ఇంటిముందు కారు పెడితే రూ.25 వేలా?! ఐటీ బాబులకు పార్కింగ్ 'షాక్'
సొంతంగా కారు ఉంటే ఆ రాయల్టీయే వేరు. కానీ ఉదయాన్నే లేచి రోడ్డు మీదకు వచ్చేసరికి బెంగళూరు వాసులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
సొంతంగా కారు ఉంటే ఆ రాయల్టీయే వేరు. కానీ ఉదయాన్నే లేచి రోడ్డు మీదకు వచ్చేసరికి బెంగళూరు వాసులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భయ్యా.. మీ ఇంటిముందు మీ కారును మీరే పార్క్ చేసుకుంటున్నారా? అయితే పదివేలో.. ఇరవైవేలో కాదు.. ఏకంగా రూ. 25 వేలు తీసి పక్కన పెట్టుకోండి అంటూ అధికారులు ముస్తాబవుతున్నారు. బెంగళూరు నగరంలో దినదినాభివృద్ధి చెందుతున్న ట్రాఫిక్ కష్టాలకు, రోడ్ల పక్కన అడ్డదిడ్డంగా నిలిపే పార్కింగ్ సంస్కృతికి చెక్ పెట్టేందుకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) వారు ‘పార్కింగ్ రూల్స్–2026’ పేరుతో ఒక వినూత్నమైన ముసాయిదా ప్రతిపాదనను సిద్ధం చేశారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం మీ ఇంటి ముందున్న పబ్లిక్ రోడ్డుపై కారును నిలపడానికే ఏటా ప్రభుత్వానికి ఒక రకమైన 'రోడ్డు అద్దె' చెల్లించాల్సి రావచ్చు.
ఇక వాహనాల మోడల్స్ , సైజును బట్టి వసూళ్ల మోత మోగించేందుకు ముసాయిదాలో పక్కాగా స్కెచ్ వేశారు. చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు ఉంటే ఏడాదికి రూ. 15,000, కాస్త పెద్దదైన సెడాన్ కారు ఉంటే రూ. 20,000, అదే ఎస్‌యూవీలు లేదా స్పోర్ట్స్ కార్లు లాంటి భారీ వాహనాలు ఉంటే ఏకంగా రూ. 25,000 వరకు పార్కింగ్ ఫీజు విధించే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అంటే సామాన్యుడు కారు కొనుక్కోవడానికి ముందుగా బ్యాంకుకు ఈఎంఐలు కట్టాలి.. దాన్ని తిప్పడానికి లీటరు రూ.100 దాటిన పెట్రోల్ బాదుడు భరించాలి.. చివరకు అది రాత్రిపూట ఇంటిముందు ప్రశాంతంగా పడుకోవడానికి కూడా ప్రభుత్వానికి వేలకు వేలు "పర్మిట్ ఛార్జ్" చెల్లించాలన్నమాట.
పోనీ.. పోయేదేముందిలే అని రూ.25 వేలు జేబులోంచి తీసి చేతిలో పెడదామన్నా అక్కడ కూడా ఒక పెద్ద కండిషన్ పెడుతున్నారు. ప్రతిపాదనల ప్రకారం ఈ పర్మిట్ కోరిన ప్రతి ఒక్కరికీ లభించదు. భవన నిర్మాణ నిబంధనల ప్రకారం అసలు పార్కింగ్ సౌకర్యమే లేని ఇళ్ల వద్ద మాత్రమే అధికారులు పరిస్థితిని సమీక్షించి ఈ రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ ఇస్తారు. ఒకవేళ అపార్ట్‌మెంట్‌లోనో లేదా సొంత ఇంట్లోనో పార్కింగ్ స్థలం ఉండి కూడా బద్ధకంతో కారును తెచ్చి బయట రోడ్డుపై పెడితే మాత్రం దాన్ని తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి చలానాల బాదుడు మొదలుపెడతారు.
ఈ పార్కింగ్ పర్మిట్ కూడా నిర్దిష్ట వ్యక్తికి.. నిర్దిష్ట వాహనానికి మాత్రమే ఏడాది కాలపరిమితితో ఇస్తారు. ప్రతి ఏడాదీ అధికారులు వచ్చి మీరు అదే ఇంట్లో ఉంటున్నారా.. అదే కారు వాడుతున్నారా అని ఆరా తీసి, తనిఖీ చేసిన తర్వాతే పర్మిట్‌ను పునరుద్ధరిస్తారు. అలాగే రోడ్డు వెడల్పు కనీసం 6 మీటర్లు ఉండి.. పాదచారుల నడక కోసం ఇరువైపులా 1.8 మీటర్ల ఫుట్‌పాత్ స్థలం ఖాళీగా ఉంటేనే ఈ పార్కింగ్ దయాదాక్షిణ్యాలు వర్తిస్తాయి.
ప్రస్తుతానికి ఇవన్నీ ముసాయిదా దశలోనే ఉన్నాయి కాబట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు.. సంబంధిత శాఖల సూచనలు స్వీకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు లీకులు ఇస్తున్నారు. అయితే ఈ వార్త విన్నప్పటి నుంచి బెంగళూరు కారు యజమానులకు మాత్రం చెమటలు పడుతున్నాయి. భవిష్యత్తులో కారు కొనడం కంటే దాన్ని ఇంటిముందు పార్క్ చేయడమే పెద్ద శ్రీమంతత్వంగా మారేలా ఉందని వాపోతున్నారు. మరి మరో రెండు వారాల్లో రాబోయే తుది నిర్ణయం బెంగళూరు వాసులకు ఎలాంటి రిలీఫ్ ఇస్తుందో లేదా జేబులకు మరింత చిల్లులు పొడుస్తుందో వేచి చూడాలి.