లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..
| హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ సంస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, వ్యవస్థాపకుడు పామిరెడ్డి పిచ్చిరెడ్డి నుంచి 43 శాతం వాటాను కొనుగోలు చేసి 100 శాతం యాజమాన్యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ డీల్ కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి 700 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7,000 కోట్లు) సమీకరించారు. మేఘా గ్రూప్ విలువను రూ.లక్ష కోట్లుగా అంచనా వేశారు.
ఒకప్పుడు చిన్న స్థాయి కాంట్రాక్టులతో మొదలైన ప్రస్థానం.. ఇప్పుడు లక్ష కోట్ల విలువైన కార్పొరేట్ సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి చేరింది. వ్యాపార ప్రపంచంలో ఎదగాలంటే కేవలం అవకాశాలు సరిపోవు.. వాటిని అందిపుచ్చుకునే దూరదృష్టి.. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం.. లక్ష్యాన్ని చేరుకునే పట్టుదల కూడా ఉండాలి. ఈ మూడు లక్షణాలకు నిదర్శనంగా నిలుస్తోంది హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్). తాజాగా ఆ సంస్థ యాజమాన్యంలో చోటుచేసుకున్న కీలక పరిణామం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి తన మేనమామ.. సంస్థ వ్యవస్థాపకుడు పామిరెడ్డి పిచ్చిరెడ్డి వద్ద ఉన్న 43 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా మేఘా గ్రూప్‌పై 100 శాతం పూర్తి యాజమాన్య పట్టును సాధించారు.
ఇప్పటివరకు కంపెనీలో 57 శాతం వాటాతో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణారెడ్డి ఈ తాజా కుటుంబ ఒప్పందంతో సంస్థకు ఏకైక అధిపతిగా అవతరించారు. భారీ వ్యాపార సామ్రాజ్యాల్లో నిర్ణయాలు వేగంగా.. స్పష్టంగా తీసుకోవడానికి ఏకీకృత నాయకత్వం ఎంతో అవసరం. ఈ వాటాల బదిలీ మేఘా గ్రూప్‌ను భవిష్యత్తులో మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు బలమైన పునాది వేయనుంది.
ఈ భారీ వాటా కొనుగోలు వెనుక కృష్ణారెడ్డి ఆర్థిక వ్యూహం కార్పొరేట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ లావాదేవీ కోసం ఆయన అంతర్జాతీయ ప్రైవేట్ క్రెడిట్ సంస్థల నుంచి ఏకంగా 700 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 7,000 కోట్లు సమీకరించారు. అమెరికాకు చెందిన డేవిడ్సన్ కెంప్నర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ నేతృత్వంలో వర్డే పార్ట్‌నర్స్.. హిల్‌హౌస్ క్యాపిటల్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు ఈ డీల్‌లో భాగస్వాములయ్యాయి. భారత మౌలిక సదుపాయాల రంగంలో ప్రైవేట్ క్రెడిట్ నిధులతో జరిగిన అతిపెద్ద లావాదేవీల్లో ఇది ఒకటిగా నిలవడం విశేషం.
అంతర్జాతీయ పెట్టుబడిదారులు మేఘా గ్రూప్ విలువను సుమారు రూ. లక్ష కోట్లుగా అంచనా వేయడం తెలుగు పారిశ్రామిక రంగానికి గర్వకారణం. చిన్నపాటి కాంట్రాక్టులతో మొదలైన ప్రయాణం.. నేడు దేశవ్యాప్తంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు.. సొరంగాలు.. ఇంధన రంగం.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వరకు విస్తరించింది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ క్లిష్టమైన ప్రాజెక్టులను సైతం సకాలంలో పూర్తి చేయడమే మేఘా గ్రూప్‌ను ఈ స్థాయికి చేర్చింది.
వ్యాపారంలో ఒక శిఖరాన్ని అధిరోహించడం ఒక ఎత్తయితే ఆ స్థాయిని నిలబెట్టుకుంటూ మరింత ఎత్తుకు ఎదగడం మరో ఎత్తు. లక్ష కోట్ల విలువైన సామ్రాజ్యానికి పూర్తి పగ్గాలు చేపట్టడం పీవీ కృష్ణారెడ్డి ముందున్న అద్భుత అవకాశం మాత్రమే కాదు.. అంతకుమించిన పెద్ద బాధ్యత కూడా. వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు.. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వందలాది భారీ ప్రాజెక్టులు.. అంతర్జాతీయ పోటీని తట్టుకుంటూ సంస్థను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టడం ఆయన ముందున్న తదుపరి లక్ష్యం.
అవకాశాలను అందిపుచ్చుకునే దూరదృష్టి.. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉంటే సామాన్యుడు సైతం సామ్రాజ్యాలను నిర్మించగలడని పీవీ కృష్ణారెడ్డి ప్రస్థానం నేటి యువ పారిశ్రామికవేత్తలకు గొప్ప స్ఫూర్తినిస్తోంది. లక్ష కోట్ల మైలురాయిని దాటిన మేఘా గ్రూప్.. రానున్న రోజుల్లో ప్రపంచ మౌలిక సదుపాయాల రంగంలో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి