అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!
| అమెరికాలో విదేశీ విద్యార్థుల బసను నాలుగేళ్లకే పరిమితం చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనకు ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసింది. నవంబర్ 16న ఈ నిబంధనను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో F-1 వీసాపై చదువుకునే విద్యార్థులు కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే పాత విధానం కొనసాగనుంది. ఈ తీర్పు భారతీయ విద్యార్థులకు ఊరటనిచ్చింది.
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకోవాలనుకున్న మరో నిర్ణయానికి బ్రేక్ పడింది. విద్యార్థులు అక్కడ ఎంతకాలం ఉండవచ్చనే దానిపై కొత్త పరిమితులు పెట్టాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ఫెడరల్ కోర్టు అంగీకరించలేదు. నవంబర్ 16న ఇచ్చిన తీర్పులో ఆ నిబంధనను పూర్తిగా రద్దు చేసింది.
ప్రస్తుతం అమెరికాలో F-1 వీసాపై చదువుకునే విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు అక్కడ ఉండే అవకాశం ఉంది. దీనికి ప్రత్యేకంగా గడువు పెట్టరు. అయితే విద్యార్థులు తమ వీసా నిబంధనలు పాటించాలి. ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ వెసులుబాటును తొలగించి, ఎక్కువ మంది విద్యార్థుల బసను నాలుగేళ్లకే పరిమితం చేయాలని చూసింది. ఆలోపు చదువు పూర్తి కాకపోతే మరోసారి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది.
ఈ ప్రతిపాదనను అమెరికాలోని విద్యా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కోర్సు వ్యవధి, పరిశోధన, ఇతర విద్యా అవసరాల వల్ల కొందరు విద్యార్థులకు నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి.
విచారణలో ప్రభుత్వ వాదనలకు న్యాయమూర్తి అంగీకరించలేదు. కొత్త నిబంధన వల్ల కలిగే ఇబ్బందులను అధికారులు సరిగా అంచనా వేయలేదని పేర్కొన్నారు. దీంతో పాత విధానమే కొనసాగనుంది. అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులకు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. అయితే ఈ తీర్పుపై ట్రంప్ ప్రభుత్వం పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.