రూ.వేల కోట్ల వ్యాపారం.. రాపిడో, ఓలా, ఊబర్ ఫోన్ నెంబర్లు ఇవ్వరేం?
ప్రభుత్వాలు సైతం మొద్దునిద్ర వీడి.. కార్పొరేట్ సంస్థలు చేసే విన్యాసాలకు చెక్ పెట్టేయటమే కాదు.. తాము రూపొందించిన నిబంధల్ని సదరు సంస్థలు పక్కాగా ఫాలో అవుతున్నాయా? లేదా? అన్నది తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది.
మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ప్రభుత్వాలు సైతం మొద్దునిద్ర వీడి.. కార్పొరేట్ సంస్థలు చేసే విన్యాసాలకు చెక్ పెట్టేయటమే కాదు.. తాము రూపొందించిన నిబంధల్ని సదరు సంస్థలు పక్కాగా ఫాలో అవుతున్నాయా? లేదా? అన్నది తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. వేలాది కోట్ల రూపాయిల టర్నోవర్ చేసే సంస్థలు.. తమ సేవల్ని వినియోగించే వినియోగదారులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే నేరుగా మాట్లాడేందుకు కనీసం సమకూర్చాల్సిన ఫోన్ నెంబరు.. సంప్రదించటానికి తమ ఆఫీసు ఎక్కడ ఉందన్న వివరాల్ని కనీసం పేర్కొనకుండా వేలాది కోట్ల రూపాయిలు టర్నోవర్ చేసే తీరు మన దేశంలోనే ఉంటుందేమో?
అది టూ వీలర్ కావొచ్చు. త్రీవీలర్ కావొచ్చు.. ఫోర్ వీలర్ కావొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహానగరాలు..నగరాలు.. కొన్ని పట్టణాలకు చెందిన ఎంతోమంది యాప్ ఆధారిత రవాణా సేవల్ని వినియోగిస్తున్నారు. వీరికి సేవలు అందించే సంస్థలు దేశంలో చాలానే ఉన్నాయి. అయితే.. పెద్ద ఎత్తున నెట్ వర్క్ తో పాటు.. భారీ టర్నోవర్ చేసే సంస్థల్లో ఊబర్.. ఓలా.. రాపిడో తదితర సంస్థలు ఉన్నాయి. ఆశ్చర్యపరిచే అంశం ఏమంటే.. వీటిని వినియోగించే వారికి ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. చాట్ బాట్ ద్వారా సంప్రదింపులు జరపాలే తప్పించి.. నేరుగా ఫోన్ చేసే సౌకర్యం ఉండదు. కనీసం వారి కస్టమర్ కేర్ వివరాలు కూడా ఇవ్వకపోవటం కనిపిస్తుంది.
తాజాగా ఢిల్లీలో రాపిడో సేవల్ని అందుకున్న ఒక మహిళకు షాకింగ్ అనుభం ఎదురుకావటం.. బైక్ డ్రైవర్ వ్యవహారశైలి ఆందోళనకు గురికావటంతో ఆమె.. వేగంగా వెళుతున్న బైక్ మీద నుంచి దూకేయటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె రాపిడో కస్టమర్ కేర్ ను సంప్రదించే ప్రయత్నం చేయగా.. సరిగా స్పందించకపోవటం.. తనకు ఎదురైన షాకింగ్ అనుభవం గురించి సోషల్ మీడియాలో వివరాలు షేర్ చేయటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు కానీ రాపిడో స్పందించి.. తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పటం.. వైద్య సాయంతో పాటు.. లీగల్ సాయం చేస్తామన్న మాటనను చెప్పటం చూస్తే.. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలే రాపిడో రియాక్టు అయ్యేలా చేశాయని చెప్పక తప్పదు.
