ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న
| ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వచ్చే నెలలో టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోందని వైసీపీ ఆరోపించింది. విజయవాడలో ప్రజాసంఘాల నేతలతో సమావేశమైన మాజీ మంత్రి పేర్ని నాని, ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం కోసం రూ.1,500 కోట్లు ఖర్చు చేసే బదులు రెండు మెడికల్ కాలేజీలను పూర్తి చేయొచ్చని ప్రశ్నించారు. ప్రజాసంఘాలతో కలిసి పోరాడతామని ప్రకటించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని విపక్షం వైసీపీ మరోసారి తెరపైకి తెచ్చింది. వచ్చేనెలలో ప్రైవేటీకరణకు ప్రభుత్వం టెండర్లు పిలవనుందని ఆరోపణలు చేస్తోంది. ఈ విషయమై విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రజాసంఘాల నేతలతో కలిసి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నాని రాజధాని అమరావతిలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఆ డబ్బుతో రెండు మెడికల్ కాలేజీలను అయినా పూర్తి చేయొచ్చు కదా? అంటూ ప్రశ్నించారు.
మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం ద్వారా ప్రైవేటీకరణను ముందుకు తీసుకువెళ్లకుండా అడ్డుకోవాలని వైసీపీ భావిస్తోందని చెబుతున్నారు. గత ఏడాది ఈ అంశంపై ఉధృత పోరాటం చేసిన వైసీపీ అనుకున్న ఫలితం సాధించిందని అంటున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలని భావించిన ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఎవరు టెండర్లు వేయొద్దని, తన మాట కాదని ఎవరైనా టెండర్లు వేస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేస్తామని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి హెచ్చరించారు. దీంతో అప్పట్లో ఏ ఒక్కరూ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందుకు రాలేదని అంటున్నారు.
ఇక ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గకూడదని నిర్ణయం తీసుకున్న వైసీపీ తాజాగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని చెబుతూ, పోరాటానికి సిద్ధమనే సంకేతాలు పంపింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఈ విషయమై మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పై ఘాటు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ కు ఏమైనా అనారోగ్యం అనిపిస్తే హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారని ఆరోపించారు. పవన్ భుజం శస్త్రచికిత్సకు ముంబై వెళ్లిన విషయాన్ని ఎత్తిచూపారు.
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో సరైన వైద్యం అందడం లేదని పేర్ని ఆరోపించారు. అందుకే ప్రభుత్వంలో ఉన్న వారు పక్క రాష్ట్రాలకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ప్రతి నెల పింఛన్లు పంపిణీకి ఏదో ఒక జిల్లాకు వెళుతున్నారని, ఈ పర్యటన కోసం రూ.2 కోట్లు వరకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. గత రెండున్నరేళ్లలో ఈ డబ్బు జాగ్రత్త చేసిన రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయ్యేదని మాజీ మంత్రి పేర్ని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైసీపీ అంగీకరించదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రజాసంఘాలతో కలిసి పోరాడతామన్నారు. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా, మెడికల్ కాలేజీల విషయంలో అంతా ఓకే మాటపై నిలుస్తామని తేల్చిచెప్పారు.