సీఐ నాగ‌రాజుకు బిగ్ రిలీఫ్‌!

విజ‌య‌వాడ కృష్ణ‌లంక‌కు చెందిన‌ సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఐ నాగ రాజుకు స్థానిక కోర్టు నుంచి బిగ్ రిలీఫ్ ల‌భించింది.

Update: 2026-06-29 17:56 GMT

విజ‌య‌వాడ కృష్ణ‌లంక‌కు చెందిన‌ సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఐ నాగ రాజుకు స్థానిక కోర్టు నుంచి బిగ్ రిలీఫ్ ల‌భించింది. ప్ర‌స్తుతం రిమాండ్ ఖైదీగా రాజ‌మండ్రి జైల్లో ఉన్న నాగ‌రాజు.. త‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని... జైలు భోజ‌నం ప‌డ‌డం లేద‌ని పేర్కొంటూ.. కోర్టులో పిటిష‌న్ వేయ‌డంతో దీనిని స్థానిక కోర్టు విచార‌ణ‌కు తీసుకుంది.

త‌న‌కు ఇంటి నుంచి భోజ‌నం వ‌చ్చేందుకు అనుమ‌తించాల‌న్న నాగ‌రాజు విజ్ఞ‌ప్తికి కోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే.. దీనిపై అభ్యంత‌రం చెప్పేందుకు ఇటు సాయికృష్ణ త‌ర‌ఫున న్యాయ‌వాది కానీ, అటు పోలీసుల త‌ర‌ఫున న్యాయ‌వాది కానీ నిరాకరించ‌డంతో కోర్టు ఈ నిర్ణ‌యం తీసుకుంది. జైలు వేళ‌ల్లో ఇంటి నుంచి భోజ‌నం అందించేందుకు వీలుగా కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇదిలావుంటే, సాయికృష్ణ అదృశ్యం కేసులో మ‌రింత విచార‌ణ జ‌ర‌పాల్సి ఉంద‌ని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో సీఐ నాగ‌రాజును త‌మ క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కేసును తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నామ‌ని పేర్కొన్నారు. సాయికృష్ణ చ‌నిపోయాడా? అదే జ‌రిగితే మృత దేహం ఏమైంది? అనే విష‌యాల‌పై వివ‌రాలు రాబ‌ట్టాల్సి ఉంద‌ని తెలిపారు.

ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేసిన విజ‌య‌వాడ కోర్టు.. నాగ‌రాజు త‌ర‌ఫున న్యాయ‌వాదిని వివ‌ర‌ణ కోరింది. అయితే.. తాము కౌంట‌ర్ పిటిష‌న్ వేస్తామ‌ని చెప్ప‌డంతో కోర్టు ఈ వ్య‌వ‌హారాన్ని వాయిదావేసింది. సోమ‌వారం నాటి విచార‌ణ‌కు సాయికృష్ణ కుటుంబ స‌భ్యులు, నాగ‌రాజు కుటుంబ స‌భ్యులు కూడా కోర్టుకు హాజ‌ర‌య్యా రు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ప‌టిష్ఠ‌మైన భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు.

Tags:    

Similar News