రాపిడో.. ఓలా.. ఊబర్ లాంటి సంస్థలు దేశంలో జరుపుతున్న వ్యాపారం.. దాని టర్నోవర్ చూస్తే.. విస్మయానికి గురి కావాల్సిందే. అంతేకాదు.. దేశం మొత్తంగా ఈ తరహా వ్యాపారం చేసేందుకు ఉన్న మార్కెట్ సైజ్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దేశంలోయాప్ ఆధారిత రవాణా సేవలు అందించే మార్కెట్ సైజు దాదాపు రూ.60 వేల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. పేరున్న బ్రాండ్లుగా చలామణి అయ్యే ఊబర్ ఇండియా ఏటా రూ.3849కోట్ల టర్నోవర్ చేస్తుంటే.. ఓలా కన్స్యూమర్ రూ.2245 కోట్లు కేవలం రైడ్స్ టర్నోవర్ నమోదు చేస్తోంది. ఇక.. వేగంగా విస్తరిస్తున్న రాపిడో విషయానికి వస్తే సంస్థ పేర్కొన్న టర్నోవర్ లెక్కల ప్రకారం ఈ సంస్థ రూ.1003 కోట్లుగా పేర్కొంది. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. వేలాది కోట్ల రూపాయిల టర్నోవర్ చేసే ఈ సంస్థలన్నీ కూడా తాము నష్టాల్లోనే ఉన్నట్లుగా పేర్కొంటున్నారు.
తాము అందించే సేవల్ని నిత్యం లక్షలాది మంది వినియోగిస్తున్నప్పటికి.. సదరు సంస్థల్ని నేరుగా సంప్రదించటానికి ఒక ఫోన్ నెంబర్ కానీ.. వారి చిరునామాలు కానీ యాప్ లో ఎక్కడా పేర్కొనే పరిస్థితి లేదు. అంటే.. ఫోన్ నెంబరు.. వ్యాపార అడ్రస్ లేకుండానే వేలాది కోట్ల వ్యాపారం చేయటం చూస్తే.. లోపం ఎవరిది? దీనికి బాధ్యులు ఎవరు? అన్న సందేహం కలుగకమానదు. తమ కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్లు కానీ వీటి ఆఫీసులు ఎక్కడ ఉన్నాయన్న వివరాల్ని లక్షలాది మంది ప్రజలకు అందుబాటులో ఉంచకుండా వ్యాపారం చేయటం.. ఏదైనా సంప్రదింపులు జరపాలంటే చాట్ బాక్స్ లు.. ఈ మొయిల్ ద్వారానే కమ్యూనికేషన్ జరుపుతామని ఈ సంస్థలు చెబుతుంటాయి.
మన దేశంలోనే ఇలాంటి పరిస్థితి ఉందా? విదేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్నది చూస్తే.. మన దేశంలో చట్టాల రూపకల్పన.. నిబంధనల అమలు విషయంలో ప్రభుత్వాలు ఎంతలా వైఫల్యం చెందుతున్నాయో ఇట్టే అర్థమవుతుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఊబర్ సంస్థ మన దేశంలో మాదిరే కాంటాక్టునెంబర్లు ఇవ్వకుండా యాప్ ద్వారానే సమస్యలు పరిస్కరిస్తామని చెప్పేది. కనీస ఖర్చులతో ఎక్కువ వ్యాపారం పేరుతో ఈ సంస్థలు చెబుతున్నా.. వినియోగదారుల రక్షణ విషయంలో అక్కడి ప్రభుత్వాలు కచ్ఛితంగా వ్యవహరింటంతో తమ తీరును మార్చుకొని 24 గంటలూ ఫోన్ సపోర్టుతో పాటు..కస్టమర్ సపోర్టు నంబర్లు వెల్లడించాలని రవాణా శాఖలు చట్టాలు తీసుకొచ్చాయి. దీంతో రైడ్ మధ్యలో ఏదైనా సమస్య వస్తే నేరుగా మాట్లాడే సౌకర్యం అక్కడ ఉంది.
