క్రికెటర్ల ప్రతిభను ఇంతలా కించపరిచినా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం 'మాకేం పట్టనట్టు' మౌన వ్రతం వహించింది. బహుశా బోర్డు పెద్దలు కూడా అఫ్రిది గారి వంటకాల వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని, తదుపరి సిరీస్‌కు మహిళా జట్టుకు కోచ్‌లను పంపాలో లేక చెఫ్‌లను పంపాలో అని తీవ్రంగా ఆలోచిస్తున్నారేమో!

ఏది ఏమైనా రిటైర్మెంట్ ప్రకటించి, ఇప్పటికీ 'యంగ్ క్రికెటర్' అనిపించుకోవాలని ఆరాటపడే అఫ్రిది.. ఆలోచనల్లో మాత్రం ఇంకా పాతకాలపు ఆలోచనలనే మోస్తున్నారని ఈ ఘటనతో మరోసారి రుజువైంది. పిచ్‌పై డకౌట్ అవ్వడం అఫ్రిదికి కొత్తేమీ కాదు కానీ ఇలా సమాజం ముందు 'లింగ వివక్ష' వ్యాఖ్యలతో క్లీన్ బౌల్డ్ అవ్వడం మాత్రం ఆయనకే చెల్లింది.

Tags:    

Similar News