కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!
| కూలీలకు కనీస వసతులు, భద్రత కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం 25 లేబర్ అడ్డాలను ఏర్పాటు చేసింది. విజయవాడ, విశాఖ, తిరుపతి సహా పలు నగరాల్లో నిర్మించిన ఈ కేంద్రాల్లో విశ్రాంతి హాళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, వైఫై సదుపాయాలు ఉంటాయి. కార్మికుల బుకింగ్ కోసం ప్రత్యేక యాప్‌ను కూడా తీసుకురానున్నారు.
రోజూ పొద్దున్నే కూలి పనుల కోసం ఎండనకా, వాననకా రద్దీ కూడళ్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాసే శ్రామికుల కష్టాలకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. కార్మికులకు కనీస వసతులు, భద్రత కల్పించడమే కాకుండా విశ్రాంతి, ప్రాథమిక సదుపాయాల ద్వారా వారి పనిసామర్థ్యాన్ని పెంచేలా ‘లేబర్ అడ్డా’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులందరూ ఒకే చోట అందుబాటులో ఉండటం వల్ల గృహనిర్మాణదారులు, కాంట్రాక్టర్లకు కూలీల కోసం వెతికే శ్రమ తప్పనుంది.
అసంఘటిత రంగ కార్మికులైన తాపీ మేస్త్రీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, ఇతర భవన నిర్మాణ కార్మికులు ప్రతిరోజూ ఉదయం పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద గుమికూడి పనుల కోసం వేచిచూడటం నిత్యం జరుగుతున్నదే. ఆయా సెంటర్లకు ఎవరు వస్తున్నారు? ఎటు వెళుతున్నారు? ఎంత పనిచేస్తున్నారు? పనికి తగ్గ వేతనం అందుతుందా? లేదా? అన్న కనీస సమాచారం ఎవరికీ ఉండటం లేదు. కార్మికులు లేదా కూలీలు జట్టుగా వెళ్లి రావడం, ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపోవడం జరుగుతోంది. ఇక కొన్నిసార్లు పనులు లేకపోతే దూరం నుంచి వచ్చిన వారు నిరాశతో తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాల్సిన పరిస్థితులు. దీనివల్ల వ్యయప్రయాసలకు గురి అవుతున్నారు. ఏళ్లుగా ఇదే పద్ధతి అమలు అవుతున్నా, ఆ కార్మికుల తలరాత మారలేదు. అయితే ఈ ఏడాది మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా ఇటువంటి అసంఘటిత కార్మికుల కోసం ముఖ్యమంత్రి వినూత్న కార్యక్రమం ప్రకటించారు. అదే లేబర్ అడ్డా.
తొలుత 15 నగరాల్లో అనుకున్నప్పటికీ, దీని ప్రాధాన్యత దృష్ట్యా మొదటి దశలోనే 25 లేబర్ అడ్డాలు (ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ కాంప్లెక్స్’ - ILAC) నిర్మించారు. సీఎం ప్రకటన చేసిన ఐదు నెలల్లోనే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఈ కేంద్రాలు రూపుదిద్దుకున్నాయి. 25 కాంప్లెక్స్‌ల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ కేంద్రాల ద్వారా కార్మికులు, యజమానుల మధ్య వారధి నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్మికులకు గుర్తింపు కల్పించడంతోపాటు పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు, కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోనుందని చెబుతున్నారు.
లేబర్ అడ్డాలో ఏం ఉంటాయి?
ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ప్రారంభిస్తున్న లేబర్ అడ్డాలో కార్మికులకు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నారు. వెయిటింగ్ హాళ్లు, శుద్ధమైన తాగునీరు, మరుగుదొడ్లు, వై-ఫై సదుపాయాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఎండలో నిలబడే బాధ తప్పుతూ, సురక్షితమైన తాత్కాలిక వసతి లభించడం వల్ల కార్మికుల శారీరక అలసట తగ్గి, పని ప్రదేశంలో వారి పనిసామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా కార్మికులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా అందించనున్నారు.
గృహనిర్మాణదారులకు సులభతరం
లేబర్ అడ్డాల ఏర్పాటుతో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మేస్త్రీలు, కార్పెంటర్ల కోసం కాంట్రాక్టర్లు, ఇంటి యజమానులు ఇకపై వీధులు పట్టుకుని తిరగాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. నమోదిత, నైపుణ్యం కలిగిన కార్మికులు ఒకే చోట దొరకడం వల్ల వారి సమయం, శ్రమ ఆదా అవుతాయి. అంతేకాకుండా, గృహ యజమానులు నేరుగా కార్మికులను బుక్ చేసుకునేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా తీసుకురానున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి కేంద్ర ప్రభుత్వ ‘ఈ-శ్రమ్’ పోర్టల్‌లో నమోదు చేసుకున్న కార్మికులు రాష్ట్రంలో సుమారు 88.67 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. వీరిలో కేవలం భవన నిర్మాణ పనులుచేసిన వారు దాదాపుగా 18.26 లక్షల మంది ఉంటారని అంటున్నారు. వీరందరికీ ఈ లేబర్ అడ్డాలు ఉపాధి కల్పన కేంద్రాలుగా పనిచేస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.