మనదేశంలో చట్టాలు ఉన్నప్పటికి వాటిని అమలు చేసే నిఘా వ్యవస్థ చాలా బలహీనంగా ఉండటంతో సదరు కంపెనీలు దాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటున్నాయి. తమ ఫోన్ నెంబరు.. అడ్రస్ వివరాల్ని వెల్లడించకపోవటానికి కారణం.. వీలైనంతగా వినియోగదారులకు అందుబాటులో ఉండకుండా ఉండటమే అన్న విమర్శ ఉంది. అదేమంటే.. చట్టంలో ఫోన్ నెంబరు.. చిరునామా వివరాలు వెల్లడించాల్సిన నిబంధన లేదన్న మాటను చెప్పే పరిస్థితి. నిజానికి వీరినుంచి ఎలాంటి కమ్యూనికేషన్ రాని పరిస్థితి. ఢిల్లీ ఉదంతాన్ని తీసుకున్నా.. తొలుత సంస్థ పెద్దగా రియాక్టు కాలేదు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో బాధితురాలి వీడియో వైరల్ అయ్యిందో.. అప్పుడు మాత్రమే స్పందించిన వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.
మనదేశంలో రవాణా అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది. కేంద్రప్రభుత్వం కేవలం మార్గదర్శకాల్ని మాత్రమే ఇవ్వగలదు. వాటిని కచ్ఛితమైన చట్టంగా మార్చి అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే కంపెనీలు కోర్టుకువెళ్లి.. తమ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సదరు నిబంధనల్ని నోటిఫై చేయలేదు కాబట్టి.. తాము సమయం తీసుకుంటామని తప్పించుకుంటాయన్న విమర్శ ఉంది. ఈ కంపెనీలు తమ వ్యాపార లాభాలకే అధిక ప్రాధాన్యత ఇస్తాయన్న విమర్శ ఉంది. రైడ్ త్వరగా దొరకటానికి కస్టమర్ల నుంచి అదనంగా వసూలు చేసే అడ్వాన్స్ టిప్ లాంటి ఫీచర్లు నిబంధనలకు విరుద్ధమని కేంద్రం చెప్పినా.. కంపెనీలు వాటి ద్వారా వచ్చే లాభాల కోసం అలాంటి నిబంధనల్ని అమలు చేసే విషయంలో వాయిదా వేస్తాయన్న విమర్శ ఉంది.
ఒకవేళ ప్రభుత్వాలు ఏదైనా కఠిన నిబంధనలు తీసుకొస్తే.. వాటిని తాము అమలు చేయటానికి సమయం పడుతుందని.. సాంకేతికంగా మార్పులు చేయాల్సి ఉంటుందన్న సాకులు చెబుతూ కోర్టులను ఆశ్రయించటం.. స్టే ఆర్డర్ తో కాలయాపన చేయటం లాంటివి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చట్టాలు చేసిన తర్వాత వాటిని సదరు కంపెనీలు అమలు చేస్తున్నాయా? లేదా? అన్న అంశాల్ని తనిఖీ చేసే కఠినమైన నిఘా వ్యవస్థ రవాణా శాఖ వద్ద లేకపోవటం అతి పెద్ద లోపంగా చెబుతారు. ఈ మధ్యన అంటే.. ఆగస్టు11న కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మోటార్ వాహన అగ్రిగేటర్ గైడ్ లైన్స్ ప్రకారం తక్షణమే అమలు చేయాల్సిన ఆదేశాల్లో.. కంపెనీలు ఎలాంటి సాకులు చెప్పకుండా ఓలా, ఊబర్.. రాపిడో లాంటి సంస్థలు తాము అందించే సేవల్లో రైడ్ కన్ఫర్మ్ అయ్యేందుకు అదనపుడబ్బులు అడిగే అడ్వాన్స్ టిప్ .. ఇంప్రూవ్ ఛాన్సెస్ లాంటి ఫీచర్లను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది.
