స్టాలిన్ ఫ్యూచర్ ప్లాన్.. ఉదయనిధి కోసం కీలక నిర్ణయం
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా అధికార టీవీకే టార్గెట్ గా విపక్షం డీఎంకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా అధికార టీవీకే టార్గెట్ గా విపక్షం డీఎంకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అటు టీవీకే కూడా డీఎంకేను ఎదుర్కొనేందుకు అంతే దీటుగా పనిచేస్తోందని చెబుతున్నారు. ఇక రెండు పార్టీలకు త్వరలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలు అగ్ని పరీక్ష కాబోతున్నాయని విశ్లేషిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీకి గత ఏప్రిల్ లో సాధారణ ఎన్నికలు జరగ్గా, రెండు చోట్ల నెగ్గిన ముఖ్యమంత్రి దళపతి విజయ్ రాజీనామాతో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అదే సమయంలో అన్నాడీఎంకేకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తారని అంటున్నారు.
మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే, అన్నిచోట్ల గెలిచి ప్రభుత్వానికి సుస్థిరత తీసుకురావాలని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ భావిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం శాసనసభలో టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు భేషరతుగా మద్దతు ఇస్తున్నారు. దీంతో టీవీకే ప్రభుత్వం బలం 112కు చేరింది. ఇక వీసీకే, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కి చెందిన మరో ఇద్దరు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వ బలం 120కి చేరింది. మేజిక్ ఫిగర్ 118 కావడంతో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణంచేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
అయితే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వీసీకే, కమ్యూనిస్టు, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు డీఎంకే కూటమితో సన్నిహితంగా ఉండటంతో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం మనుగడకు ముప్పుగా భావిస్తున్నారు. దీంతో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేసి అన్నాడీఎంకేకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని రాజీనామాలు చేయించినట్లు చెబుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం కొనసాగడానికి ఇతర మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి విజయ్ ప్లాన్ ను పసిగట్టిన మాజీ సీఎం స్టాలిన్ త్వరలో జరగబోయే ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఉప ఎన్నికల్లో ఒక్కచోట కూడా టీవీకే గెలవకూడదని భావిస్తున్న స్టాలిన్ తాను కూడా స్వయంగా రంగంలోకి దిగుతారని కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి స్టాలిన్ పోటీ చేయాలని ఆయన అభిమానులతోపాటు స్థానిక నాయకులు కోరుతున్నారు. అదేసమయంలో విజయ్ ను ఎదుర్కోడానికి తాను రంగంలోకి దిగాలని స్టాలిన్ కూడా నిర్ణయించుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ ఊహాగాలకు తెరదించుతూ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి విజయ్ పాలన ఆరు నెలల ముచ్చటగా చెబుతూనే, తాను తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయడం లేదని తేల్చేశారు. మాజీ సీఎం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకోడానికి ప్రధాన కారణం తన కుమారుడు, విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ భవిష్యత్తే అంటున్నారు.
ప్రస్తుతం విపక్ష నేతగా పనిచేస్తున్న ఉదయనిధి సభలో సమర్థంగా పనిచేస్తున్నట్లు స్టాలిన్ భావిస్తున్నారని అంటున్నారు. డీఎంకే భావి నేతగా ఉదయనిధి కెరీర్ తీర్చిదిద్దాలంటే తాను అడ్డుగా ఉండకూడదని, తిరుచ్చి ఈస్ట్ లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడితే ఉదయనిధికి అవకాశాలు తగ్గిపోతాయని, మొత్తం అందరి అటెన్షన్ తనపై ఉంటుందని స్టాలిన్ ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కుమారుడిలో నాయకత్వ ప్రతిభను వెలికి తీయడంతోపాటు ముఖ్యమంత్రి విజయ్ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా తాను నడుచుకోవాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం స్టాలిన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. విజయ్ స్పీడ్ కు బ్రేకులు వేయడానికి తాను ఎక్కడున్నా ఒకటేనని, కానీ ఉదయనిధి ప్రతిభకు అడ్డుగోడగా నిలవకుండా ఉండటమే ముఖ్యమనే ఆలోచనతో పోటీ చేయకూడదని స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.