బెజవాడ సెంట్రల్ లో కొత్తగా ఓటు.. మేయర్ సీటుపై వంగవీటి స్కెచ్!
రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార కూటమిలో మేయర్ సీటు కోసం జరుగుతున్న పోటీ రాజకీయాలను అత్యంత ఆసక్తికరంగా మార్చేస్తోంది.
రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార కూటమిలో మేయర్ సీటు కోసం జరుగుతున్న పోటీ రాజకీయాలను అత్యంత ఆసక్తికరంగా మార్చేస్తోంది. ఇప్పటికే ఈ సీటుపై అరడజను మంది నాయకులు కన్నేయగా, తాజాగా ప్రముఖ కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కుటుంబం దూసుకువచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఎదురుచూస్తున్న సమయంలో రాధాకృష్ణ సతీమణి పుష్పవల్లి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో తన ఓటు నమోదు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ఈ పరిణామంతో ఆమె మేయర్ గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని అభిమానులు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణతో ప్రస్తావించగా ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నారని అంటున్నారు.
ఊపందుకున్న ఊహాగానాలు
విజయవాడ మేయర్ సీటుపై కూటమిలో అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. ఇందులో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కుమారుడు సిద్ధార్థ్ తోపాటు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, సీనియర్ నేత చెన్నుపాటి గాంధీ, గన్నే వెంకట నారాయణ ప్రసాద్, బొప్పన భవకుమార్, ముమ్మనేని ప్రసాద్, జాస్తి సాంబశివరావు, కోగంటి రామారావు, దేవినేని అపర్ణ, కోనేరు రమాదేవి, చెన్నుపాటి ఉషారాణి తదితరుల పేర్లు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కూటమిలో రాజకీయాలు వేగంగా మారిపోయిన సంకేతాలు అందాయి. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను వేర్వేరుగా కలిశారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమే అంటూ బయటకు చెప్పినా, పక్కా రాజకీయ వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది. మేయర్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఇద్దరు ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణను కోరినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై కుటుంబంలో చర్చించిన రాధాకృష్ణ ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ముందుగా తన భార్య పేరును ఓటరు జాబితాలో చేర్పించినట్లు చెబుతున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి కుటుంబానికి మేయర్ సీటు రిజర్వు అయిందనే ప్రచారం ఊపందుకుంది.
అత్యంత గోప్యం
విజయవాడ మేయర్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ లేదా ఆయన భార్య పుష్పవల్లి పోటీ చేయడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. ఈ సీటు కూటమి పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి కేటాయించినా అభ్యర్థిగా వంగవీటి కుటుంబ సభ్యులే ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఏకాభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. రాధాకృష్ణ 2019 నుంచి టీడీపీలో ఉండగా, ఆయన భార్య పుష్పవల్లి తల్లిదండ్రులు ఇద్దరూ జనసేనలో క్రియాశీలంగా పనిచేస్తున్నారని అంటున్నారు. దీంతో ఆ కుటుంబం విషయంలో రెండు పార్టీల్లో ఏకాభిప్రాయం, సానుకూలత ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లకు కూడా వంగవీటి కుటుంబానికి న్యాయం చేయలేదనే అసంతృప్తి ఒక ప్రధాన సామాజిక వర్గంలో ఉందని, కీలకమైన మేయర్ పదవి కేటాయించడం వల్ల రాజకీయంగా కూడా మంచి నిర్ణయం అవుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని ముఖ్యనేతల సూచనలతో రాధాకృష్ణ కానీ, ఆయన అనుచరులు కానీ అధికారికంగా ధృవీకరించడం లేదని అంటున్నారు.
సెంట్రల్ లో ఓటు నమోదు
మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 12 తర్వాత షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనగా, ఆఘమేఘాలపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సతీమణి ఓటు హక్కు నమోదు చేసుకోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాధాకృష్ణ, పుష్పవల్లి వివాహమై చాలా కాలం అయినప్పటికీ, ఇప్పుడే ఓటు నమోదు చేసుకోవడం వెనుక మేయర్ గా పోటీ చేసే ఆలోచన ఉందని అంటున్నారు. రిజర్వేషన్ ఆధారంగా రాధాకృష్ణ లేదా ఆయన భార్య పోటీ చేయొచ్చునని అంటున్నారు. గత పాలకవర్గంలో బీసీ మహిళకు రిజర్వు చేసినందున ఈ సారి ఓసీ జనరల్ లేదా ఓసీ మహిళకు అవకాశం దక్కవచ్చునని భావిస్తున్నారు. ప్రత్యక్ష విధానంలో ఎన్నిక జరగనున్నందున విజయవాడ నగరంపై పట్టు ఉండే బలమైన నేత కోసం అన్వేషిస్తున్న క్రమంలో వంగవీటి కుటుంబం తెరపైకి వచ్చిందని అంటున్నారు. వంగవీటికి పదవిపై టీడీపీ, జనసేనలో సానుకూల అభిప్రాయం ఉండటం కూడా కలిసివచ్చిందని అంటున్నారు.