పిలవని పేరంటానికి వెళ్తే బిర్యానీ కాదు.. రూ.5 వేల బిల్లు.. ఫంక్షన్ హాళ్ల సెక్యూరిటీ షాక్
| పెళ్లి విందుల కోసం ఆహ్వానం లేకుండా ఫంక్షన్ హాళ్లలోకి వస్తున్నవారిని అడ్డుకునేందుకు హనుమకొండలోని కొన్ని హాళ్ల నిర్వాహకులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ప్రవేశిస్తే సెక్షన్ 441 ప్రకారం మూడు నెలల జైలు, రూ.5 వేల జరిమానా ఉంటుందని పేర్కొన్నారు. భోజన ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికల తనిఖీలను కూడా పెంచుతున్నారు. అయితే శిక్ష ఆటోమేటిక్‌గా పడదు. చట్ట ప్రక్రియ ప్రకారమే చర్యలు ఉంటాయి.
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. మన ఊరి కళ్యాణ మండపాల దగ్గర ఒక కొత్త రకం ఆధ్యాత్మిక.. సారీ భోజనప్రియ కళ కనిపిస్తుంది. పెళ్లికి వెళ్లాలంటే ఆహ్వాన పత్రిక ఉండాలట.. ఎవరికి కావాలి ఆ కాగితం ముక్క? మనకు కావాల్సింది కమ్మని విందు.. ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ.. పక్కనే మటన్ ముక్క.. చివర్లో డబుల్ కా మీఠా.. కానీ ఇప్పుడు హనుమకొండలోని కొన్ని ఫంక్షన్ హాళ్ల బోర్డులు చూస్తుంటే పెళ్లి భోజనం తినాలంటే ముందు మన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
"ఎక్కడ పెళ్లి జరుగుతోంది? మెనూలో ఏమేం ఉన్నాయి?" అంటూ ఫుడ్ రాడార్ వేసుకుని తిరిగే అన్‌ఇన్వైటెడ్ ఫుడీస్ కు హనుమకొండలో గట్టి షాకే తగిలింది. ఫంక్షన్‌తో సంబంధం లేకుండా లోపలికి ప్రవేశిస్తే సెక్షన్ 441 ప్రకారం మూడు నెలల జైలు శిక్ష రూ.5 వేల జరిమానా తప్పదంటూ హెచ్చరిక బోర్డులు వెలిశాయి.
ఒకప్పుడు పెళ్లిలో ఎవరైనా మీరు ఎవరి వైపు? అని అడిగితే కనురెప్ప కూడా ఆర్పకుండా పెళ్లికొడుకు రూమ్‌మేట్ ఫ్రెండ్‌కి క్లోజ్ అనో.. పెళ్లికూతురు పిన్ని వాళ్ల పక్కింటి చుట్టం అనో ఏదో ఒక సినిమాటిక్ డైలాగ్ కొట్టి ప్లేట్ పట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఆ డైలాగ్‌లు చెల్లేలా లేవు. బహుశా త్వరలో గేటు దగ్గర ఆధార్ కార్డు.. ఫ్యామిలీ ట్రీ సర్టిఫికెట్.. కనీసం ఒక సెల్ఫీ అయినా అడుగుతారేమోనని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి ఈ కఠిన బోర్డుల వెనుక ఫంక్షన్ హాళ్ల యజమానుల కన్నీళ్లు.. బడ్జెట్ లెక్కలు దాగి ఉన్నాయి. ఒక్కో ప్లేట్ భోజనానికి వందల రూపాయలు ఖర్చవుతుంటే పిలవని అతిథులు వచ్చి లెక్కలు తారుమారు చేస్తుండటంతో నిర్వాహకులకు తలనొప్పి మొదలైంది. దాంతో సెక్యూరిటీ చెకింగ్‌లు.. ఆహ్వాన పత్రికల తనిఖీలు పెరుగుతున్నాయి.
రేపు పొద్దున్న పెళ్లికి వెళ్లాలంటే ఇన్విటేషన్ కార్డే పాస్‌పోర్ట్ కావచ్చేమో.. లోపలికి వెళ్లాక భోజన కూపన్.. స్వీట్ కౌంటర్ దగ్గర స్పెషల్ స్కానర్.. బిర్యానీలో పీస్ ఎక్కువ వేయించుకుంటే అదనపు చార్జీ..ఇలాంటి సీన్లు ఊహించుకుంటేనే భోజన ప్రియులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా గుర్తుంచుకోవాలి. ఆహ్వానం లేకుండా ఇతరుల వేడుకల్లోకి దూరడం కచ్చితంగా తప్పే.. నిర్వాహకులు తమ భద్రత.. నిర్వహణ కోసం నిబంధనలు పెట్టుకోవచ్చు. కానీ బోర్డుపై రాసినంత మాత్రాన ప్రతి చిన్న విషయానికీ ఆటోమేటిక్‌గా శిక్ష, జరిమానా పడిపోతాయని అనుకోకూడదు. ఏదైనా చట్టపరమైన చర్య అనేది పరిస్థితులు.. నేరం తీవ్రత.. చట్ట ప్రక్రియ ఆధారంగానే ఉంటుంది.
ఈ సీజన్‌లో పిలవని పేరంటానికి వెళ్లే ప్లాన్‌లో ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఫ్రీ బిర్యానీ ఆశించి వెళ్లి చివరికి రూ.5 వేల జరిమానా కట్టాల్సి వస్తే ఆ బిర్యానీ చరిత్రలో అత్యంత ఖరీదైన బిర్యానీగా మిగిలిపోతుంది.