‘వందేమాతరం’ మరో రికార్డు.. 80 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల్లో ఫస్ట్ టైమ్ ఇలా...
కోట్లాది మంది భారతీయుల గుండెల్లో దేశభక్తిని రగిలించి, స్వాతంత్ర్య పోరాటంలో అద్భుతమైన స్ఫూర్తిని నింపిన మంత్రం 'వందేమాతరం'.
కోట్లాది మంది భారతీయుల గుండెల్లో దేశభక్తిని రగిలించి, స్వాతంత్ర్య పోరాటంలో అద్భుతమైన స్ఫూర్తిని నింపిన మంత్రం 'వందేమాతరం'. స్వాతంత్ర్య సమరయోధుల గొంతుకగా, మన దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈ అపురూప గీతం, ఇప్పుడు సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ, ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారాల నుండి ఈ పవిత్ర గీతం తొలిసారిగా పూర్తిస్థాయిలో మార్మోగనుంది. ఇది మన జాతీయ వారసత్వాన్ని, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు గుర్తుచేసే ఒక గొప్ప గౌరవంగా చెబుతున్నారు.
'వందేమాతరం' గేయం చరిత్రను పరిశీలిస్తే, 1875లో బంకించంద్ర ఛటర్జీ చేత రచించారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో సమరయోధలలో పోరాట స్ఫూర్తిని రగిల్చిన గేయంగా వందేమాతరం గుర్తింపు పొందింది. అయితే, స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్రకోట వేదికపై దీనిని ఈ స్థాయిలో ఆలపించడం ఇదే మొదటిసారి. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ‘వందేమాతరం’ జాతీయ గేయంగా ప్రకటిస్తూ, జాతీయ గీతమైన 'జనగణమన'తో సమానమైన గౌరవాన్ని కల్పించారు. 'జనగణమన' మన జాతీయ గీతంగా దేశ అధికారిక కార్యక్రమాల్లో ప్రధాన స్థానాన్ని పొందగా, 'వందేమాతరం' మన జాతీయ గేయంగా దేశభక్తికి, పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు ఈ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంలో, ఎర్రకోటపై దీనిని ఆలపించడం ఒక అరుదైన ఘట్టంగా అభివర్ణిస్తున్నారు.
'వందేమాతరం' గేయం రూపుదిద్దుకుని 150 ఏళ్లు పూర్తవుతున్న చారిత్రక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వందేమాతరం గేయానికి సముచిత గౌరవాన్ని కల్పించిన విషయం తెలిసిందే. జాతీయ గౌరవ నిరోధక (సవరణ) బిల్లు ద్వారా వందేమాతరానికి జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణను కల్పించింది. గేయంలోని ఆరు చరణాలను పూర్తిస్థాయిలో ఆలపించాలని స్పష్టం చేస్తూ, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలన్నింటిలో ముందుగా వందేమాతరం, ఆ తర్వాత జనగణమన ఆలపించాలనే నిబంధనను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. తద్వారా, దేశభక్తిని ప్రతిబింబించే ప్రతి వేదికపై ఈ గేయానికి సముచిత స్థానం దక్కేలా చర్యలు తీసుకుంది.
ఇక ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకల్లో యువతకు అగ్రతాంబూలం ఇవ్వడం మరో విశేషం. 2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించబోతున్న యువ మేధావులకు ఈ వేడుకల్లో అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ ఒలింపియాడ్ పోటీల్లో ప్రతిభ చాటిన 19 మంది విద్యార్థులు ప్రధాని సమీపంలో ఆసీనులై ఉండగా, 2,500 మంది ఎన్‌సీసీ అభ్యర్థులు జ్ఞాన్ పథ్‌లో 'వందేమాతరం' అక్షర రూప విన్యాసాన్ని ప్రదర్శించడం ద్వారా దేశభక్తిని చాటనున్నారు.
ఈ వేడుకలు కేవలం సాంస్కృతిక ప్రదర్శనలకు మాత్రమే పరిమితం కాకుండా, దేశ సమైక్యతకు, పర్యావరణ స్పృహకు ప్రతీకగా నిలవనున్నాయి. 'మి-17' హెలికాప్టర్ ద్వారా కురిపించనున్న పూల వర్షం, వివిధ రాష్ట్రాల సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేయనున్న 1,500 మంది ఢిల్లీ వాసులు, దేశ వైవిధ్యంలో ఏకత్వాన్ని ప్రతిబింబించనున్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఎర్రకోట వద్ద వీఐపీ ఎన్‌క్లోజర్లకు దేశంలోని ప్రముఖ సరస్సుల పేర్లు పెట్టడం ద్వారా, అభివృద్ధి మరియు ప్రకృతి మధ్య సమతుల్యతను చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం మన జాతి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.