గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?
| భీమిలీలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నట్లు కథనం పేర్కొంది. స్థానిక నాయకత్వం అందుబాటులో లేకపోవడం, గంటా శ్రీనివాసరావు రాజకీయంగా టార్గెట్ చేయడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. మాజీ ఇంచార్జి చిన్న శ్రీను టీడీపీలో చేరడంతో ఆయన అనుచరులు కూడా పార్టీ మారుతున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో వైసీపీ బలహీనపడటంతో పంచాయతీ ఎన్నికల వేళ వలసలు ఆ పార్టీకి సవాల్‌గా మారాయి.
వైసీపీ ఏరి కోరి కొన్ని అసెంబ్లీ సీట్లను వదిలేసుకుంటోందా అన్న చర్చ అయితే సొంత పార్టీలో సాగుతోంది. వైసీపీ ఒకసారి గెలిచి బలంగా ఉన్న భీమిలీ లాంటి చోట్ల స్థానిక ఎన్నికల పుణ్యమా అని బాగా బలహీనపడుతోంది అని అంటున్నారు. వారూ వీరూ అని కాకుండా వైసీపీ పునాదుల నుంచి ఉన్న వారు అంతా ఫ్యాన్ నీడ నుంచి బయటకు వచ్చి సైకిలెక్కేస్తున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు చెబుతున్నారు. ఒకటి వైసీపీకి భీమిలీలో నేనున్నాను అని గట్టి భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడం అయితే రాజకీయ చతురత కలిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీని గట్టిగా టార్గెట్ చేయడం రెండవది. దాంతో పార్టీ పట్ల జగన్ పట్ల ఎంతో అభిమానం ఉన్న వారు సైతం ఇపుడు పార్టీ మారిపోతున్నారు.
కండువాలు కప్పేస్తున్నారు :
మూడు దశలుగా జరుగుతున్న స్థానిక ఎన్నికల పర్వంలో గత రెండు నెలల నుంచి వైసీపీకి చెందిన కీలక నాయకులు అనేక మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో మండల పరిషత్తు అధ్యక్షులుగా చేసిన వారు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు. వీరంతా ఒక్కటే చెబుతున్నారు. తమకు సరైన నియోజకవర్గ నాయకత్వం లేదని. అందుకే పార్టీ మారాల్సి వస్తోంది అని. నిజానికి వైసీపీకి మొదటి నుంచి భీమిలీలో నాయకులు మారుతూనే ఉన్నారు. అయితే అందరూ నాన్ లోకల్స్ కావడంతో ఎక్కడ నుంచో రిమోట్ కంట్రోల్ తో పార్టీ వ్యవహారాలను ఆపరేట్ చేస్తూ వస్తున్నారు. దాంతో వైసీపీలో నిబద్ధత కలిగిన నాయకులు అయితే ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు.
చిన్న శ్రీను ఎఫెక్ట్ :
భీమిలీ వైసీపీ ఇంచార్జిగా రెండేళ్ళ పాటు పనిచేసిన చిన్న శ్రీను పార్టీ క్యాడర్ తో బాగానే సంబంధాలు నెరిపారు. ఇపుడు ఆయన టీడీపీలోకి మారిపోవడంతో ఆ ఎఫెక్ట్ కూడా గట్టిగాన పడుతోంది అని అంటున్నారు. ఆయన వెంట ఉన్న వారు ఇపుడు వరసగా సైకిలెక్కేస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా వైసీపీ అధినాయకత్వం కీలక నియోజకవర్గం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి నిరాశ కలిగిస్తోంది అని అంటున్నారు. దాంతోనే ఈ వలసలు అని చెబుతున్నారు.
అందుబాటులో లేరుగా :
భీమిలీ వైసీపీ ఇంచార్జిగా బొత్స అనూషను పార్టీ నియమించింది. కానీ ఆమె అందుబాటులో ఉండటం లేదు అన్నది వైసీపీ శ్రేణుల నుంచి ఫిర్యాదులు వస్తున్న విషయం. తాను రుషికొండలో నివాసం ఏర్పాటు చేసుకున్నాను అని ఆమె తొలి మీటింగులో చెప్పారు. ఆ తరువాత ఆమె విజయనగరం జిల్లాలో జెడ్పీటీసీగా పోటీ చేయడంతో సరిగ్గా మునిసిపోల్స్ పరిషత్తు ఎన్నికల్లో సరైన దిశా నిర్దేశం చేసే నాయకత్వం లేకుండా పోయింది అని అంటున్నారు. దాంతో మొత్తం భీమిలీ డివిజన్ లో రెండంటే రెండు కార్పోరేటర్లను వైసీపీ గెలుచుకుంది. అది కూడా ఆ నాయకుల సొంత సామర్థ్యం వల్లనే అని అంటున్నారు. ఇక భీమిలీలో ఉన్న మూడు జెడ్పీటీసీలలో ఒక్కటి కూడా వైసీపీకి దక్కలేదు, అలాగే ఎంపీపీలు అన్నీ కూడా కూటమికే దక్కాయి.
పంచాయతీ ఎన్నికల వేళ :
ఇపుడు చూస్తే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ స్వయంగా వచ్చి ఒక సమావేశం పెట్టారు. తాను అండగా ఉంటాను అని చెప్పారు. కానీ ఆయన ఉండేది వేరే జిల్లాలో అలాగే బొత్స అనూష కూడా నిత్యం తమకు అందుబాటులో ఉండకపోవడం పట్ల క్యాడర్ అసంతృప్తితో ఉందని అంటున్నారు. దీంతో కీలకమైన పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున జంపింగ్స్ వైసీపీ నుంచి టీడీపీలోకి జరుగుతున్నాయి. ఇప్పటికైనా వీటికి అడ్డు కట్ట వేయకపోతే భీమిలీలో వైసీపీలో మరింత వీక్ అవుతుందని అంటున్నారు.