ఏపీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది...రాహుల్ నజర్
| ఏపీలో కాంగ్రెస్ ఉనికిపై మరోసారి చర్చ మొదలైంది. స్థానిక ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపలేకపోవడం, షర్మిల జగన్‌తో వ్యక్తిగత వివాదాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ మద్దతు అంశం కూడా చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీపై రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెడతారనే ప్రచారం ఆసక్తికరంగా మారింది.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా అన్నది ఒక చర్చ అయితే ఆ పార్టీ పోరాటం ఎవరి మీద చేస్తోంది మరో చర్చ. అసలు ఈ పోరాటాలు అన్నీ ఆరాటాలేనా సొంత అజెండా వ్యక్తిగత లక్ష్యాలు కక్షలేనా అన్నది మరో కీలక ప్రశ్న. ఇవన్నీ కూడా ఏపీ కాంగ్రెస్ లో ఇంకా మిగిలి ఉన్న నిబద్ధత కలిగిన సీనియర్ నేతల నుంచి వస్తున్న సందేహాలు. అలాగే అసలు పార్టీలో ఏమి జరుగుతోంది అన్నది కూడా ఆందోళన కలిగించే వ్యవహారంగా చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల వైసీపీ అధినేతగా ఉన్న వైఎస్ జగన్ ల మధ్య జరుగుతున్న వ్యక్తిగత వ్యవహారాలు ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి అవసరమా అన్నది కూడా మరో చర్చ. ఏపీలో చూస్తే కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా ఉనికి చూపించింది ఏమీ లేదని విమర్శ ఉంది.
గుడ్డిలో మెల్లగా :
ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాలలో మాత్రం కాంగ్రెస్ కాస్తా కనిపించింది అంటే అది మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ క్రెడిట్ లోకే వెళ్తుందని అంటారు. ఆయన తన సొంత బలంతోనే కాంగ్రెస్ ని అక్కడా కొద్దో గొప్పో నిలబెట్టగలిగారు. అది తప్పించి మొత్తం ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ పోటీ చేసినా సోదిలోకి లేకుండా పోయింది అని అంటున్నారు. పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల కాంగ్రెస్ ని పట్టించుకోలేదని కూడా విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలైన కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఆవేదన కలిగిస్తున్నాయని అంటున్నారు.
డీకే సీఎం గా :
ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ఉన్నారు. ఆ రాష్ట్రంలో షర్మిల పీసీసీ చీఫ్ గా ఉంటూ యలహంక ప్యాలెస్ లోకి వెళ్లాలని ప్రయత్నాలను అక్కడి పోలీసులు అడ్డుకోవడం కూడా చర్చనీయాంశం అవుతోంది. తమ సొంత పార్టీకి చెందిన పీసీసీ చీఫ్ అయినా కోర్టు ఆదేశాలను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడానికే మొగ్గు చూపిందని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక బెంగళూరు యలహంక ప్యాలెస్ చుట్టూ సాగుతున్న వివాదం ఇవన్నీ కూడా అక్కడి ప్రభుత్వానికి తెలియనివి కావని అంటున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ పెద్దలకు ఫీడ్ బ్యాక్ వెళ్లే ఉంటుందని కూడా చెబుతున్నారు.
టీడీపీ మద్దతు మీద :
ఇక కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న షర్మిలకు టీడీపీ మద్దతుగా నిలవడం మీద కూడా చర్చ సాగుతోంది. చంద్రబాబుకు పెళ్ళి కార్డు షర్మిల అందించారు అన్న దాని మీద వైసీపీ సొంత మీడియా కధనాలు రాసింది. దాని మీద తప్పేముంది అని మాట్లాడటం వరకూ టీడీపీ పెద్దలు ఓకే కానీ అంతకు మించి అన్నట్లుగా షర్మిలకు మద్దతుగా నిలవడం టీడీపీ సొంత మీడియా కూడా ఆమె వైపు ఉండడం ఇవన్నీ చూసిన వారికి కేంద్రంలో ఎన్డీయే మీద కాంగ్రెస్ పోరాడుతూంటే ఏపీలో ఎన్డీయే మీద కాంగ్రెస్ ఏ మేరకు పోరాటం చేస్తోంది అన్నది కూడా చర్చిస్తున్నారు.
ఏం చేస్తారు :
దేశమంతా కాంగ్రెస్ గాలులు వీస్తున్నాయని దానిని అందిపుచ్చుకోవాలని జాతీయ స్థాయిలో ఆ పార్టీ పెద్దలు ప్రవచిస్తున్నారు మరి ఏపీలో కాంగ్రెస్ గాలి లేదా లేక వచ్చినా పట్టించుకోవడం లేదా లేక కాంగ్రెస్ నే ఏకంగా గాలికి వదిలేశారా అన్నది కూడా చర్చ సాగుతోంది. మరి ఏపీ మీద కాంగ్రెస్ ఫోకస్ పెడుతుందని కూడా మరోసారి చర్చ సాగుతోంది. అది భారీ మార్పులకు దారి తీస్తుందా లేక ఇంకా ఏమైనా జరుగుతుందా అనంది అయితే తెలియరావడం లేదు కానీ ఏపీ వైపు రాహుల్ గాంధీ చూపు ఉందని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత అన్నది చూడాల్సి ఉంది.