చంద్రబాబు మిషన్ : 'ఉమ్మడి కుటుంబం'.. నేటి తరం ఒప్పుకుంటుందా?
మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న కాలంలో 'ఉమ్మడి కుటుంబం' అనే భావన ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోయింది.
మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న కాలంలో 'ఉమ్మడి కుటుంబం' అనే భావన ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోయింది. ఒకప్పుడు నలుగురితో నడిచిన ఇల్లు.. ఇప్పుడు నాలుగు గోడల మధ్య ఇద్దరికే పరిమితమవుతోంది. అయితే, అంతరించిపోతున్న అద్భుతమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై, మారుతున్న జనాభా సమీకరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి. నేను, నా పిల్లలు అన్న ఆలోచనకు చరమగీతం పాడాలని.. అమ్మానాన్నతోపాటు తోబుట్టువలతో కలిసి బతకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచిస్తున్నారు. రాబోయే కాలంలో జనాభా సంక్షోభం తలెత్తుతుందనే ఆలోచనతో మళ్లీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు వర్క్ అవుట్ అవుతాయా? నలుగురు కుటుంబ సభ్యులతో జీవనమే భారంగా మారుతున్న రోజుల్లో పెద్ద కుటుంబాలతో సంతోషం గడపడం సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు.
అయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ బలపడాలని కోరుకుంటున్న సీఎం కొన్ని ముఖ్య సూచనలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని, తండ్రి కూడా బాధ్యత తీసుకోవాలని సీఎం చేసిన సూచనపైనా చర్చ జరుగుతోంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు పిల్లల సంరక్షణలో భాగస్వాములయ్యేవారని, ఇప్పుడు ఆ వ్యవస్థ లేకపోవడం వల్ల తల్లిపై ఒత్తిడి పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతోనే ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలన్నా, వారి మంచి చెడ్డలు చూడాలన్నా ప్రస్తుత యువత భారంగా భావిస్తున్నారని అంటున్నారు. అదే అందరూ కలిసి వుంటే పిల్లల పెంపకంలో సమస్యలు అధిగమించొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉద్దేశంతోనే తను ప్రతిపాదిస్తున్న జనాభా మేనేజ్మెంట్ పాలసీకి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై మాట్లాడుతున్నారని చెబుతున్నారు.
సంతానాన్ని సమస్యగానో, భారంగానో చూడవద్దని, సంతానం అంటే దేశానికి సంపద చంద్రబాబు పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలో వృద్ధుల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో శ్రమశక్తి కొరత రాకుండా ఉండాలంటే యువత ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించాలని ఆయన భావిస్తున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల భవిష్యత్తులో జనాభా సంక్షోభం తలెత్తకుండా చూడొచ్చనేది సీఎం అభిప్రాయంగా చెబుతున్నారు. అయితే, చంద్రబాబు ఆకాంక్షించినట్లు మళ్లీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణ సాధ్యమేనా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా వ్యాఖ్యానిస్తున్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం జరుగుతున్న వలసలు, గ్లోబలైజేషన్, పెరిగిన జీవన వ్యయాలు వ్యక్తిగత స్వేచ్ఛా భావాలు ఉమ్మడి కుటుంబాలకు ఆటంకంగా చెబుతున్నారు. నగరాల్లోని పరిమిత వసతులు, ఒత్తిడితో కూడిన ఉపాధి మార్గాల వల్ల అందరూ కలిసి జీవించడం యువతకు ఒక సవాలుగా మారుతుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో, చంద్రబాబు లేవనెత్తిన ఈ అంశంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందరూ ఒకే కప్పు కింద జీవించడం ప్రాక్టికల్‌గా కష్టమైనప్పటికీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని ప్రేమ, విలువలు, ఒకరికొకరు తోడుగా ఉండే ధైర్యం, బాధ్యతలను నేటి చిన్న కుటుంబాలు అలవర్చుకోవాలని సూచనలు వస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాల్లో ఉన్నప్పుడు, ఇంట్లో పెద్దలు చేదోదువాదోడుగా నిలిస్తే పిల్లల పెంపకంలో ఇబ్బందులు తప్పుతాయని, ఆ విధంగా ఎక్కువ మంది పిల్లలను కనేందుకు తగిన వాతావరణం ఏర్పడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధానం వల్ల బలమైన సమాజ నిర్మాణాన్ని మనం సాధించవచ్చునని అంటున్నారు. అయితే సీఎం చంద్రబాబు ప్రతిపాదనలను రాజకీయ కోణంలో చూడటం కన్నా, సామాజిక బాధ్యతగా భావిస్తేనే మార్పు వస్తుందని అంటున్నారు.