అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!
| ఖైరతాబాద్ ఉప ఎన్నికపై రాజకీయ పోరు కోర్టుకు చేరింది. దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలన్న పాత పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు ఉప ఎన్నిక ఆపాలని కాంగ్రెస్ నేత విజయారెడ్డి కోరుతున్నారు. మరోవైపు, రన్నరప్‌కు ఎమ్మెల్యే పదవి ఇవ్వకుండా మళ్లీ ఎన్నిక నిర్వహించాలని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి వాదిస్తున్నారు. దీంతో ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంటేనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. దానం నాగేందర్ అనర్హత వేటు పడగానే ఇక మైకులు పట్టండి.. జెండాలు ఎత్తండి.. ప్రచారం మొదలుపెట్టండి అంటూ పార్టీలన్నీ కత్తులు దూశాయి. తీరా చూస్తే.. అసలు యుద్ధం ఖైరతాబాద్ గల్లీల్లో కాదు.. హైకోర్టు గడపలో జరుగుతోంది.. ఒకరు ఎన్నిక ఆపమంటే.. మరొకరు ఎన్నిక పెట్టమంటూ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు.. అసలు ఈ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో దేవుడికే ఎరుక అన్నట్లుంది పరిస్థితి.
2023 ఎన్నికల్లో దానం నాగేందర్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి ఇప్పుడు అనూహ్యంగా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయ్యా కోర్టు వారు.. దానం ఎన్నిక చెల్లదని నా పాత పిటిషన్‌పై తీర్పు ఇవ్వండి.. ఆ తీర్పు వచ్చేవరకు ఉప ఎన్నికకు బ్రేకులు వేయండి అంటూ ఆమె గట్టిగానే పట్టుబట్టారు. అసలు మతలబు ఏంటంటే.. దానం ఎన్నిక రద్దయితే.. రెండో స్థానంలో ఉన్న తనను నేరుగా ఎమ్మెల్యేగా ప్రకటించే ఛాన్స్ ఉందన్నది ఆమె ఆశ.. పైసలు ఖర్చు లేదు... ప్రచారపు తిప్పలు లేవు.. నేరుగా అసెంబ్లీ గేటు దాటేయొచ్చనే ఈ 'షార్ట్ కట్' వ్యూహం చూసి మిగతా పార్టీలకు మైండ్ బ్లాంక్ అయింది. అటు ఎన్నికల సంఘం కూడా కోర్టు తేల్చే వరకు మేం ఏమీ చేయలేం బాబోయ్ అని చేతులెత్తేయడంతో కథ మలుపు తిరిగింది.
విజయారెడ్డి ఇలా కోర్టు మెట్లు ఎక్కారో లేదో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి మేమున్నాం అంటూ ఇంప్లీడ్ పిటిషన్‌తో దూకేశారు. ఇదేమైనా ఇద్దరి మధ్య జరిగిన కబడ్డీ పోటీ అనుకున్నారా? బహుముఖ పోటీ ఇది.. విజేత అవుట్ అయినంత మాత్రాన రన్నరప్‌కు కప్పు ఇచ్చేయడానికి ఇదేం స్కూల్ గేమ్ కాదు అన్నట్లుగా సుప్రీంకోర్టు పాత తీర్పులన్నీ బయటకు తీశారు. ప్రజల తీర్పు కావాలంటే మళ్లీ ఎన్నిక పెట్టాల్సిందేనని ఆయన గట్టిగా వాదిస్తున్నారు.
ఎవరి లెక్కలు వారివే.. ఓటర్లకు మాత్రం ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ లాగా ఉంది. మొత్తానికి ఖైరతాబాద్ రాజకీయం చూస్తుంటే.. నేతలందరూ కలిసి ఉద్దేశపూర్వకంగానే ఉప ఎన్నికను వాయిదా వేస్తున్నారా? అన్న అనుమానం రాకమానదు. ఒకరికి ఎన్నిక లేకుండా పదవి కావాలి.. మరొకరికి ఆ పదవి వారికి దక్కకుండా ఆపాలి.. ఈ క్రమంలో ప్రజాస్వామ్యం.. ప్రజల తీర్పు అనే పదాలు బాగానే వాడేస్తున్నారు.
పాపం ఖైరతాబాద్ ఓటర్లు మాత్రం " ఎన్నిక వస్తే నోట్ల కట్టలు.. హామీల వర్షం కురుస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. నేతలు మాత్రం కోర్టు వాయిదాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ పిటిషన్ల పర్వం ఎప్పుడు ముగుస్తుందో.. హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో కానీ.. అప్పటివరకు ఖైరతాబాద్ బై-పోల్ మాత్రం 'వాయిదాల పర్వం' సీరియల్‌లా సాగుతూనే ఉంటుంది..