కాడె వదిలేసిన వైసీపీ జిల్లా పెద్ద ?

వైసీపీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు. వారిలో జగన్ మెచ్చిన వారి లిస్ట్ వేరే ఉంటుంది. అలాంటి వారికి పదవులు అలా వస్తూంటాయి.

Update: 2026-06-27 05:30 GMT

వైసీపీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు. వారిలో జగన్ మెచ్చిన వారి లిస్ట్ వేరే ఉంటుంది. అలాంటి వారికి పదవులు అలా వస్తూంటాయి. ఏ లెక్కలకూ అందని విధంగా టిక్కెట్లు కూడా ఎన్నికల వేళల్లో వస్తాయి. అలాంటి నేతలలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజుని చెబుతారు. ఆయన జగన్ కి వీర విధేయుడు. ఈ క్వాలిఫికేషన్ తోనే ఆయన వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గం నరసాపురంలో మూడు సార్లు పోటీ పడితే ఒకసారి మాత్రమే గెలిచారు. అక్కడ సామాజిక సమీకరణలను చూసి అయినా అభ్యర్ధిని మార్చాలని స్థానిక నేతల నుంచి క్యాడర్ నుంచి అభ్యర్ధనలు వచ్చినా అధినాయకత్వం మాత్రం ప్రసాదరాజు వైపే మొగ్గుచూపుతూ వచ్చింది. ఓడినా గెలిచినా రాజు గారే అని హైకమాండ్ ఫిక్స్ అయిపోయింది. బహుశా అదే ఆయనకు కొండంత ధైర్యంగా ఉందని క్యాడర్ అంటున్నారు.

పార్టీ ఒట్టిపోతున్నా :

ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రసాదరాజుని అధినాయకత్వం నియమించింది. అయితే 2024 ఎన్నికల తరువాత భారీ ఓటమి సంభవించి గోదావరి జిల్లాలలో సోదిలో లేకుండా వైసీపీ సీన్ ఉంది. ఈ నేపధ్యంలో జిల్లాలో పార్టీని ఒక గాడిన పెట్టాల్సిన అధ్యక్షుడే కాడే వదిలేస్తున్నారు అని క్యాడర్ నుంచే విమర్శలు వస్తున్నాయి. ప్రసాదరాజు ఎంతసేపూ వైసీపీ పెద్దల కనుసన్నలలో ఉంటూ వారిని ప్రసన్నం చేసుకునేందుకే చూస్తున్నారని జిల్లాలో పార్టీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని క్యాడర్ గుస్సా అవుతోంది. దాంతో జిల్లాలో పార్టీ ఎత్తిగిల్లడం లేదని అంటున్నారు.

రెండు సీట్లలో ఖాళీ :

ఇక జిల్లాలో రెండు సీట్లలో అయితే వైసీపీ రాజకీయ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని కూడా క్యాడర్ చెబుతోంది. అందులో ఒకటి ఉప సభాపతి రఘురామ క్రిష్ణంరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గం. 2019లో కూడా జగన్ వేవ్ లో ఈ సీటుని టీడీపీ గెలుచుకుంది. ఇపుడు కూటమి బలంగా ఉంది దాంతో ఇంకా పుంజుకుంటోంది. అలాగే నరసాపురం అంటే ప్రసాదరాజు సొంత సీటు కూడా అలాగే ఉందని అంటున్నారు. రీ రెండు సీట్ల నుంచి వైసీపీ క్యాడర్ తో పాటు లీడర్లు కూడా కూటమి వైపుగా పోతున్నా జిల్లా అధ్యక్షుడు పట్టించుకోవడం లేదని దాంతో మొత్తానికి మొత్తం ఖాళీ అవుతోందని అంటున్నారు.

మంచి నాయకులతోనే :

ఇక భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీ నుంచి బయటకు పోవడానికి ముదునూరు ప్రసాదరాజు వైఖరి కారణం అని అంటున్నారు. ఆయనతో పొసగకనే శ్రీనివాస్ పార్టీని వీడిపోయారు అని గుర్తు చేస్తున్నారు. అంతకు ముందు కూడా పలువురు బలమైన నేతలు పార్టీకి దూరం అవడానికి ఈయన వైఖరి కారణం అని అంటున్నారు. పనిచేసే నేతల మీదనే తన సత్తా చూపిస్తారని దాంతో వారంతా విసిగిపోతున్నారని అంటున్నారు. ఇక నరసాపురం లో కానీ మరికొన్ని నియోజకవర్గాలలో కానీ కాపుల ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే వారిని ప్రోత్సహించే విషయంలో రాజు గారు ఎందుకో వెనకడుగు వేస్తున్నారని అన్న విమర్శలు ఉన్నాయి.

విన్నపాలు వినిపించవు :

వారిని కనుక తెచ్చి అందలం ఎక్కిస్తే తనకు ఇబ్బంది అవుతుందని ముందస్తు ఆలోచనలతో ఆయన పార్టీని బలోపేతం చేయడం లేదని కూడా క్యాడర్ నుంచి వస్తున్న విమర్శలుగానే ఉన్నాయని అంటున్నారు. ఇక భీమవరం పాలకొల్లు లాంటి చోట్ల బలమైన నాయకులు సామాజిక వర్గం పరంగా గట్టి నేతలకు అవకాశాలు ఇస్తే ఫ్యాన్ పార్టీ జోరు చేస్తుందని క్యాడర్ నుంచి విన్నపాలు వస్తున్నా రాజు గారు అయితే ససేమిరా అని అంటున్నారుట. అదే విధంగా ఆచంట తణుకు నియోజకవర్గాలలో ఇంచర్జిలుగా ఉన్న మాజీ మంత్రులతో కూడా రాజుకు సఖ్యత తక్కువే అని చెబుతున్నారు. దాంతో రాజు గారిని తప్పించి సరైన నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే తప్ప పశ్చిమ గోదావరి జిల్లలో ఫ్యాన్ పార్టీకి ఊపు రాదని అంటున్నారు. అయితే అధినాయకత్వానికి రాజు గారు చాలా మంచి వారు కాబట్టి తన విన్నపాలు వినిపించవని క్యాడర్ అంటోంది. అదన్న మాట సంగతి.

Tags:    

Similar News