అమ్మో మేనల్లుళ్లు...మమతను చూసి మాయావతి అలెర్ట్ !
తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ కి బీఎస్పీలో పెద్ద బాధ్యతలు ఇవ్వడం ఈ సమయంలో సమంజసం కాదని తాజాగా మాయావతి చేసిన ప్రకటన యూపీ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో చర్చకు అవకాశం ఇస్తోంది.
బంధాలు ఒక పట్టాన తెగవు అన్నది వేదాంతుల మాట. ఒంటికాయ శొంఠి కొమ్ముగా పెళ్ళి పెడాకులు మానేసినా కూడా బంధు గణాలు బీరకాయ పీచు బంధాలు వెంటాడుతూనే ఉంటాయి. భారత దేశ రాజకీయాల్లో చూస్తే చాలా మంది నాయకులు ఆజన్మ బ్రహ్మచారులుగా ఉంటూ అనేక విజయాలు సాధించారు. ఎలాంటి బాదరా బాంధీ లేదని వారికి ప్రజలే అతి పెద్ద కుటుంబం అని నమ్మి జనాలు ఓటేసి అందలాలు ఎక్కిస్తే ఎక్కడ లేని బంధు కోటి వారి వెంట చేరి అవినీతి బంధుప్రీతికి వారికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసి ఎంతలా ఇబ్బంది పెట్టాలో అంతలా పెట్టేశారు. భారత దేశం సన్ స్ట్రోక్స్ ని చూసింది అలాగే సన్ ఇన్ లా స్ట్రోక్స్ చూసిన వారు కూడా ఉన్నారు. ఆ జాబితాలో లేటెస్ట్ గా పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేరిపోయారు.
మేనల్లుడితోనే అంతా :
ఆమె ఎందుకు అంత దారుణంగా ఓటమి చెందారు ఆమె పార్టీ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు వెల్లువలా బయటకు ఎందుకు వెళ్లిపోయారు అంటే దానికి కారణం ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆల్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో మమత పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రిగా ఆయనే అయ్యేవారు అన్నది కూడా ప్రచారం జరిగింది. దాంతోనే తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలు అయింది అంటారు. అది బీజేపీకి ఎంతగానో కలసి వచ్చింది. ఇక మేనల్లుడి హవా తృణమూల్ కాంగ్రెస్ లో తగ్గిందా లేదా అన్నది పక్కన పెడితే ఈ మేనల్లుడి దెబ్బను చూసి ఉత్తర ప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి చాలా జాగ్రత్త పడుతున్నారు అన్నదే రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్న విషయంగా ఉంది.
పెద్ద బాధ్యతలకు దూరం :
తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ కి బీఎస్పీలో పెద్ద బాధ్యతలు ఇవ్వడం ఈ సమయంలో సమంజసం కాదని తాజాగా మాయావతి చేసిన ప్రకటన యూపీ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో చర్చకు అవకాశం ఇస్తోంది. మేనల్లుడు ఇంకా పరిణితి చెందలేదని మాయావతి చెప్పడం విశేషం. ఆ విధంగా ఆయన్ని పార్టీలో కీలక పదవులకు దూరం చేసే సంకేతాలని జనంలోకి ఆమె పంపిస్తున్నారు. ఇప్పటిదాకా చూస్తే 2027 యూపీ ఎన్నికల్లో బీఎస్పీని నడిపించే బాధ్యత ఆకాశ్ ఆనంద్ దే అంటూ వచ్చిన వార్తలకు ఆ విధంగా మాయావతి చెక్ పెట్టేశారు అని అంటున్నారు.
బీఎస్పీ కార్యకర్తగా :
ఇక తన సొంత మేనత్త మాయావతి తనకు పరిణతి ఇంకా రాలేదని పెద్ద పదవులు వద్దు అని ఏకంగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలోనే ప్రకటించడంతో ఆకాశ్ ఆనంద్ తన ఎక్స్ ఖాతా ప్రొఫైల్‌ను మార్చేశారు. ఇప్పటిదాకా అక్కడ బీఎస్పీ జాతీయ కన్వీనర్ అన్న పదవి ఉండేది. దానికి బదులుగా ప్రొఫైల్‌లో బీఎస్పీ కార్యకర్తగా మార్చి పార్టీ క్యాడర్ కి షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆకాశ్ ఆనంద్‌ను మాయావతి ఏరి కోరి 2025 ఆగస్టు నెలలో బీఎస్పీ జాతీయ కన్వీనర్‌గా నియమించారు. ఆయనను తన వారసుడిగా ఆమె అలా గుర్తించారు. అంతే కాదు యువతరం ప్రతినిధిగా ఆయన్ను ముందు పెట్టి పార్టీని నడిపించాలనుకున్నారు. కానీ తృణమూల్ చేదు ఓటమి అక్కడ మేనల్లుడికి జనాలు పార్టీ జనాలు ఇచ్చిన షాక్ ప్రభావమో మరేమిటో తెలియదు కానీ మాయావతి మేనల్లుడిని దూరం పెట్టేశారు. దీంతో మాయావతి పార్టీలో వారసత్వానికి ప్రస్తుతానికి తావు లేదని చాటారు. మరి దీనిని జనాలు గుర్తించి ఏమైనా చాన్స్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.