ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్
| విశాఖలో జరిగిన 31వ సీఐఐ సమ్మిట్ తొలిరోజు పలు కీలక పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. రిలయన్స్, గెయిల్, ఎల్‌అండ్‌టీ సహా ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. మరోవైపు రష్యాతో కీలక ఖనిజాలు, తయారీ, అణుశక్తి, ఏఐ రంగాల్లో భాగస్వామ్యంపై మంత్రి నారా లోకేష్ చర్చించారు.
విశాఖ వేదికగా జరుగుతున్న 31వ సీఐఐ సమ్మిట్ లో తొలి రోజు ఘనంగా సాగింది. అంగరంగ వైభవంగా మొదలైన ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులతో పాటు వీవీఐపీలు ఎంతో మంది తరలి వచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ వంటి వారు ఈ సదస్సుకు సారధ్యం వహించి దేశీయ విదేశీయ పారిశ్రామిక దిగ్గజాలకు ఘన స్వాగతం పలికారు. ఏపీకి ఉన్న సామర్థ్యాన్ని వివరించడంతో చంద్రబాబుతో పాటు మంత్రులు అంతా విజయవంతం అయ్యారు. అలాగే కేంద్రం ఏపీకి అందిస్తున్న సాయం, ఏపీకి తమకు ఎంతగా కావల్సింది పీయూష్ గోయల్ స్పీచ్ లో చెప్పుకొచ్చారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సామర్థ్యాన్ని ఆయన కొనియాడారు. బాబు తనకు రెండు దశాబ్దాల నుంచి తెలుసు అంటూ ఆయన ఘనతను పీయూష్ గోయల్ చాలా గొప్పగా చెప్పారు.
వరస ఒప్పందాలు :
ఇక తొలిరోజు చూస్తే ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కూటమి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రిలయన్స్, గెయిల్, సెయింట్ గోబెయిన్, ఎల్ అండ్ టీ, గ్రీన్‌కో ఎనర్జీస్ సంస్థలతో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. అదేవిధంగా మరో మూడు ప్రముఖ సంస్థలు తమ పరిశ్రమల కార్యకలాపాలను ప్రారంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో కాపీలను సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి అందించారు. జీవోలు అందుకున్న పరిశ్రమలలో వారీ క్లీన్ ఎనర్జీస్ సొల్యూషన్, హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్, కెల్లాగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.
వైజాగ్ నుంచి కజాన్ :
అదే విధంగా *ఆంధ్రప్రదేశ్ రష్యా భాగస్వామ్యానికి నూతన అడుగులు ఈ సమ్మిట్ లో పడడం విశేషం. భారత్ రష్యా మధ్య చిరకాలంగా కొనసాగుతున్న వ్యూహాత్మక స్నేహబంధాన్ని ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మరింత బలోపేతం చేసేందుకు విశాఖ సమ్మిట్ వేదికగా మారింది. కీలక ఖనిజాల నుంచి అణుశక్తి వరకు సాంకేతిక సహకారానికి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి నారా లోకేష్ రష్యా పారిశ్రామిక ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. కీలక ఖనిజాలు, మెటలర్జీ, తయారీ, చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్లు, కృత్రిమ మేధస్సు, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించవచ్చని లోకేష్ తెలిపారు. అలాగే మెటలర్జీ, తయారీ, ఓడరేవుల మౌలిక సదుపాయాలు, సముద్ర రవాణా, ఆర్థిక లావాదేవీలకు అనువైన చెల్లింపు వ్యవస్థలు, బలమైన సరఫరా వ్యవస్థల అభివృద్ధి పైన కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ఏపీ రష్యా బంధం :
రష్యాలోని తతారిస్తాన్ ప్రతినిధుల భాగస్వామ్యంతో ఇరు ప్రాంతాల వ్యాపార సంస్థల మధ్య ప్రత్యక్ష అనుసంధానం సంయుక్త పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలను విస్తరించే అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్య విస్తరణకు రష్యా పూర్తి మద్దతు ఇస్తుందని భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌తో వాణిజ్య పారిశ్రామిక, సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు రష్యా పూర్తి ఆసక్తితో ఉందని డెనిస్ అలిపోవ్ తెలిపారు. భారత్ రష్యా ఇరు పక్షాలు కలిసి సుమారు 40 కొత్త ప్రాధాన్యతా పెట్టుబడి ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాయని తద్వారా 50 బిలియన్ అమెరికన్ డాలర్ల పరస్పర పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నట్లు డెనిస్ అలిపోవ్ వెల్లడించారు. నావిగేషన్ వ్యవస్థలు కృత్రిమ మేధస్సు ఆధారిత విమానాశ్రయ పరిష్కారాలు వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లోనూ పరస్పర సహకారానికి అవకాశాలున్నాయని వివరించారు.