ప్రజల త్యాగంతో కేసీఆర్ భోగం: రేవంత్ సెటైర్లు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సహా ఆయన కుటుంబంపై సెటైర్లు వేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సహా ఆయన కుటుంబంపై సెటైర్లు వేశారు. అదేసమయంలో కొన్ని కొన్ని కీలక అంశాలను ప్రస్తావించి నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉండి.. భోగాలు అనుభవించారని అన్నారు. అంతేకాదు.. నిరుద్యోగ యువతను గాలికి వదిలేసి.. తన కుటుంబానికి పదువులు ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి కుటుంబానికి ప్రజలు మరోసారి అధికారం ఇస్తారా? అని నిలదీశారు. ప్రజలు ఛీకాదన్నా.. మేమే ముందున్నామన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు.. హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
వారు ఈనో తాగాలి!
''బీఆర్ ఎస్ నాయకులకు ఈ మధ్య కడుపు మండిపోతోంది. మేం.. పేదలకు ఇళ్లు కట్టిస్తున్నాం. దీంతో వారికళ్లు, కడుపు కూడా మండుతోంది. నేనిచ్చే సలహా ఏంటంటే.. కడుపు మంట తగ్గేందుకు ఈనో తాగండి. ఈనో ప్యాకెట్లు మీకు కావాలంటే.. ప్రభు త్వం ఉచితంగానే సరఫరా చేస్తుంది.'' అని సెటైర్లు వేశారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కట్టించి తీరుతామని సీఎం రేవంత్ చెప్పారు. ఈ విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎవరు కుళ్లు పెట్టుకున్నా..కడుపు మండినా తాను ముందుకే సాగుతానని అన్నారు. తెలంగాణ సిద్ధించిన పదేళ్ల తర్వాత కూడా.. పేదలు ఇళ్లు లేకుండా ఉంటున్నారంటే.. ఈ పాపం కేసీఆర్‌ది కాదా? అని నిలదీశారు.
''మీరు ఫామ్ హౌస్‌లు కట్టుకోవచ్చు. మీ పిల్లలు బంగళాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పేదలకు తల దాచు కునేందుకు చిన్న ఇల్లు కట్టిస్తే ఓర్చుకోలేక పోతున్నారు.'' అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పేదల పక్ష పాత ప్రభుత్వ మన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణ అయితే.. ప్రభుత్వం కాంగ్రెస్‌దని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కాలర్ ఎగరేసి మరీ చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు గడిచిన రెండున్నరేళ్లలో 70 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి హిస్టరీ క్రియేట్ చేశామన్నారు. ఇంకా, మరింత మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు.
దశాబ్దాలు గా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ఎక్కడా జరగని విధంగా అత్యంత పారదర్శకతతో కుల గణన చేపట్టిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనేనని తెలిపారు. తాము ఒత్తిడి చేయడంతోనే కేంద్రంకూడా జన గణనలో కుల గణనను కూడా చేర్చిందని తెలిపారు. తెలంగాణ కోసం మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి తన మంత్రి పదవిని త్యాగం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో దీక్ష కూడా చేపట్టారని అన్నారు. తెలంగాణ కోసం వందల మంది అమరులైతే.. రాష్ట్రం ఏర్పడిందన్న సీఎం.. రాష్ట్ర ఏర్పాటును మాత్రంబీఆర్ ఎస్ నేతలు తమ గొప్పగా.. చెప్పుకొంటున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.