సమ్మిట్ సూపర్ హిట్... 303 ప్రాజెక్టులు...9.89 లక్షల కోట్ల పెట్టుబడులు !
| విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన సీఐఐ సమ్మిట్ ద్వారా ఏపీకి 303 ప్రాజెక్టులు, రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కియా రూ.18,878 కోట్లు, రిలయన్స్ రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయని వెల్లడించారు. పెట్టుబడులను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు.
రెండు రోజుల పాటు విశాఖ వేదికగా నిర్వహించిన సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్ అయింది అని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు రోజుల సదస్సులో ఏకంగా 303 ప్రాజెక్టులు ఏపీకి వస్తున్నాయని పేర్కొంది. అలాగే 9.89 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి వస్తున్నాయని వివరించింది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ సక్సెస్ అయింది అని చంద్రబాబు చెప్పారు. వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు సమ్మిట్ లో పాల్గొన్నారని చెప్పారు.
కీలక రంగాలలో :
ఈ సదస్సు ద్వారా కీలక రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని వివరించారు. నేవిగేటింగ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ అనే థీమ్‌తో ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్, థాట్ లీడర్‌షిప్ అంశాలపై రెండు రోజుల పాటు సదస్సు జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి పెట్టుబడులను తీసుకురావడం, ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయడమే కూటమి ప్రభుత్వం సంకల్పమని బాబు అంటున్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుతో పాటు ఆరు సన్నాహక సమావేశాల ద్వారా పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. చేనేత క్లస్టర్ ల నుంచి ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ వరకు వివిధ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. కియా సంస్థ ఏడాదికి అదనంగా రెండు లక్షల కార్ల తయారీ కోసం 18,878 కోట్ల రూపాయల పెట్టుబడికి ముందుకు వచ్చిందని, రిలయన్స్ సంస్థ రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. 2024 నుంచి వచ్చిన 714 పెట్టుబడి ప్రతిపాదనల్లో 522 ప్రతిపాదనలు వాస్తవ రూపం దాల్చుతున్నాయని తెలిపారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ :
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం పారిశ్రామిక అనుమతుల విషయంలో అమలు చేస్తున్నామని బాబు చెప్పుకొచ్చారు. నాలా చట్టాన్ని రద్దు చేశామని కేవలం 13 లైసెన్సుల ద్వారా ఐదు రోజుల్లోనే అనుమతులు ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఆటోమేటిక్ అప్రూవల్స్, సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానాలను అమల్లోకి తెచ్చామని ప్రతి ప్రాజెక్టుకు నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా విధానాన్ని ప్రారంభించామని పారిశ్రామిక సంస్కరణల్లో ఇది ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించేందుకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్టును కూడా అమలులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలైతే పెద్దఎత్తున పెట్టుబడుల ప్రవాహం వస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వాటిని సంరక్షించడం కార్యరూపంలోకి తీసుకురావడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
ఏఐ, పునరుత్పాదక ఇంధన రంగాలు కీలకం :
మరో వైపు చూస్తే గతంలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నామని ఇప్పుడు 'వన్ ఫ్యామిలీ వన్ ఏఐ' విధానం ద్వారా నైపుణ్యం కలిగిన వారిని తయారు చేస్తామని చంద్రబాబు తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రతి ఇంటిపైనా సౌర ఫలకాలను ఏర్పాటు చేసి అధిక విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ఉండగా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే 160 గిగావాట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. కేంద్రం సహకరిస్తే ఈ లక్ష్యాన్ని మించి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు డ్వాక్రా మహిళలకు చేయూత అందిస్తున్నామని చెప్పారు.
నదుల అనుసంధానం :
ప్రస్తుతం నీటి భద్రత కీలక అంశంగా మారిందని గోదావరి-కావేరి నదుల అనుసంధానం దక్షిణాది రాష్ట్రాలకు పరిష్కారం చూపుతుందని బాబు అభిప్రాయపడ్డారు. నీటి పంపకాల విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని గోదావరి కావేరి అనుసంధానంతో ఈ విభేదాలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. తమిళనాడు-కర్ణాటక, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు నీటి వివాదాలను పరిష్కరించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఏపీ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని, ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడంలో రాష్ట్రం ముందుందని తెలిపారు.