సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు
| సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు 303 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించనున్నట్లు ప్రకటించారు. జూన్ 2024 నుంచి వచ్చిన రూ.22.60 లక్షల కోట్ల ప్రతిపాదనలతో కలిపి మొత్తం పెట్టుబడులు రూ.32.49 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఈ పెట్టుబడులను పరిశ్రమలుగా మార్చి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు.
దేశంలో పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆవిష్కరించారు. పరిశ్రమలు, ఇంధనం, ఎలక్ట్రానిక్స్, రక్షణ, అంతరిక్షం, డేటా సెంటర్లు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, సాగునీటి రంగం తదితర రంగాల్లో రాష్ట్రానికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఇప్పటికే సాధించిన పురోగతిని గణాంకాలతో సహా సీఎం వివరించారు. 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో 303 అవగాహన ఒప్పందాల (MoUs) ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ప్రకటించారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఇవి అదనమని ఆయన పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలు రూ.32.49 లక్షల కోట్లకు చేరాయని సీఎం చంద్రబాబు తన ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ పెట్టుబడులను కేవలం ప్రతిపాదనలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో పరిశ్రమల స్థాపన, ఉత్పత్తి, ఉపాధి కల్పన దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
సదస్సుకు ముందు (జూన్ 2024 నుంచి) రాష్ట్రానికి రూ.22.60 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టుల ప్రతిపాదనలు వచ్చాయని, వీటిలో రూ.17.10 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాలు తదితర అంశాలకు ఆమోదం లభించిందని తెలిపారు. అలాగే మరో రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఆమోదం పొందిన ప్రాజెక్టులలో సంఖ్యాపరంగా 58 శాతం నిర్మాణ సన్నద్ధత దశకు చేరుకోవడం పారిశ్రామిక ప్రణాళిక అమలులో పురోగతిని సూచిస్తోందని ప్రజెంటేషన్‌లో వివరించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో 160 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వెల్లడించారు. ఇందులో ఇప్పటికే 114 గిగావాట్ల సామర్థ్యానికి ఆమోదం లభించిందన్నారు. సోలార్ వేఫర్ తయారీ రంగంలోనూ భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైందని తెలుపుతూ.. 42 గిగావాట్ల సోలార్ సెల్ తయారీ సామర్థ్యంతో పాటు, 53 గిగావాట్ల ఇంగట్ వేఫర్ తయారీ సామర్థ్యానికి అనుమతులు ఇచ్చామని వివరించారు.
ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీలో ఏటా రూ.4.20 లక్షల కోట్ల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ రంగాల్లో ఇప్పటికే రూ.31,926 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని స్పష్టం చేశారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రూ.50 వేల కోట్లు, అంతరిక్ష రంగంలో మరో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది తమ ప్రణాళిక అని అన్నారు. ఐదో తరం యుద్ధవిమాన ప్రాజెక్టును కేవలం 36 రోజుల్లోనే గ్రౌండింగ్ దశకు తీసుకువచ్చినట్లు సీఎం వెల్లడించారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ ఏపీ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని పేర్కొంటూ, రాష్ట్రంలో 4.6 గిగావాట్ల డేటా సెంటర్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చామని తెలిపారు. అమరావతిని అత్యాధునిక సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో 250 ఎకరాల్లో క్వాంటం కంప్యూటింగ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దక్షిణాసియాలోనే తొలి ప్రాజెక్టుగా 'అమరావతి క్వాంటం వ్యాలీ'ని అభివృద్ధి చేసి, 2027 ఫిబ్రవరి 3న ప్రారంభించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
లాజిస్టిక్స్ రంగంలోనూ కీలకంగా ఏపీ
సముద్ర తీరాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ప్రధాన వనరుగా మలచుకునే దిశగా పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. దేశ పోర్టుల ద్వారా జరిగే సరకు రవాణాలో 20 శాతం వాటాను సాధించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు పోర్టులు పనిచేస్తుండగా, వాటి వార్షిక సరకు నిర్వహణ సామర్థ్యం 346 మిలియన్ టన్నులుగా ఉందన్నారు. 2025–26లో 209 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిగిందని, సరకు నిర్వహణలో దేశంలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల ద్వారా మరో 108 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం అందుబాటులోకి రానుందన్నారు. రామాయపట్నం పోర్టును 2027 ఏప్రిల్ నాటికి, మూలపేటను జూన్ నాటికి, మచిలీపట్నాన్ని డిసెంబర్ నాటికి, కాకినాడ గేట్‌వేను 2028 సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించామని స్పష్టం చేశారు.
వీటికి అనుబంధంగా మూడు నౌకా నిర్మాణ క్లస్టర్లు, ఏడు కొత్త ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. దుగరాజపట్నం నౌకా నిర్మాణ క్లస్టర్‌ను 2028–29 నాటికి సిద్ధం చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం 1.55 కోట్లుగా ఉందని, 2025–26లో 62 లక్షల మంది ప్రయాణించారని స్పష్టం చేశారు. భోగాపురం, అమరావతి, తిరుపతిని ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రం మీదుగా 839 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు కారిడార్లతో పాటు 4,415 కిలోమీటర్ల రైల్వే అనుసంధాన ప్రణాళికలను కూడా ప్రజెంటేషన్‌లో ప్రస్తావించారు. పోర్టులు, పారిశ్రామిక పార్కులు, విమానాశ్రయాలు, రైల్వే మార్గాలను సమన్వయం చేయడం ద్వారా రవాణా వ్యయాన్ని తగ్గించి, పరిశ్రమలకు మెరుగైన లాజిస్టిక్స్ సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.
నదుల అనుసంధానానికి ప్రణాళిక
రాష్ట్ర భవిష్యత్తుకు సాగునీరు, తాగునీటి భద్రత కీలకమని పేర్కొంటూ పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి జాతికి అంకితం చేస్తామని సీఎం వివరించారు. గోదావరి–పెన్నా–కావేరీ నదుల అనుసంధానం ద్వారా సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రతిపాదన చేశామని తెలిపారు. గోదావరి–కావేరీ నదుల అనుసంధానంతో ఐదు నదులు, నాలుగు రాష్ట్రాలకు జలభద్రత కల్పించాలన్నది తమ ఆలోచనగా వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ వనరులు, పారిశ్రామిక అవకాశాలను దృష్టిలో పెట్టుకుని 25 రంగాల వారీగా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం తెలిపారు. శ్రీకాకుళంలో కెమికల్ పార్కు, విశాఖపట్నంలో మెడ్‌టెక్ పార్కు, అనకాపల్లిలో ఉక్కు అనుబంధ పరిశ్రమలతో పాటు అరుదైన ఖనిజాలు, ఏఐ డేటా సెంటర్ల వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. ప్రతి ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను పారిశ్రామిక అభివృద్ధికి అనుసంధానం చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలన్నది ఈ ప్రణాళిక వెనుక ఉన్న ఉద్దేశమని ఇన్వెస్టర్లకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి 'స్వర్ణాంధ్ర 2047' విజన్‌ను మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా వాటిని పరిశ్రమలుగా మార్చడం, ఉత్పత్తి పెంచడం, యువతకు ఉపాధి కల్పించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.