కవితక్క...సెటిలర్ల అస్త్రం..
| కొత్తగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ప్రారంభించిన కల్వకుంట్ల కవిత సెటిలర్ల ఓటు బ్యాంకుపై దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెటిలర్లు కూడా తెలంగాణ బిడ్డలేనని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని కొవ్వూరులో ఆమె వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల పంపకాలపై కూడా ఏపీకి సానుకూలంగా స్పందించారు.
తెలంగాణా రక్షణ సేన షార్ట్ కట్ లో టీఆర్ఎస్ అని ఒక పార్టీని సొంతంగా ప్రారంభించిన కల్వకుంట్ల కవిత ఇపుడు కొత్త వ్యూహంలో ముందుకు సాగుతున్నారు. తెలంగాణా వాదం గానంలో తండ్రి మాజీ సీఎం కేసీఅర్ కి ధీటుగా గొంతు కలిపిన ఈ మహిళా నాయకురాలు ఇపుడు సొంత పార్టీ పెట్టాక సెటిలర్ల వైపు మాట్లాడుతుండడం ఆశ్చర్యమే కానీ రాజకీయంగా చూస్తే అది ఒక వ్యూహం అనక తప్పదు. ఎందుకంటే తెలంగాణవాదానికి వాటాదారులు ఎంతో మంది ఉన్నారు. పైగా బీఆర్ఎస్ దానికి బ్రాండ్ అంబాసిడర్. మళ్లీ అదే వాదంతో కవితక్క ముందుకు సాగితే ఆ ఓటు షేర్ లో ఎంత వాటా దక్కుతుందో లేదో కూడా తెలియదు. అందుకే సెటిలర్ల ఓటు బ్యాంక్ మీద గురి పెడితే ఫలితం ఉండొచ్చు అన్నది కవితక్క కొత్త ఆలోచనగా చెబుతున్నారు.
ఒకనాడు అలా :
నిజానికి తెలంగాణా వాదాన్ని గట్టిగా రెచ్చగొట్టింది కేసీఆర్ కుటుంబం అన్నది తెలిసిందే. అందులోనూ కవిత మరింత దూకుడుగా వ్యవహరించింది. ఆనాడు ఉద్యమ కాలంలోనూ ఆ తరువాత బీఆర్ఎస్ పాలన వచ్చాక కూడా అవసరం అయిన ప్రతీ సందర్భంలోనూ తెలంగాణా వాదమే వినిపిస్తూ వచ్చారు. 2018 లో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఏపీ పెత్తనం అంటూ రచ్చ చేసింది కూడా కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన నాయకులే అని అంటారు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా కవిత గొంతు మారింది. సెటిలర్లు అయినా తెలంగాణా బిడ్డలే అని ఆమె అంటోంది. వారు కూడా పన్నులు కడుతున్నారు అంటూ కవిత మాట్లాడుతున్న తీరుని చూస్తే కనుక ఆమె పక్కా వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారని అంటున్నారు.
అన్నదమ్ములుగా అంటూ :
ఇక తాజాగా చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన వన సమారాధనకు వచ్చిన కవిత ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని రెండు రాష్ట్రాలను కోరుకుంటున్నామని ఆమె చెప్పడం విశేషం. అంతే కాదు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు బాగుండాలని రెండు చోట్లా అభివృద్ధి జరగాలని గట్టిగా కోరుకుంటున్నారు. అంతే కాదు కృష్ణా నదీ జలాల మీద ఆమె కొంత ఏపీకి సానుకూలంగానే మాట్లాడారు, అనుమతులు తెచ్చుకునే ప్రాజెక్టులు కడుతున్నామని ఏపీ ప్రభుత్వం అంటున్నపుడు తెలంగాణా ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో ఇప్పటిదాకా ఉదాశీనంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. అంతే కాదు నీటి పంపకాల విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుని ఆమె కోరడం మరో విశేషం.
సెటిలర్ల మచ్చికతో :
కవిత వ్యూహం అర్ధం అయితే ఆమె ఎందుకిలా మాట్లాడుతున్నారో బోధపడుతుంది అని అంటున్నారు. సెటిలర్లకు హైదరాబాద్ తో పాటు ఖమ్మం వంటి కీలకమైన జిల్లాలలో భారీగా ఓట్లు ఉన్నాయి. అలాగే అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అందువల్ల సెటిలర్లతో మంచిగా ఉంటే తమ పార్టీ రాజకీయంగా బలపడుతుందని కవిత ఆలోచిస్తోంది అని అంటున్నారు. అందుకే సెటిలర్లు తెలంగాణా బిడ్డలు ఆమె అనడమే కాదు, వారితో రాజకీయాలు చేస్తున్నారు అని ప్రత్యర్థుల మీద విమర్శలు అందుకున్నారు. మొత్తంగా చూస్తే కవిత తెలంగానంలో సెటిలర్ల పల్లవి కొత్తగా వినిపించడమే ఆమె టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో మరో మలుపు అంటున్నారు.