నాగార్జునకు భారీ లబ్ది...ఈటల సంచలన వ్యాఖ్యలు!
| నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కంటే ఎక్కువ ప్రయోజనం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. హైడ్రా పేరుతో నాగార్జునకు భారీ లబ్ధి చేకూర్చారని విమర్శించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక ఏం జరిగిందో సరైన సమయంలో బయటపెడతానని ప్రకటించారు. హైడ్రా వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణాకు చెందిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అప్పట్లో ఒక హాటెస్ట్ డెసిషన్. 2023లో ఇది జరిగింది. కట్ చేస్తే మూడేళ్ళ తరువాత తుమ్మిడి కుంట చెరువు పునరుద్ధరణ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించి ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్మానం చేసింది. ఆయన ప్రభుత్వానికి ఎంతో హెల్ప్ చేసారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొగిడారు. హైడ్రాను కమిషనర్ రంగనాధ్ ని ఆకాశానికి ఎత్తేశారు నాగార్జున. దాని మీద బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అయితే తీవ్ర స్థాయిలోనే మండిపడ్డారు. అసలు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనక ఏమి జరిగింది అన్న సీక్రేట్లు అన్నీ తగిన సమయంలో బయట పెడతా అని సంచలన వ్యాఖ్యలే చేశారు.
నాగార్జునకు మరింత ప్రయోజనం :
ఒక వైపు ఎన్ కన్వెన్షన్ కూల్చినట్లుగా కనిపించినా మరో వైపు నాగార్జునకు భారీ లబ్ది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది అని ఆయన ఆరోపించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతాను అన్నారు. హై రేంజి బిల్డింగ్స్ కి మధ్యలో ఆయనకు పర్మిషన్లు ఇచ్చి భారీగానే లబ్ది చేకూర్చారని ఆయన చెప్పారు. నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక అసలు ప్రయోజనాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇక్కడ కూల్చింది ఒక్కటే అయినా నాగార్జునకు దానికంటే ఎక్కువే కట్టబెట్టారని ఈటల రాజేందర్ విమర్శించారు. ఇది హైడ్రా ప్రచారం పేరుతో నాగార్జునకు మరింత లబ్ది చేకూర్చారని మండిపడ్డారు.
సామాన్యుడికి చేటు :
హైడ్రా వల్ల సామాన్యుడికి చేటు కలిగింది అని రాజేందర్ అన్నారు. వారి నివాసాలను ఖాళీ చేయించి కూల్చి వేసి ఇబ్బందులు పెట్టారని ఆయన అన్నారు. హైడ్రా అన్న వ్యవస్థను మంచిగా చెప్పుకుంటూ మీడియాలో ప్రకటనలు ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు అని ఈటల మండిపడ్డారు. కమిషనర్ గా రంగనాధ్ ని కూడా కావాలని కొనసాగిస్తున్నారు అని అన్నారు. ఈ విషయంలో ప్రజలకు పేదలకు వ్యతిరేకంగానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఉన్నాయని ఆయన విమర్శించారు.
ఈటల ఏమి చెబుతారు :
ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ ఎంపీ ఈటల ఏమి చెప్పబోతున్నారు అన్నది చర్చగా ఉందిప్పుడు. నాగార్జునకు భారీ లబ్ది చేకూరింది అంటూ ఆయన చేసిన ఈ కామెంట్స్ అయితే రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. అన్నీ తెలుసు త్వరలో చెబుతాను అని ఈటల ఇచ్చిన ఈ హింట్ తో హైడ్రా కత్తి దూసేది ఎవరి మీద అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆయన మీడియా సమావేశంలో పెదల ఇళ్లను హైడ్రా కూల్చివేసిన దానిని కూడా చూపించారు. పేదలు గగ్గోలు పెడుతున్నారని ఈటల చెప్పడం ద్వారా కొందరి కోసమే హైడ్రాను పనిచేయిస్తున్నారన్న అనుమానానాలు లేవనెత్తారని అంటున్నారు.