అమెరికాతో బిజినెస్ డీల్.. ట్రంప్ కు కార్చుకాల్చి వాతపెట్టిన భారత్
అగ్రరాజ్యం చెప్పినట్లు ఆడటం కాకుండా తమ ఎగుమతిదారులకు ఏమీ మిగలకపోతే అసలు ఈ ఒప్పందంతో మాకేంటి ఉపయోగం అన్నట్లు న్యూఢిల్లీ వైఖరి మార్చుకుంది.
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం అంటే సాధారణ విషయం కాదు.. అది దాదాపుగా ఒక నిరంతర నాటకంలా సాగుతోంది. వాషింగ్టన్ ఏది చెప్తే దానికి తల ఊపుతూ వారు విధించే షరతులపైనే గంటల తరబడి చర్చలు జరిపిన భారత్.. ఎట్టకేలకు నిద్రలేచి తన గొంతు వినిపించడం మొదలుపెట్టింది. అగ్రరాజ్యం చెప్పినట్లు ఆడటం కాకుండా తమ ఎగుమతిదారులకు ఏమీ మిగలకపోతే అసలు ఈ ఒప్పందంతో మాకేంటి ఉపయోగం అన్నట్లు న్యూఢిల్లీ వైఖరి మార్చుకుంది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఒక వేదికపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే భారత్ ఇకపై అమెరికా ముందు దరఖాస్తుదారుడిలా నిలబడటానికి సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు ఇతర పోటీ దేశాల కంటే తక్కువ పన్నులు లేదా మెరుగైన రాయితీలు ఇస్తేనే ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరుగుతాయని తేల్చిచెప్పారు. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలు తక్కువ ధరలతో అమెరికా మార్కెట్‌ను ముంచెత్తుతుంటే భారత ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకాలు విధించి డీల్ చేసుకుందామంటే కుదిరే పనికాదని కుండబద్దలు కొట్టారు.
గత దాదాపు ఏడాది కాలంగా ఈ చర్చల ప్రక్రియ ముందుకు వెనుకకూ ఊగిసలాడుతోంది. గతంలోనే ముసాయిదా పత్రాలు సిద్ధమయ్యాయని ఆర్భాటం చేసినప్పటికీ అమెరికా తన సొంత 'సెక్షన్ 301' విచారణలు, సాంకేతిక అడ్డంకులు అంటూ కాలయాపన చేస్తూ వచ్చింది. తమకు నచ్చినట్లు నిబంధనలు మార్చుకుంటూ పోవడమే అలవాటైన అగ్రరాజ్యానికి ఇప్పుడు భారత్ పెట్టిన నిబంధనలు ఒక పెద్ద సవాలుగా మారాయి. టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్, రసాయనాలు, వ్యవసాయ రంగాలకు చెందిన ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్‌లో నిజమైన ప్రయోజనం దక్కితేనే డీల్ ఓకే అవుతుంది.. లేదంటే ఈ చర్చలు మరో ఏడాది పాటు నడిచినా ఆశ్చర్యం లేదు.
మొత్తానికి ఇప్పటివరకు కేవలం అమెరికా డిమాండ్లను వింటూ వచ్చిన భారత ప్రభుత్వం.. ఇప్పుడు తన బేరసారాల శక్తిని సరిగ్గా ప్రదర్శించడం మొదలుపెట్టింది. వాషింగ్టన్ దయ తలస్తే తప్ప వ్యాపారం జరగదనే రోజులు పోయాయని, తమ ప్రయోజనాలు కాపాడనంత వరకు ఏ ఒప్పందమైనా కాగితాలకే పరిమితమవుతుందని భారత్ తేల్చేసింది. మరి భారత ప్రభుత్వం విసిరిన ఈ పన్నుల సవాలుకు.. ట్రంప్ సర్కారు ఎలాంటి సమాధానం ఇస్తుందో.. అసలు ఈ డీల్ ముగింపుకు వస్తుందో లేక మళ్లీ చర్చల సుడిగుండంలో చిక్కుకుంటుందో వేచి చూడాలి.