ఆస్తుల ప్రదర్శనతో చిక్కులు.. గోల్డ్ మ్యాన్ యాదగిరికి ఐటీ షాక్
| తెలంగాణకు చెందిన యాదగిరి చిన్నగౌడ్ తన ఆస్తుల వివరాలను యూట్యూబ్‌లో వెల్లడించడంతో ఐటీ అధికారుల పరిశీలన మొదలైనట్లు సమాచారం. రాయదుర్గంలోని భవనాన్ని జప్తు చేయగా, లెక్కల్లో చూపని 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ.4 లక్షల ఆదాయం చూపినా, భవనం అద్దె రూ.38.4 లక్షలుగా ఉన్నట్లు కథనం.
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? డ్యాన్స్ చేయాలి.. రీల్స్ చేయాలి.. ‘పాలు అమ్మిన.. పూలు అమ్మిన’ అంటూ పంచ్ డైలాగులు వేయాలి.. లేదా తమ దగ్గరున్న ఆస్తుల చిట్టాను మైకు ముందు ఏకరువు పెట్టాలి.. తెలంగాణకు చెందిన గోల్డ్ మ్యాన్ యాదగిరి చిన్నగౌడ్ సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో కూర్చుని తన ఆస్తులు, బంగారం, అంతస్తుల గురించి ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. ఆ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయో లేదో తెలియదు కానీ ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టిలో మాత్రం సూపర్ హిట్ అయిపోయింది.
సాధారణంగా పన్ను ఎగవేతదారులను పట్టుకోవడానికి ఐటీ అధికారులు నెలల తరబడి కష్టపడుతుంటారు. కానీ యాదగిరి మాత్రం అధికారుల పనిని చాలా సులభతరం చేశారు. యూట్యూబ్‌లో ఆయన ఇచ్చిన ఆస్తుల ప్రెజెంటేషన్ గొప్పలు చూసి ముగ్ధులైన అధికారులు నేరుగా రంగంలోకి దిగి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ఆయన ఖరీదైన భవనాన్ని బినామీ లావాదేవీల నిరోధక చట్టం కింద జప్తు చేసినట్లు సమాచారం. పాపం.. యూట్యూబ్‌లో బిల్డప్ ఇవ్వడానికి వాడిన బిల్డింగ్ కాస్తా ఇలా అధికారుల చేతికి వెళ్తుందని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు..
ఈ వ్యవహారంలో అసలు కామెడీ ఎక్కడుందంటే.. ఆయన ఆదాయానికి.. కట్టే పన్నుకు మధ్య ఉన్న భారీవ్యత్యాసం షాక్ కు గురిచేసింది. రాయదుర్గంలోని ఆ భవనం ద్వారా యాదగిరి గారికి నెలకు సుమారు రూ. 3.2 లక్షల అద్దె వస్తోందట. అంటే ఏడాదికి అక్షరాలా రూ. 38.4 లక్షల ఆదాయం అన్నమాట. కానీ ఆయన ఐటీ రిటర్నుల్లో మాత్రం తన వార్షిక ఆదాయం కేవలం రూ. 4 లక్షలు మాత్రమే అని ఎంతో అమాయకంగా చూపించారు. నెలకు మూడు లక్షలకు పైగా అద్దె తీసుకుంటూ ఏడాదికి నాలుగు లక్షలే ఆదాయం అని చెప్పడం చూసి ఐటీ అధికారులే ఆశ్చర్యపోయి ఉంటారు.
గోల్డ్ మ్యాన్ అని పేరు పెట్టుకున్నాక ఒంటినిండా బంగారం ఉండాలి కదా.. అయితే ఆ బంగారానికి సరైన బిల్లులు.. లెక్కలు కూడా ఉండాలనే చిన్న లాజిక్‌ను ఆయన మర్చిపోయినట్లున్నారు. తనిఖీల సమయంలో లెక్కల్లో చూపని సుమారు 700 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
లైకులు, షేర్ల మత్తులో పడి తమ ఆర్థిక రహస్యాలను బజారున పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఈ ఘటన ఒక లైవ్ ఎగ్జాంపుల్. అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు ఊరికే అనలేదు.. మరీ ముఖ్యంగా పన్నులు కట్టకుండా సోషల్ మీడియాలో బిల్డప్‌లు కొట్టే విషయంలో ఆ జాగ్రత్త మరింత అవసరం..