విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్
| విశాఖపట్నం నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడిపేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఈ రైలు 8 గంటల 45 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోనుంది. ఉదయం 5:35కు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 2:10కు తిరుపతి చేరుతుంది. సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో స్టాపులు ప్రతిపాదించారు. తుది షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విశాఖ నుంచి తిరుపతి వెళ్ళాలి అంటే ప్రస్తుతం ఉన్న రైళ్ళు తిరుమల ఎక్స్ ప్రెస్ అలాగే విశాఖ- తిరుపతి ఎక్స్ ప్రెస్ వంటివి ఉన్నాయి. అలాగే ప్రతిరోజూ వారంలో ప్రత్యేక రోజుల్లో నడిచే మరిన్ని ముఖ్యమైన రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రయాణ సమయం చూస్తే సాధారణంగా 15 గంటల దాకా ఉంటుంది. ఇక తిరుమల ఎక్స్ ప్రెస్ ఎపుడూ ఫుల్ రష్ గా సాగుతుంది. విశాఖ-తిరుపతి ఎక్స్ ప్రెస్ ఎక్కితే సమయం మరింతగా పడుతుంది. దాంతో విశాఖ నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని వేయాలని భక్త జనులు ఎంతో కాలంగా కోరుతున్నారు. ఇన్నాళ్ళకు వెంకన్న ఈ మొక్కులు విని వరం ప్రసాదించాడు అంటున్నారు. తొందరలోనే విశాఖ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు పట్టాలెక్కబోతోంది అని అంటున్నారు.
తొమ్మిది గంటలలోపే :
విశాఖ నుంచి తిరుపతికి వెళ్ళాలంటే రోజులో ముప్పావు వంతు సమయం వెచ్చించాల్సిన అవసరం లేకుండా వందే భారత్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా విశాఖపట్నం టూ తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కబోతోంది. అలా విశాఖ నుంచి కేవలం 8.45 గంటల జర్నీతో దేవదేవుడి సన్నిధి కోసం ఈ వందే భారత్ రైలు పగటిపూట నడిచేలా ప్రాథమిక షెడ్యూల్ సిద్ధమైంది అని చెబుతున్నారు. దీని మీద అయితే ఇంకా అధికారిక ప్రకటనతో పాటు తుది షెడ్యూల్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం విశాఖపట్నంలో ఉదయం 5:35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:10 గంటలకు తిరుపతి చేరుతుంది. అలాగే తిరుపతి నుంచి మధ్యాహ్నం 2:55 గంటలకు బయల్దేరి రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుతుంది. విశాఖ తిరుపతి వందేభారత్ కోసం ప్రతిపాదిత స్టాపులుగా అయిదు స్టేషన్లని నిర్ణయించారని అంటున్నారు. సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులలో ఆగి తిరుపతి చేరుకుంటుంది.
హ్యాపీ జర్నీగానే :
తిరుపతి అంటే ముందు రోజు బయలుదేరి మరుసటి రోజుకు చేరుకోవడమే ఇప్పటిదాకా విశాఖ వాసులు చూస్తూ వస్తున్నారు. ఒక రాత్రి అంతా రైలులో గడపడం కూడా అలవాటు చేసుకున్నారు. కానీ విశాఖ తిరుపతి వందేభారత్ ద్వారా అయితే ఉదయం అయిదుకు బయలుదేరి వెళ్తే మధ్యాహ్నం తిరుపతి చేరుకుంటారు. సాయంత్రం దర్శనానికి వీలు అవుతుంది. దాంతో చాలా సమయం కలిసి వస్తుంది అని అంటున్నారు. అంతే కాదు శ్రమ టైం కూడా తగ్గి ఉల్లాసంగా ఈ జర్నీ మారుతుంది అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన కృషితోనే విశాఖ తిరుపతి వందేభారత్ ట్రైన్ రాబోతుంది అని అంటున్నారు.