చివరకు.. పవన్ మాటే 'గెలిచింది'!
| నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించిన కొలగాని శిరీష విజయం సాధించారు. కూటమి ఒప్పందం ప్రకారం జనసేనకు కేటాయించిన పదవికి శిరీష పేరును పవన్ ఖరారు చేసినా, మంత్రి ఆనం జోక్యంతో కత్తి పద్మజ పేరు తెరపైకి రావడంతో వివాదం నెలకొంది. చివరకు మంగళవారం నిర్వహించిన ఎన్నికలో శిరీష బాధ్యతలు చేపట్టారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపల్ వైస్ చైర్‌పర్సన్ పదవి ఎంపిక విషయంలో కూటమి నేతల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో చివరకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటే గెలిచింది. ఈ వివాదంలో టీడీపీ నేత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జోక్యం చేసుకోవడంపై సీఎం చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక, ఈ వ్యవహారంలో సోమవారం జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ మంగళవారం పూర్తయింది.
కూటమి ఒప్పందం ప్రకారం ఆత్మకూరు మునిసిపల్ వైస్ చైర్‌పర్సన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో పవన్ కల్యాణ్.. 11వ వార్డు కౌన్సిలర్ గా విజయం దక్కించుకున్న కొలగాని శిరీష పేరును ఆ పదవికి ప్రతిపాదించారు. అనంతరం.. బీ-ఫామ్ కూడా ఆమెకే అందించారు. దీంతో అంతా ప్రశాతంగా జరిగిపోతుందని అందరూ భావించారు. అయితే.. సోమవారం నాటి ప్రమాణ స్వీకార కార్యక్రమం సమయంలో శిరీషకు బదులుగా మరో జనసేన కౌన్సిలర్ కత్తి పద్మజ పేరు తెరమీదికి వచ్చింది. ఇదే వివాదానికి కారణమైంది.
అంతేకాదు.. జనసేన వ్యవహారంలో మంత్రి ఆనం జోక్యం చేసుకోవడం.. జనసేన నిర్ణయించిన అభ్యర్థి శిరీషను కాదని.. స్వయంగా పద్మజ పేరును ఆనం రామనారాయణరెడ్డి ప్రతిపాదించడం దుమారానికి దారితీసింది. అధిష్టానం ప్రకటించిన అభ్యర్థిని కాదని, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జోక్యంతో ఏకపక్షంగా కత్తి పద్మజ పేరును ఖరారు చేశారని ఆరోపిస్తూ జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, ఇతర పార్టీ కార్యకర్తలు మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు, తన ప్రమేయం ఏమీ లేదని మంత్రి ఆనం స్పందించినట్లు వార్తలు వచ్చినా.. టీడీపీ అధిష్టానం ఈ విషయాన్ని ఖరారు చేసుకుంది. దీంతో ఆనంను జోక్యం చేసుకోవద్దని పార్టీ పెద్దలు తేల్చిచెప్పారు.
మరోవైపు.. పవన్ కళ్యాణ్ సూచించిన అభ్యర్థిని మార్చడంపై జనసేన అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సోమవారం జరిగిన ఎన్నిక ప్రక్రియను అధికారులు రద్దు చేసి, మరుసటి రోజు (మంగళవారం) ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ ముందే నిర్ణయించి, బీఫాం కూడా ఇచ్చిన శిరీషను సభ్యులు ఎన్నుకొన్నారు. దీంతో ఆమె వైస్ చైర్మన్ గా పగ్గాలు చేపట్టారు. ఈ పరిణామాలపై టీడీపీ అంతర్గత విచారణకు ఆదేశించింది. జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ నేతలు జోక్యం చేసుకోవడం, మంత్రి స్వయంగా జనసేన అభ్యర్థులను తన కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లడంపై నివేదిక ఇవ్వాలని పేర్కొంది.