వాసిరెడ్డి పద్మ వారసురాలి విజయం!
| వాసిరెడ్డి పద్మ. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీలో ఐదేళ్లపాటు మహిళా కమిషన్ చైర్ పర్స న్‌గా వ్యవహరించిన పద్మ.. తర్వాత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చారు.
వాసిరెడ్డి పద్మ. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీలో ఐదేళ్లపాటు మహిళా కమిషన్ చైర్ పర్స న్‌గా వ్యవహరించిన పద్మ.. తర్వాత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చారు. అనంతరం.. ఆమె ఏ పార్టీలోనూ చేరలేదు. కానీ.. వైసీపీ పై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ నాశనానికి జగన్ వైఖరే కారణమని ఆమె దుయ్యబట్టారు. అదేసమయంలో జగన్ పర్యటనలపై కూడా విమర్శలు గుప్పించారు. రప్పా.. రప్పా బ్యాచ్ ను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. గంజాయి బ్యాచ్‌ను డెవలప్ చేస్తున్నారని కూడా దుయ్యబట్టారు.
ఇలా వాసిరెడ్డి పద్మ వార్తల్లో తరచుగా కనిపిస్తున్నారు. తాజాగా ఆమె కుమార్తె మేఘనను సైలెంట్‌గా రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. జనసేన తీర్థం పుచ్చుకున్న పద్మకుమార్తె వాసిరెడ్డి మేఘన తాజాగా జరిగిన.. మునిసిపల్ ఎన్నికల్లో జగ్గయ్య పేట నుంచి పోటీ చేశారు. 31వ వార్డు నుంచి కౌన్సిలర్ గా బరిలోకి దిగిన మేఘన.. తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. వైసీపీ నాయకురాలిపై 540 ఓట్ల మెజార్టీతో వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన ఘన విజయం సాధించారు.
జగ్గయ్యపేట కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా 31వ వార్డు నుంచి పోటీ చేసిన వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన బలమైన పోటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో మేఘన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థినిపై 540 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో జనసేన శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం మేఘనకు శుభాకాంక్షలు తెలిపారు. చదువుకున్న యువతిగా గుర్తింపు పొందడంతోపాటు.. ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన ఆకాంక్షించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మొత్తంగా జగ్గయ్య పేటలో కూటమి హవా కనిపించింది. 11 వార్డుల్లో టీడీపీ 7, జనసేన 3 గెలుచుకోగా.. వైసీపీ 1 వార్డును సొంతం చేసుకుంది. దీంతో జగ్గయ్య పేటలో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. వాస్తవానికి ఇక్కడ విజయం కోసం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నించారు. అయితే.. అదే పార్టీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో ఉండడంతో.. వైసీపీ కేడర్‌ను ఆయన తనకు అనుకూలంగా మార్చేశారన్న చర్చ జరిగింది. తాజా ఫలితాల్లో జనసేనకు కేటాయించిన అన్ని వార్డుల్లోనూ ఆ పార్టీ అభ్యర్తులు విజయం దక్కించుకున్నారు.