మైదానంలో ప్రత్యర్థులు.. మైదానం వెలుప‌ల‌? రొనాల్డో- మెస్సీలపై బిగ్ డిబేట్!

క్రీడా ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో... లియోనెల్ మెస్సీల పోటీ ఎంత తీవ్రమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2026-08-15 07:03 GMT

క్రీడా ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో... లియోనెల్ మెస్సీల పోటీ ఎంత తీవ్రమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ ఇద్ద‌రూ నిజ‌మైన శ‌త్రువులా? వారి మ‌ధ్య శ‌త్రుత్వం ఉందా? లేక వారి మ‌ధ్య ఏం ఉందో ఎలా చెప్ప‌గ‌లం? అయితే అన్నిటికీ ఒకే ఒక్క సంక్షిప్త సందేశం ఇచ్చిన స‌మాధానం అద్భుతం.

ఫుట్ బాల్ ప్ర‌పంచంలో స్టార్ ప్లేయ‌ర్ మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ అస్వస్థతతో పరమపదించిన విషాద సమయంలో దిగ్గ‌జ ఆట‌గాడు రొనాల్డో చూపిన మానవత్వం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల హృదయాలను తాకింది. మెస్సీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై స్పందిస్తూ, ``ఈ కష్టసమయంలో నీకు- నీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి పంపుతున్నాను లీయో... ధైర్యంగా ఉండు`` అని రొనాల్డో పెట్టిన సందేశం రికార్డు స్థాయిలో లైక్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2005లోనే తన తండ్రిని కోల్పోయిన రొనాల్డోకు ఆ బాధ విలువ తెలుసు కాబట్టే.. మైదానంలోని వైరాన్ని పక్కనబెట్టి మెస్సీకి కొండంత అండగా నిలిచారని అభిమానులు కొనియాడుతున్నారు.

రొనాల్డో తన కెరీర్‌లో సాధించిన రికార్డులు క్రీడా ప్రపంచంలో చరిత్రగా నిలిచాయి. 5 యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా.. అలాగే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌తో పాటు ఆల్-టైమ్ కేరీర్‌లో అత్యధిక గోల్స్ (900 పైగా) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ఇంగ్లాండ్ (మాంచెస్టర్ యునైటెడ్), స్పెయిన్ (రియల్ మాడ్రిడ్), ఇటలీ (యువెంటస్) వంటి విభిన్న దేశాల లీగ్‌లలో లీగ్ టైటిళ్లు - టాప్ స్కోరర్ అవార్డులు సాధించి 5 సార్లు ప్రతిష్టాత్మక `బాలన్ డి ఓర్` పురస్కారాన్ని గెలుచుకున్నారు.

లియోనెల్ మెస్సీ సాధించిన చారిత్రాత్మక విజయాలు త‌క్కువేమీ కాదు. మెస్సీ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచారు. 2022లో అర్జెంటీనాకు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (FIFA వ‌ర‌ల్డ్ క‌ప్) అందించి తన కల నెరవేర్చుకున్నారు. చరిత్రలో అత్యధికంగా 8 సార్లు `బాలన్ డి ఓర్` పురస్కారాన్ని దక్కించుకున్న రికార్డు మెస్సీ సొంతం. బార్సిలోనా తరఫున 10 టైటిళ్లు... 4 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లతో పాటు కెరీర్‌లో 46 అధికారిక ట్రోఫీలను గెలుచుకుని అత్యధిక ట్రోఫీలు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కారు. నేరుగా వీరిద్దరూ ఎదురెదురుగా తలపడిన 36 మ్యాచ్‌లలో మెస్సీ 16 మ్యాచ్‌లలో విజయం సాధించగా, రొనాల్డో 11 మ్యాచ్‌లలో గెలిచారు.

విజయావేశంలో చెలరేగిన వివాదాలు:

ఎన్నో ఏళ్ల పాటు స్పెయిన్ `ఎల్ క్లాసికో - బార్సిలోనా వర్సెస్ రియల్ మాడ్రిడ్` పోరులో వీరి పోటీ ఉత్కంఠ రేపింది. 2017లో రియల్ మాడ్రిడ్ హోమ్ గ్రౌండ్‌లో చివరి నిమిషంలో విన్నింగ్ గోల్ కొట్టిన మెస్సీ తన జెర్సీ విప్పి అభిమానులకు చూపించడం అతిపెద్ద సంచలనంగా మారింది. దానికి సమాధానంగా తదుపరి మ్యాచ్‌లో గోల్ కొట్టిన రొనాల్డో కూడా బార్సిలోనా హోమ్ గ్రౌండ్ `క్యాంప్ నూ` లో తన షర్ట్ విప్పి మెస్సీ శైలినే అనుకరిస్తూ కౌంటర్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాదాలన్నీ కేవలం మైదానంలో గెలవాలనే క్రీడావేశం వల్ల కలిగినవే తప్ప.. వ్యక్తిగత ద్వేషం కాదని వారిద్దరూ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.

రైవల్స్ అయినా క్రీడాస్ఫూర్తి- సత్సంబంధాలు:

సినిమా రంగంలో ఎంతటి స్టార్ హీరోల మధ్య పోటీ ఉన్నా బయట కలసిమెలిసి ఉన్నట్లే.. క్రీడల్లో కూడా మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ మైదానం వెలుపల ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. క్రీడలు కేవలం గెలుపోటములకే పరిమితం కాకుండా.. మానవత్వానికి .. క్రీడాస్ఫూర్తికి ప్రతీకగా నిలవాలని రొనాల్డో-మెస్సీల ఈ ఘటన చాటిచెప్పింది. ప్రతికూల పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం ద్వారా ఈ ఇద్దరు దిగ్గజాలు భావితరాలకు.. కోట్లాది మంది అభిమానులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

Tags:    

Similar News