టీఆర్ఎస్సా.. బీజేపీనా.. కొండా కుటుంబంపై రాజకీయ వర్గాల్లో పెనుచర్చ!
మంత్రి పదవిని సైతం సురేఖ పోగొట్టుకున్నారు. ఇక, పార్టీలోనూ ఉండడం ఆమెకు ఇష్టం లేనట్టుగానే ఉంది.
బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీలోకి తాజా మాజీ మంత్రి కొండా సురేఖ కుటుంబం అడుగు పెట్టనుందా? కొత్త పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారా? అంటే.. తాజాగా ఈ విషయంపైనే తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను చర్చ సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో అమీ తుమీ అన్నట్టుగా సురేఖ కుటుంబం రాజకీయంగా కాలు దువ్వింది.
మంత్రి పదవిని సైతం సురేఖ పోగొట్టుకున్నారు. ఇక, పార్టీలోనూ ఉండడం ఆమెకు ఇష్టం లేనట్టుగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆప్షన్ తెలంగాణ రక్షణ సేన మాత్రమేనన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఒక వేళ కాదంటే.. బీజేపీవైపు మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తు న్నారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ పొలిటికల్ పార్టీల విషయానికి వస్తే.. బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూకుడుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల్లోనూ కొండా రాజకీయం ముగిసిట్టే.
ఇక, మిగిలిన పార్టీల విషయానికి వస్తే.. బీజేపీ కొంత మేరకు దూకుడుగానే ఉంది. గత ఎన్నికల్లోనే బలమై న పక్షంగా సీట్లు గెలుచుకుంది. ఇక, వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకోవాలన్నది కమల నాధు ల మాస్టర్ ప్లాన్. దీనికి తగిన విధంగానే అభివృద్ధి, నిధుల విషయాన్ని తరచుగా ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోడీసైతం.. కీలక నాయకులకు ఆహ్వానం పలికే విధంగా పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత పార్టీ కాదన్నా.. లేక కొండా వద్దనుకున్నా.. ఆల్టర్నేట్ బీజేపీ కనిపిస్తోంది.
బీజేపీ అదికారంలోకి వచ్చినా రాకపోయినా.. కేంద్రంలో బలంగా ఉంది కాబట్టి.. వచ్చే ఎన్నికల్లోనూ మోడీ మరోసారి ప్రధాని అవుతారన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కొండా ఫ్యామిలీ ఆదిశగా ఆలోచన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఎంఐఎం పార్టీ యాక్టివ్‌గానే ఉన్నా.. ఆ పార్టీలో పరిమిత స్వేచ్ఛ, పరిమిత నాయకులు మాత్రమే కనిపిస్తున్న దరిమిలా.. కొండా కుటుంబం.. టీఆర్ ఎస్ లేదా.. బీజేపీ వైపు మొగ్గు చూపడం ఖాయమనేది విశ్లేషకుల అంచనా. మరి ఏంజరుగుతుందో చూడాలి.