కూటమి మీద వైసీపీకి మెజారిటీ...ఏపీలో భారీ మార్పు ?
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. అది కూడా చాలా శక్తివంతమైన కూటమి. ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ ఇంతటి భారీ సీట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వేరొకటి లేదు.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. అది కూడా చాలా శక్తివంతమైన కూటమి. ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ ఇంతటి భారీ సీట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వేరొకటి లేదు. ఏకంగా 164 సీట్లు. విపక్షానికి కేవలం 11 సీట్లు మాత్రమే. అంటే మొత్తం అసెంబ్లీలో 95 శాతం కూటమి ఉంటే 5 శాతం మాత్రమే విపక్ష వైసీపీ ఉంది అన్న మాట. ఇక 2024లో కూటమికి వచ్చిన ఓటు షేర్ తీసుకుంటే 55 శాతం పైగా ఉంది. అదే వైసీపీకి 40 శాతం వచ్చింది. ఇది భారీ తేడాగా ఉంది. అంతకు ముందు ఎన్నడూ అధికార విపక్షాల మధ్య ఇంతటి భారీ తేడా ఓటు షేర్ లో లేదు. మరి ఈ విధంగా సీటు ఓటు షేర్ ని చూసినపుడు మరో రెండు ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి వస్తామన్న దృఢ విశ్వాసం కూటమి పార్టీలలో ఉండడం సహజం. అదే వారు తరచూ చెబుతూ వస్తున్నారు కూడా. కానీ రెండేళ్ల కూటమి పాలన తిరిగేసరికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు.
అంతర్గత సర్వేలో :
వైసీపీ అంతర్గత సర్వేలో కూటమి 15 శాతం ఓటు షేర్ తేడాను తగ్గించి మరీ వైసీపీ 1.5 శాతం ఆధిక్యతను సాధించింది అని వచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్ నిర్వహించిన క్రాస్ ఫైర్ లో మాట్లాడుతూ రివీల్ చేశారు. తాము చేయించుకున్న సర్వేలు చూస్తే వైసీపీ ఇప్పటికే అధికారంలోకి వచ్చేసినట్లే అని ఆయన అన్నారు. కూటమికి వచ్చిన భారీ ఆధిక్యతలు అన్నీ తగ్గిపోతూ తాము పెరిగామని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో తమకు ఆదరణా బాగా పెరిగిందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్ద ఎత్తున అభ్యర్ధులు ముందుకు వస్తున్నారు అంటే తమ పార్టీ గ్రాఫ్ పెరిగింది అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. మరో వైపు చూస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేసేందుకు టీడీపీ ముందుకు రాకుండా చేతులెత్తేసిందని ఆయన గుర్తు చేశారు. దీనిని బట్టి తాము కేవలం రెండేళ్లకే ఎంత బలంగా ఉన్నామో అర్థం చేసుకోవాలని ఆయన విశ్లేషించారు.
ఈక్వేషన్స్ సంగతి :
ఇదిలా ఉంటే సదరు ప్రముఖ తెలుగు చానల్ యాంకర్ ధర్మాన ప్రసాదరావుని కీలకమైన ప్రశ్న అడిగారు. ఏపీలో కమ్మ కాపు కాంబో అత్యంత శక్తివంతమైన సామాజిక బంధం అని గుర్తు చేశారు. పవన్ చంద్రబాబు కలసి ఉన్నంతవరకూ వైసీపీకి అధికారం కల్ల అన్నది కూడా కఠినమైన విశ్లేషణలు ఉన్నాయి కదా అని గుర్తు చేశారు. అయితే ఆ సామాజిక సమీకరణలు అన్నింటికీ పూర్వ పక్షం చేస్తూ వైసీపీ గ్రాఫ్ బాగా పెరిగింది అని ధర్మాన స్పష్టం చేస్తున్నారు. మరి ఏపీలో మూడు పార్టీలు కలిస్తే వైసీపీ ఓటమి పాలు అవుతుంది అన్న రాజకీయ సిద్ధాంతీకరణ తప్పు అవుతుందా అలాగే రెండు బలమైన సామాజిక వర్గాల స్నేహ బంధం వల్ల కూడా వైసీపీ విజయానికి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉండదు అన్నది వాస్తవం కాబోతోందా అన్నది అయితే ఇప్పటిదాకా ఎవరికీ తెలియని విషయమే. సర్వేలు అన్నవి కూడా చూస్తే వివిధ రకాలుగా ఉంటాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. అఫ్ కోర్స్ అధికార పార్టీకే ఎపుడూ అగ్ర తాంబూలంగా ఉండే ఎన్నికలు ఇవి. అయినా కూడా వైసీపీ తన ఉనికిని బలంగా చాటుకుంటే మాత్రం ఏపీలో భారీ రాజకీయ మార్పు మొదలైనట్లుగానే లెక్క. మరి అది జరుగుతుందా లేదా అన్నది చూడడానికి లిట్మస్ టెస్ట్ గా లోకల్ బాడీ ఫైట్ ఉండబోతోంది.