200 మంది మృతి: ఆక‌లితో చ‌చ్చిపోతే దేవుడు క‌నిపిస్తాడా.. !

దేవుడిని చూడాలి.. ఆయ‌న‌తో మాట్లాడాలి.. ఇదీ ఈ మ‌ధ్య ట్రెండుగా మారిపోయింది.

Update: 2026-10-20 12:43 GMT

దేవుడిని చూడాలి.. ఆయ‌న‌తో మాట్లాడాలి.. ఇదీ ఈ మ‌ధ్య ట్రెండుగా మారిపోయింది. దేవుడు మాకు క‌నిపిస్తాడు.. మేం ఆయ‌న‌తోమాట్లాడ‌తాం.. అని చెప్పుకొనే మ‌త గురువులు కూడా పెరుగుతున్నారు. ఇదంతా నిజ‌మేన‌ని న‌మ్మేస్తున్న అమాయ‌క భ‌క్తులు ఆ గురువుల వ‌ల‌లో చిక్కుకుని స‌ర్వం కోల్పోతున్నారు. ఆస్తులు.. పాస్తులు.. వ‌స్తువులు పోతేపోనీ అనుకుంటే.. ఏకంగా గురువుల మాయ‌లో ప‌డి.. ప్రాణాలు కూడా కోల్పోయిన ఘ‌ట‌న‌లు త‌ర‌చుగా క‌నిపిస్తున్నాయి.

ఇటీవ‌ల రాజ‌స్థాన్‌లో మూఢ విశ్వాసానికి గురైన త‌ల్లీకూతుళ్లు నిద్రాహారాలు మాని.. పూజ‌లు చేయ‌డంతో నిస్సార‌మై ప్రాణాలు కోల్పోయారు. దీనికి కార‌ణం.. వారికి ప‌రిచ‌య‌మైన ఓ గురువు.. వారంపాటు నిద్రాహారాలుమానేసి ప్రార్థిస్తే.. దేవి క‌రుణిస్తుంద‌ని.. కోరిన కోరిక‌లు నెర‌వేరుస్తుంద‌ని న‌మ్మించ‌డ‌మే!. ఇలా.. భ‌క్తుల విశ్వాసాల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్న గురువుల కార‌ణంగా అమాయ‌కులు బ‌లి అవుతున్నారు.

తాజాగా కెన్యాలో ఏకంగా 200 మంది భ‌క్తులు ఆక‌లితో మ‌రణించారు. దీనికి కార‌ణం.. మ‌త గురువు ఒక‌రు దేవుడు క‌నిపించాలంటే.. ఆక‌లితో ఉండి ప్రార్థ‌న‌లు చేయాల‌ని.. క‌నీసం చుక్క‌నీరు కూడా ముట్ట‌రాద‌ని ప్ర‌బోధించ‌డ‌మే. పాపం అమాయ‌క భ‌క్తులు ఆయ‌న‌ను న‌మ్మేసి... ఆక‌లితోనే ప్రార్థ‌న‌లు చేశారు. నీరు కూడా ముట్ట‌లేదు. దీంతో వారంతా నిస్సార‌మై ప్రాణాలు కోల్పోయారు. స్వయం ప్రకటిత మతబోధకుడు పాల్‌ మెకెంజీ చేసిన నిర్వాకం వెలుగు చూడ‌డంతో కెన్యా ప్ర‌భుత్వం ఆయ‌న‌ను అరెస్టు చేసింది.

ఎందుకిలా..

దేవుడిని చూడాల‌ని భావించే మూఢ విశ్వాసం ప్ర‌జ‌ల్లో పెంచేసి..త‌మ‌ను తాము దైవ దూత‌లుగా ప్ర‌చారం చేసుకునే వారు పెరుగుతున్నారు. ఇలానే మెకంజీ కూడా కెన్యాలో ప్ర‌భు ఆరాధ‌కుల‌ను న‌మ్మించాడు. ఓ అట‌వీ ప్రాంతంలో ప్ర‌త్యేక కుటీరం ఏర్పాటు చేసుకుని వారిని అక్క‌డ‌కు ర‌ప్పించి.. రోజుల త‌ర‌బ‌డి చుక్క‌నీరు కూడా లేకుండా.. ప్రార్థ‌న‌లు చేయించాడు. ఇలా.. చేసిన వారు.. ఆక‌లితో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో మెకంజీని కోర్టుదోషిగా నిర్ధారించింది.

అయితే.. ఇంకా శిక్ష విధించ‌లేదు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఆక‌లితో దేవుడిని క‌లుసుకోవ‌చ్చ‌ని చెబుతున్న మెకంజీ మాత్రం.. నిత్యం ఆహారం తీసుకోవడం గ‌మ‌నార్హం. అదేమంటే.. తాను స్వ‌ప్నంలో ద‌ర్శిస్తాన‌ని.. భ‌క్తులు నేరుగా క‌ల‌వాలంటే ఉప‌వాసాలు చేస్తేనే సాధ్య‌మ‌ని కోర్టులో కూడా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News