ఈ టెకీ నెల ఖర్చు రూ.71 వేలు.. ‘బెంగళూరులో ఇదేం పెద్ద అమౌంట్ కాదు’ అంటూ నెట్టింట హాట్ టాపిక్
మెట్రో నగరాల్లో జీవన వ్యయం రోజురోజుకూ ఏ రేంజ్‌లో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఐటీ హబ్ అయిన బెంగళూరులో సామాన్యుల నుంచి టెకీల వరకు ఖర్చుల భారం మోయలేకపోతున్నారు.
మెట్రో నగరాల్లో జీవన వ్యయం రోజురోజుకూ ఏ రేంజ్‌లో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఐటీ హబ్ అయిన బెంగళూరులో సామాన్యుల నుంచి టెకీల వరకు ఖర్చుల భారం మోయలేకపోతున్నారు. తాజాగా ఇదే విషయంపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. బెంగళూరుకు చెందిన అంజలి అనే ఐటీ ఉద్యోగిని తన నెలవారీ ఖర్చుల వివరాలను బహిరంగంగా వెల్లడించిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
నెల ఖర్చు రూ.71 వేలు.. దేనికి ఎంతంటే?
అంజలి తన వీడియోలో మే నెలలో చేసిన ఖర్చుల లెక్కలను క్లియర్‌గా వివరించారు. నెలకు సుమారు రూ.71 వేల వరకు ఖర్చయిందని చెబుతూ.. బెంగళూరు వంటి మెట్రో సిటీలో ఒక ఒంటరి వ్యక్తికి ఈ మాత్రం ఖర్చు అవ్వడం చాలా సాధారణమైన విషయమేనని.. ఇదేం పెద్ద అమౌంట్ కాదని ఆమె వ్యాఖ్యానించారు.
అంజలి వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె 1 బీహెచ్.కే ఇంటి అద్దె కోసం ప్రతి నెల రూ.28 వేల వరకు చెల్లిస్తున్నారు. ఆహారం కోసం సుమారు రూ.7 వేలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. వీకెండ్ షాపింగ్, వ్యక్తిగత అవసరాల కోసం మరో రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వెచ్చిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా ట్రావెలింగ్, టూర్లు, వినోద కార్యక్రమాల కోసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా అన్ని ఖర్చులు కలిపి మే నెలలో రూ.71 వేల వరకు వ్యయం అయినట్లు ఆమె వీడియోలో పేర్కొన్నారు.
నెటిజన్లలో మిశ్రమ స్పందన.. భగ్గుమంటున్న కామెంట్లు
ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి మరీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు అంజలి వాదనను సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం ఆమె లైఫ్‌స్టైల్‌ను తప్పుబడుతున్నారు. "బెంగళూరులో ప్రస్తుతం ఉన్న అద్దెలు, ఐటీ కల్చర్‌ను బట్టి చూస్తే ఒక ఒంటరి మహిళకు రూ.71 వేలు ఖర్చు కావడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. అక్కడ కనీస వసతులకు కూడా భారీగా చెల్లించాల్సి వస్తోంది" అని కొందరు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు ఆమె లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి. "రూ.71 వేలు సాధారణ మొత్తమా? అసలు ఇంత ఖర్చు పెడుతున్నావంటే నీ నెల జీతం ఎంతో చెప్పాలి!" అని ఒకరు ప్రశ్నించగా.. "కేవలం షాపింగ్, వినోదాలకే రూ.30 వేలకు పైగా తగలేస్తూ, బెంగళూరులో ఖర్చులు ఎక్కువ అనడం కరెక్ట్ కాదు. ఇది అవసరానికి మించి ఖర్చు చేసే లైఫ్‌స్టైల్" అంటూ మరికొందరు చకితులవుతున్నారు. మరికొందరైతే.. "డబ్బు ఖర్చు పెట్టడానికే పుట్టినట్టుంది" అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు.
వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఆదాయ వనరులు, ఎంచుకునే జీవన విధానాన్ని బట్టి ఎవరి ఖర్చులు వారికే ప్రత్యేకంగా ఉంటాయనేది వాస్తవం. అయినప్పటికీ ఈ వీడియో ద్వారా మెట్రో నగరాల్లో పెరుగుతున్న అద్దెలు, యువత ఖర్చుల అలవాట్లు, మిడిల్ క్లాస్ ఐటీ ఉద్యోగుల ఆర్థిక మేనేజ్‌మెంట్‌పై సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు తెరలేపింది. ప్రస్తుతం లక్షలాది వ్యూస్‌తో ఈ టెకీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.