కూటమికి బిగ్ టాస్క్.. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు, ఇంకా నెల రోజులే గడువు!
కూటమి నేతలకు నామినేటెడ్ పదవులు ఊరిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల సందడి ముగిసిన వెంటనే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసు మొదలైంది.
కూటమి నేతలకు నామినేటెడ్ పదవులు ఊరిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల సందడి ముగిసిన వెంటనే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసు మొదలైంది. వచ్చేనెలలో ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ ఇద్దరూ గవర్నర్ కోటాలో ఎంపికైన వారే కావడంతో ఆ రెండు స్థానాలను అధికార కూటమి దక్కించుకునే పరిస్థితి ఉందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే చాన్స్ రావడంతో కూటమి నేతలు ఎవరికి చాన్స్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెండేళ్లుగా పదవుల కోసం ఎదురుచూస్తున్న పలువురు నేతలు ఈ సారైనా అధిష్టానం తమకు అవకాశం ఇస్తుందా? లేక ఈ సారి కూడా ‘సారీ’ అంటూ చేతులు దులుపుకుంటుందా? అని టెన్షన్ పడుతున్నారు.
వచ్చేనెల 27తో శాసనమండలిలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపికైన జకియా ఖానం, పండుల రవీంద్రబాబు పదవీకాలం ముగియనుందని శాసన మండలి రికార్డులు ద్వారా తెలుస్తోంది. దీంతో ఆ రెండుస్థానాల భర్తీకి జులైలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. జూన్ లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే, పలువురు ఆశావహులు పోటీ పడ్డారు. కానీ, రకరకాల సమీకరణాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ నలుగురు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ సమయంలో పలువురు ఆశావహులకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై వారు ఆశ పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఎమ్మెల్సీ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో గత ఎన్నికల సమయంలో సీట్లు కోల్పోయిన త్యాగరాజులే ఎక్కువగా ఉన్నారు. ఇలా ఎమ్మెల్సీ పదవులు కోరుకుంటున్న వారిలో టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. వీరిలో ప్రధానంగా మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమాతోపాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, బుద్ధా వెంకన్న, వంగవీటి రాధాకృష్ణ, మహాసేన రాజేశ్ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని 2024 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ హామీ ఇచ్చినట్లు గుర్తు చేస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కోసం టికెట్ వదులుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో పార్టీ కేడర్ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తోందని అంటున్నారు. తాజాగా ఆయనను నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించారు. దీంతో వర్మ త్యాగం నిష్ఫలం అయిందని అసంతృప్తి కేడర్ లో వ్యక్తమవుతోందని అంటున్నారు. అయితే వర్మకు తగిన న్యాయం చేయాలని ముఖ్య నేతలు ఇద్దరూ భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఈ సారి ఎమ్మెల్సీ చాన్స్ ఇస్తారా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది.
మరోవైపు మైలవరం సీటు వదులుకున్న దేవినేని ఉమా, విజయవాడ పశ్చిమ సీటును త్యాగం చేసిన బుద్ధా వెంకన్న, పి.గన్నవరం నుంచి పోటీకి అవకాశం దక్కినా, చివరి నిమిషంలో అధిష్టానం సూచనతో వెనక్కి తగ్గిన మహాసేన రాజేశ్ కూడా ఎమ్మెల్సీ ఆశావహులుగా గట్టి పోటీ ఇస్తున్నారని చెబుతున్నారు. ఇక పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పేరు కూడా చాలాసార్లు తెరపైకి రావడం, ఆ తర్వాత మరుగున పడిపోవడం జరుగుతోందని చెబుతున్నారు. దీంతో ఆయన పేరు ఈ సారి అయినా పరిశీలిస్తారా? లేదా? అన్నది చూడాల్సివుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గం కేంద్రంగా రాజకీయం నడుస్తున్ననేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాధా పేరు పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి మరో నెల రోజుల్లో భర్తీ అయ్యే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు కూటమిలో ఆసక్తికర రాజకీయానికి తెరతీశాయని అంటున్నారు. ఈ విషయంలో ప్రధాన నేతలు ఇద్దరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.