ప్రపంచంలో రైట్ వింగ్ ప్రెసిడెంట్స్ అందరికీ ప్రజలు వ్యతిరేకం !

ఈ రోజున ప్రపంచంలో అంతటా పెద్ద ఎత్తున అధికారంలో ఉన్న వారి మీద ప్రజలు తిరగబడుతున్నారు.

Update: 2026-10-20 17:30 GMT

ఈ రోజున ప్రపంచంలో అంతటా పెద్ద ఎత్తున అధికారంలో ఉన్న వారి మీద ప్రజలు తిరగబడుతున్నారు. వీధుల్లోకి వచ్చి మరీ అన్నీ తగలబెడుతున్నారు. వారి విధానాల పట్ల కన్నెర్ర చేస్తున్నారు. మీ సిద్ధాంతాలకు మేము పూర్తిగా ప్రతికూలం అంటూ రాద్ధాంతం చేస్తున్నారు. ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా విశ్వం సమస్తం మొత్తం జనం ధర్మాగ్రహంగా పరిస్థితి కనిపిస్తోంది. గద్దెనెక్కిన ఏలికల పాలన నచ్చడం లేదు, అందుకే ఏకి పారేస్తున్నారు. సాదా సీదా జనమే అనుకుంటే ఏకు మేకు అవుతున్నారు. అధికారాన్ని డేరింగ్ అండ్ డేషింగ్ గా ఎదురొడ్డుతున్నారు. జనమంతా కూడి బలమైన కోటలనే కూల్చేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే ఇదీ కళ్లకు కనిపిస్తున్న పరిస్థితి. ఇది దుస్థితినా లేక దుర్నీతి మీద సాగుతున్న పోరునా అన్నది అయితే పక్కన పెడితే జనాలు మాత్రం సహించేది లేదు, భరించేది లేదని అంటున్నారు. మీ చేతగాని పాలన చాలు అని చెక్ చెప్పేస్తున్నారు.

ట్రంప్ నుంచి మొదలెడితే :

ఈ రోజున అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాలోనే జనాల అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద పీకల దాకా కోపం అయితే ప్రజలలో ఉంది అని అంటున్నారు ఆయన రెండేళ్ల ప్రెసిడెంట్ గిరీ పూర్తి చేసుకున్న వేళ ఇంకా సగమే పూర్తి అయిందా అని జనాలు భారంగా వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు అంటే ట్రంప్ కి జనం రెడ్ సిగ్నల్ చూపిస్తున్నట్లుగానే విశ్లేషణలు ఉన్నాయి. అమెరికా ట్రంప్ కి ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎలా వచ్చింది అంటే ఆయన యుద్ధ పిపాసి కావడం వల్లనే అంటున్నారు. లేని పోని యుద్ధాలు తెచ్చి అమెరికాను సర్వనాశనం చేశారు అన్నది మెజారిటీ జనం భావనగా ఉంది మరి. ట్రంప్ అమలు చేస్తున్న విధానాల పట్ల ప్రజలు మండిపోతున్నారు. అంతే కాదు దేశం మొత్తం అభద్రతాభావానికి వెళ్ళిపోయింది అన్నది గట్టిగా వినిపిస్తున్న మాట.

ఫ్రాన్స్ లో మంటలు :

ఇదిలా ఉంటే ఫ్రాన్స్ లో మంటలు చెలరేగుతున్నాయి. అక్కడ జనాగ్రహానికి కారణం జీవన వ్యయం పెరుగుదలతో పాటు ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు విద్యార్థులు పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనలు ఇపుడు తీవ్ర హింసాత్మకంగా మారాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తి ఈ స్థాయి అల్లర్లకు కారణమైంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి రావడంతో పాటు పలు నగరాలలో జరుగుతున్న విద్వంశానికి భారీగా మంటలు చెలరేగుతున్నాయి. అనేక నగరాలలో అల్లర్లు పెచ్చుమీరాయి. దీంతో రాజధాని పారిస్‌తో పాటు లిమోజెస్, లియోన్, మార్సేల్, బోర్డో వంటి ప్రముఖ నగరాల్లో నిరసనకారులు వాహనాలకు ప్రభుత్వ భవనాలకు ఏకంగా నిప్పు పెట్టేశారు. ఈ మంటలలో లిమోజెస్ సిటీలోని చారిత్రక టౌన్ హాల్ తగలబడిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వేలల్లోనే నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం పారిస్ సహా పలు నగరాల్లో రాత్రి వేళ పాక్షిక కర్ఫ్యూలను విధించింది.

