ఇంట్లో తినడానికి గుప్పెడు పిండి లేదు.. కానీ భారత్‌ను కొట్టడానికి టర్కీ నుంచి ఏకంగా లక్ష డ్రోన్లట..
| ఆర్థిక సంక్షోభంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం భారత్‌తో డ్రోన్ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టర్కీ సంస్థతో ఒప్పందం ద్వారా లక్ష డ్రోన్లు, ఇతర మానవరహిత యుద్ధ పరికరాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ యాంటీ డ్రోన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పాకిస్థాన్ తీరు చూస్తుంటే అచ్చం ‘ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత’ అన్న పాత సామెత గుర్తుకు వస్తోంది.. దేశంలో జనం కనీసం పూట గడవక.. పిడికెడు గోధుమ పిండి కోసం రేషన్ షాపుల ముందు క్యూలు కట్టి నానా తంటాలు పడుతున్నారు. ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అక్కడ అడుక్కుంటుంటే ఆ దేశాలు వీరిని తరిమికొడుతున్న దుస్థితి. అప్పుల ఊబిలో కూరుకుపోయి.. ప్రపంచ బ్యాంకు నుంచి ఐఎంఎఫ్ దాకా ప్రతీ చోటా దేహి అని చేయి చాస్తున్న దాయాది దేశం.. ఇప్పుడు మాత్రం మీసాలకు సంపెంగ నూనె పూసుకుని మరీ యుద్ధ కలను కంటోంది.
తినడానికి తిండి లేకపోయినా పర్లేదు కానీ.. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి మాత్రం పాకిస్థాన్‌కు తగ్గడం లేదు. అందుకే టర్కీకి చెందిన 'పసిఫిక్ టెక్నాలజీ' సంస్థతో పాకిస్థాన్‌కు చెందిన 'నేషనల్ రేడియో అండ్ టెలికమ్యూనికేషన్ కార్పొరేషన్ (ఎన్.ఆర్.టీసీ)' ఒక రహస్య రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూడేళ్ల డీల్ ప్రకారం పాక్‌కు ఏకంగా లక్ష 'మెర్కుల్ ఫస్ట్ పర్సన్ వ్యూ' డ్రోన్లు అందనున్నాయట. కేవలం ఇవే కాకుండా 10 మానవరహిత హెలికాప్టర్లు, 25 మినీ హెలికాప్టర్లు, 500 లాయిటరింగ్ మ్యూనిషన్స్, 250 గ్రౌండ్ సిస్టమ్స్ కూడా కొనుగోలు చేయడానికి పాక్ సిద్ధమైంది. అంతేకాదు టర్కీ నుంచి టెక్నాలజీని కూడా తీసుకుని సొంత గడ్డపైనే డ్రోన్లను తయారు చేస్తామంటూ పాక్ కలలు కంటోంది.
2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' దెబ్బకు పాక్ వెన్నులో వణుకు పుట్టింది. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం సృష్టించే డ్రోన్ యుద్ధ తంత్రంతో భారత్‌ను ఇరుకున పెట్టాలని పాక్ భావిస్తోంది. టర్కీ కూడా తన ఆయుధ వ్యాపారాన్ని పెంచుకోవడానికి పాక్ ఆశలను బాగానే క్యాష్ చేసుకుంటోంది. కానీ కరెంట్ బిల్లులు కట్టడానికే దిక్కులేని పాకిస్థాన్.. ఈ లక్ష డ్రోన్లను కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుందో.. వాటిని నడపడానికి బ్యాటరీలు ఎలా కొంటుందో ఆ దేవుడికే తెలియాలి..
అయితే శత్రువు బలహీనుడైనా సరే అతని చేతిలో ఆయుధం ఉందన్నప్పుడు అప్రమత్తంగా ఉండటం భారత్ నైజం. ఆధునిక యుద్ధాల్లో చిన్న డ్రోన్లు కూడా పెద్ద ప్రమాదాన్ని సృష్టించగలవని ఉక్రెయిన్-రష్యా యుద్ధం నిరూపించింది. పాకిస్థాన్ వద్ద లక్ష డ్రోన్లు చేరితే వాటిని ఒకేసారి సరిహద్దుల వద్ద ప్రయోగించే 'స్వార్మ్ అటాక్' ప్రమాదం పొంచి ఉంది. అందుకే భారత్ కూడా తన యాంటీ డ్రోన్ వ్యవస్థలను.. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలను మరింత పదును పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
కడుపు నిండా అన్నం పెట్టలేని పాక్ పాలకులు.. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి 'డ్రోన్ విన్యాసాల'కు తెరలేపారు. మరి ఈ లక్ష డ్రోన్లు నిజంగానే యుద్ధభూమిలోకి వస్తాయో.. లేక అప్పుల వాళ్ల చేతిలో తాకట్టుకు వెళ్తాయో వేచి చూడాలి..