అయితే.. ఈ నిబంధనల మార్గదర్శకాల్ని జాతీయ స్థాయిలో కేంద్రం విడుదల చేసినా.. వాటిని చట్టబద్ధంగా అమలు చేసే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. కేంద్ర మార్గదర్శకాలు విడుదలైన మూడు నెలల లోపు అన్ని రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు ఈ నిబంధనల్ని తమ స్థానికచట్టాల్లో చేర్చుకొని అమలు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. కేంద్రం చేసిన మార్గదర్శకాలకు తెలంగాణ.. మహారాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. తెలంగాణ ప్రభుత్వం యాప్ ఆధారిత క్యాబ్.. బైక్ ట్యాక్సీ సేవల్ని నియంత్రించటానికి.. ప్రయాణికుల భద్రతను పెంచటానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి అనుగుణంగా తెలంగాణ మోటార్ వాహన అగ్రిగేటర్ పాలసీని త్వరలో పూర్తిస్థాయిలో అమలు చేసేలా ప్లాన్ చేస్తోంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ను నోటిఫై చేయటమే కాదు.. ఆ రాష్ట్రంలోని అన్ని యాప్ ఆధారిత రవాణా సంస్థలు ఈ ఏడాది సెప్టెంబరు 1 లోపు కొత్త నిబంధనల ప్రకారం తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని గడువు విధించారు.
చివరగా ఒక ఆశ్చర్యకరమైన అంశాన్ని ప్రస్తావించాలి. యాప్ ఆధారిత రవాణా సేవల్ని అందించే సంస్థలు తమ కస్టమర్ కేర్ నంబర్ ను యాప్ లో బహిరంగంగా అందుబాటులో ఉంచాలనే కచ్ఛితమైన చట్టపరమైన నిబంధన మన దేశంలో లేదు.దీనికి కారణం.. దేశంలో అమలవుతున్న పాత ఐటి చట్టాలు.. వినియోగదారుల రక్షణ నిబంధనలు.. మోటార్ వాహనాల చట్టాల్లోని కొన్ని లోపాలుగా చెప్పాలి. ప్రస్తుతం ఈ కామర్స్ వినియోగదారుల రక్షణ చట్టాల ప్రకారం ఒక డిజిటల్కంపెనీ తన వినియోగదారుల సమస్యలను పరిష్కరించటానికి ఒక ఫిర్యాదుల అధికారిని నియమించి.. అధికారిక మొయిల్ ఐడీ లేదంటే చాట్ బాక్స్ ఇస్తే చట్టపరంగా సరిపోతుంది అదే సమయంలో కస్టమర్లు నేరుగా ఫోన్ చేసి మాట్లాడటానికి 24/7అందుబాటులో ఉండేలా నెంబర్ ను కచ్ఛితంగా ఉండాలనే స్పష్టమైన రూల్ లేదు.
అంతేకాదు.. తాము సేవలు అందించే ప్రతి నగరంలోనూ ఒక భౌతిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. దాని అడ్రస్ ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలనే నిబందన పాత రవాణా చట్టాల్లో లేదు. తాము కేవలం ఆన్ లైన్ యాప్ మాత్రమే అని చెబుతూ స్థానిక జవాబుదారీతనం లేకుండా తప్పించుకుంటున్నారన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కొత్తగా తెచ్చిన అగ్రిగేటర్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి యాప్ సంస్థ కచ్ఛితంగా తాము సేవలు అందించే రాష్ట్రాల్లో స్థానిక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రైడ్ మధ్యలో ప్రయాణికుడికి ఏదైనా సమస్య వస్తే యాప్ లో ‘‘SOS’’ బటన్ నొక్కగానే నేరుగా కంపెనీ ప్రతినిధి మాట్లాడేలా 24/7 అత్యవసర ఫోన్ సాయం అందే వ్యవస్థను తప్పనిసరి చేసింది. దీన్ని కొందరు అమలు చేస్తుంటే..మరికొందరు అమలు చేయని పరిస్థితి. అయితే..చట్టాల అమల్లో ఉండే లొసుగుల్ని అసరాగా చేసుకొని తమ వివరాలను కంపెనీలు ప్రజలకు అందుబాటులో ఉంచని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ తీరు మారేలా దేశంలోని అన్ని వర్గాలు గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది.