తెలంగాణ బీజేపీ నాయకత్వానికి గట్టి క్లాస్ పీకిన నితిన్ నబీన్

తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు.., రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ నితిన్ నబీన్ గట్టి క్లాస్ పీకారు.

Update: 2026-06-29 09:43 GMT

తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు.., రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ నితిన్ నబీన్ గట్టి క్లాస్ పీకారు. "పొత్తులెందుకు.. సొంత బలంపైనే గెలవాలి" అంటూ నాయకులకు చురకలు అంటించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర బీజేపీ కీలక నేతల సమావేశంలో ఆయన భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ తీరు, నేతల మధ్య సమన్వయ లోపంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

బాహ్య మద్దతుపై ఆశలు వద్దు.. నితిన్ నబీన్

తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి.. ఇతర పార్టీల మద్దతు లేదా పొత్తులపై ఆధారపడే ఆలోచనను పక్కనబెట్టాలని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. "రాజకీయాల్లో బాహ్య మద్దతు వస్తుందని ఎదురుచూడటం మానేయండి. మీరే సొంతంగా గెలిచే పరిస్థితులను సృష్టించాలి. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కష్టపడితేనే విజయం సాధ్యమవుతుంది" అని ఆయన నొక్కి చెప్పారు.

కఠినమైన రాజకీయ వాతావరణం ఉన్న పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనే బీజేపీ బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ప్రస్తుతం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు దానిని ఓట్లుగా మార్చుకోవడంలో నాయకత్వం విఫలం కాకూడదని హెచ్చరించారు.

అంతర్గత విభేదాలపై అసంతృప్తి

పార్టీ అనుకూల పవనాలు ఉన్నప్పటికీ నేతల మధ్య సమన్వయ లోపం, నిర్ణయాల్లో జాప్యం, కొందరు నాయకుల నిష్క్రియాపరత్వం పార్టీ ఎదుగుదలకు ఆటంకంగా మారాయని నితిన్ నబీన్ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత రాజకీయాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రతి ఒక్కరూ ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, స్థానిక నేతల పనితీరుపై అధిష్ఠానానికి ఎప్పటికప్పుడు పూర్తి నివేదికలు అందుతున్నాయి. పార్టీలో క్రమశిక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఉంటుంది. దాన్ని ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని నితిన్ హెచ్చరించినట్టు సమాచారం.

గ్రేటర్ హైదరాబాద్, మున్సిపల్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నితిన్ నబీన్ ఆదేశించారు. కీలకమైన పట్టణ స్థానిక సంస్థల్లో విజయం సాధించేలా ఇప్పుడే ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.

మొత్తానికి పొత్తుల ముచ్చట పక్కన పెట్టి సొంతంగా సత్తా చాటాలంటూ నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ హెచ్చరికల తర్వాత రాష్ట్ర నేతల పనితీరులో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News