యూకేలో పాలకుల మార్పు :

ఇక యూకేలో చూస్తే పాలనాపరమైన అస్థిరత వెంటాడుతోంది. ఎవరు అధికారం చేపట్టినా పూర్తి కాలం పదవిలో కొనసాగలేకపోతున్నారు. గత పదేళ్ల కాలంలో అనేక మంది ప్రధానులు మారిపోయారు. 2016 నుంచి ఇప్పటిదాకా ఏడుగురు ప్రధానులు బాధ్యతలు చేపట్టారు అంటే సగటున ప్రతీ పదిహేను నెలలకూ ఒక ప్రధాని మారిపోతున్నారు అన్న మాట. ఇందులో కేవలం 49 రోజులు ప్రధానిగా లిజ్ ట్రస్ రికార్డు క్రియేట్ చేశారు. యునైటెడ్ కింగ్ డం పాలకుల తీరు పట్ల జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం ఇంధన ధరల పెరుగుదల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సాధారణ ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడింది. ప్రభుత్వం తీసుకుంటున్న కఠినమైన ఆర్థిక నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతకు దారితీస్తున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి.

సౌదీ పశ్చిమాసియాలోనూ :

ఇక సౌదీ అరేబియా పశ్చిమాసియాలో అయితే ఘర్షణలతో అంతటా వేడెక్కిపోతోంది. అమెరికా మద్దతుతో సాగుతున్న యుద్ధాలతో అంతటా మారణహోమం సాగుతోంది. అక్కడంతా సర్వ నాశనం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రజలు అయితే ఎవరూ సాధారణ జీవితాన్ని గడపడం లేదు. చావు బతుకుల మధ్యన వారు ఊగిసలాడుతున్నారు. యుద్ధంలోనే మునిగితేలుతున్న నేపథ్యం ఉంది. దీనికి అమెరికా ప్రధాన కారణం అన్న భావన సర్వత్రా ఉంది. ఆ దేశ విధానాలతో పశ్చిమాసియా మండిపోతోంది అన్నది అంతర్జాతీయంగా ఉన్న విశ్లేషణ.

ఇండియాలో సైతం :

ఇక చూస్తే ఇండియాలో సైతం ఆందోళనలు చెలరేగుతున్నాయి. సీజేపీ పేరుతో గత కొద్ది నెలలుగా ఢిల్లీ వేదికగా సాగుతున్న నిరసనలు పాలక పక్షానికి కునుకు తీయనీయడం లేదు. ఏకంగా ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేశారు అంటే అది ఎన్డీయే సర్కార్ బలమైన కోటకు బీటలు వార్చింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇలా చూస్తే రైట్ వింగ్ పాలకులకు అధినేతలకు ఇవి పూర్తిగా గడ్డు రోజులుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే యూరప్ లో చాలా చోట్ల రైట్ వింగ్ ఫిలాసఫీతో సాగుతున్న పాలకులకు ఉద్యమాలతో లెఫ్ట్ సిగ్నల్స్ పడుతున్నాయి. ప్రజల కోసం కాకుండా తాము నమ్ముకున్న సిద్ధాంతాల మీద మమకారంతో అధికారం చూపించాలనుకుంటే కచ్చితంగా ఉద్యమాలు లేస్తాయని ప్రపంచం ఈ రోజు స్పష్టం చేస్తోంది. మరి వీటిని ఆపడం చల్లార్చడం ఎలా అంటే పాలన తీరులు పాలకుల విధానాలలో భారీ మార్పులు రావాలని ప్రజా కోణంలో నుంచి వారు ఆలోచించాలని అంటున్నారు.

Tags:    

Similar News