హైదరాబాద్ లో ఇదేం దారుణం? గృహప్రవేశం వేళ ఇంటిపై మూకుమ్మడి దాడి
హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం షాకింగ్ గా మారటమే కాదు నోట మాట రాని విధంగా తయారైంది.
హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం షాకింగ్ గా మారటమే కాదు నోట మాట రాని విధంగా తయారైంది. ఇదేం దారుణం? అన్నట్లుగా విషయం ఉంది. ఇలాంటి దుర్మార్గమైన కల్చర్ సంగతి చూడటమే కాదు.. ఇలాంటి తీరు పట్ల కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గృహప్రవేశం వేడుక జరుగుతున్న ఒక ఇంటి మీదకు కొందరు మూకుమ్మడిగా రావటమే కాదు.. ఇష్టం వచ్చినట్లుగా దాడి చేయటమే కాదు.. భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించిన తీరు ఆందోళనకు గురి చేసేలా మారింది. ఇంటిని కొనాలనుకున్న ఒకరు.. ధర విషయంలో తేడా రావటంతో కొనలేకపోవటం ఒక ఎత్తు అయితే.. యజమాని కోరుకున్న ధరకు ఇంటిని కొనుగోలు చేసిన మరో వ్యక్తి ఆనందంగా గృహప్రవేశ వేడుకను నిర్వహించుకునే సమయంలో.. ఇంటిని కొనాలని ఆశ పడిన వ్యక్తి తాను అనుకున్నది జరగలేదన్న కోపంతో.. కొందరిని పంపి దారుణంగా దాడి చేయటం.. ఇష్టం వచ్చినట్లుగా కొట్టించి.. తీవ్రంగా గాయపరిచిన వైనం చూస్తే నోట మాట రాదంతే.
హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అంబర్ పేటకు చెందిన కుశాల్ అనే వ్యక్తికి బోడుప్పల్ లో రెండంతస్తుల ఇల్లు ఉంది. దాన్ని అమ్మకానికి పెట్టగా..యాకయ్య అనే వ్యక్తి దాన్నికొనేందుకు ముందుకు వచ్చాడు. అయితే..ధర విషయంలో యజమాని కుశాల్ అనుకున్నంత ధరకు యాకయ్య ఇవ్వకపోవటంతో ఆ ఇంటిని అతనికి అమ్మలేనని చెప్పాడు. ఇంతలో శ్యామ్ రావు దంపతులు దాన్ని కొనుగోలు చేశారు.
తాము కొన్న ఇంట్లో గృహప్రవేశ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తున్న శ్యామ్ దంపతులపై ఇంటిని కొనాలని ప్రయత్నించిన యాకయ్య.. ఆయన మనుషులు దాడి చేయటం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. తాము కోరుకున్న ఇంటిని తమకు అమ్మలేదన్న కోపంతో ఇలా దాడులు చేయటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నిస్తున్నారు. మద్యం సేవించి..గృహప్రవేశం జరుగుతున్న ఇంటి ముందుకు వచ్చి గొడవ పెట్టుకోవటమే కాదు.. ఇంట్లోని వస్తువుల్ని ధ్వంసం చేయటం ఒక ఎత్తు.. ఇంటికి వచ్చిన బంధువుల కార్లు.. టూవీలర్ల మీదా దాడి చేయటం మరో ఎత్తు.
అంతేకాదు ఈ అరాచకం ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఇల్లు కొనాలని ఆశపడిన యాకయ్య.. కొందరికి ఫోన్ చేసి రప్పించి.. సినిమాల్లో చూపించేలా ఇష్టం వచ్చినట్లుగా దాడి చేయటం.. సామాగ్రిని ధ్వంసం చేయించిన వైనం ఆందోళనకు గురి చేసేలా మారింది. ఈ ఇష్యూలో ఒక స్థానిక నేత
బోడుప్పల్ లాంటి ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ అరాచకాన్ని చూస్తే.. ఇలాంటి వాటి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తీవ్రంగా గాయపడిన శ్యామ్ రావును ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు బంధువులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. ఈ మొత్తం ఉదంతంలో కాస్తంత ఊరట కలిగించే అంశం మేడిపల్లి పోలీసులు స్పందించిన తీరు. ఈ దాడికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సర్దుబాటు చేసిన తర్వాత పోలీసులు వెళ్లిపోయారు. మళ్లీ కాసేపటికే మూకగా వచ్చిన కొందరు దాడి చేయటంతో పోలీసులకు సమాచారాన్ని అందించారు. మొత్తంగా ఈ ఉదంతంలో 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన వారిని సైతం అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.