ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..
| అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నవంబర్ 19న చైనాలోని షెన్‌జెన్‌లో భేటీ అయ్యారు. అణ్వాయుధాల నియంత్రణ, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ సంక్షోభం, అంతర్జాతీయ భద్రతపై చర్చలు జరిపారు. అయితే ఈ సమావేశం నుంచి ఎలాంటి ఉమ్మడి ఒప్పందం వెలువడలేదు. ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.
అంతర్జాతీయ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. నిన్నటిదాకా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ ఆంక్షల కొరడా ఝుళిపించుకున్న అగ్రరాజ్యాల అధినేతలు.. నేడు ఒకే టేబుల్‌పై కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. ఈ త్రిమూర్తులు ఒకే వేదికపై కలవడంతో యావత్ ప్రపంచం దృష్టి ఇప్పుడు చైనాలోని షెన్‌జెన్ నగరంపైనే నిలిచింది.
ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు (ఏపీఈసీ) నేపథ్యంలో నవంబర్ 19న షెన్‌జెన్‌లో ఈ అరుదైన త్రైపాక్షిక భేటీ ప్రారంభమైంది. మూడు దేశాల అధినేతలు ఇలా ముఖాముఖి కూర్చుని చర్చలు జరపడం చరిత్రలో ఇదే తొలిసారి. అణ్వాయుధాల నియంత్రణ, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ సంక్షోభం, అంతర్జాతీయ భద్రత వంటి కీలక అంశాలు వీరి చర్చల అజెండాలో ఉన్నాయి.
ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్య దాహం.. మరోవైపు రష్యా సైనిక బలం.. ఇంకోవైపు చైనా ఆర్థిక శక్తి.. ఈ మూడు శక్తులు ఒకే చోట చేరడం వెనుక లోతైన రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం ప్రకారం.. సంప్రదింపులు లేకుండా ఏ సమస్యనూ పరిష్కరించలేం. ఇన్నాళ్లూ హెచ్చరికలు.. ఆంక్షలు.. ఆయుధాల పోటీతో కాలం గడిపిన నేతలు.. ఇప్పుడు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడం ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. మరోవైపు ప్రపంచ శాంతి.. స్థిరత్వం కోసం ప్రధాన శక్తులు కలిసి పనిచేయాలనే బాధ్యత తమపై ఉందని జిన్‌పింగ్, పుతిన్ వాదిస్తున్నారు.
ప్రపంచంలో ఎక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నా.. ఎక్కడ అణ్వాయుధాల ముప్పు పొంచి ఉన్నా.. ఎక్కడ దేశాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నా.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ మూడు దేశాల పాత్ర కనిపిస్తూనే ఉంటుంది. ఆయుధాలను తయారు చేసి.. విక్రయించి.. ఉద్రిక్తతలను పెంచడంలో ముందుండే ఈ అగ్రరాజ్యాలే.. ఇప్పుడు ప్రపంచ శాంతి.. అణ్వాయుధాల తగ్గింపు గురించి ప్రవచనాలు చెబుతుండటం విశేషం. ఇది నిజంగానే శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నమా... లేక తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రపంచాన్ని పంచుకునే కొత్త రాజకీయ చదరంగమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అగ్రనేతల కలయిక మిగిలిన చిన్న, మధ్యతరహా దేశాల్లో కొత్త ఆందోళనకు తెరలేపింది. ప్రపంచాన్ని శాసించగల ఈ మూడు శక్తులు ఏదైనా ఉమ్మడి నిర్ణయానికి వస్తే దాని ప్రభావం మిగతా దేశాల ఆర్థిక, భద్రతా ప్రయోజనాలపై నేరుగా పడుతుంది. పెద్దల పంచాయతీలో తమ ప్రయోజనాలు ఎక్కడ బలైపోతాయోనని పలు దేశాలు ఈ భేటీని నిశితంగా గమనిస్తున్నాయి.
ముగ్గురు నేతలు ఒకే టేబుల్‌పై కూర్చున్నంత మాత్రాన దీర్ఘకాలిక సమస్యలన్నీ చిటికెలో మాయమైపోవు. ముగ్గురి లక్ష్యాలు.. వ్యూహాలు వేర్వేరు. ఉక్రెయిన్ యుద్ధం నుంచి అణ్వాయుధాల నియంత్రణ వరకు ఉన్న చిక్కుముడులను విప్పడం అంత సులభం కాదు. ఇప్పటివరకు ఈ భేటీ నుంచి ఎలాంటి స్పష్టమైన ఉమ్మడి ఒప్పందం వెలువడలేదు. ఈ చారిత్రక సమావేశం కేవలం ఫోటోలకు.. కరచాలనాలకు మాత్రమే పరిమితమవుతుందా? లేక ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందా అన్నది వేచి చూడాలి.