ఫ్రీగా గోక్కుంటే వ్యాపార నష్టమే! వీపులు గోకుతూ కోట్లకు పడగలెత్తిన బిజినెస్ జీనియస్

చైనాకు చెందిన ‘జాంగ్’ అనే మహానుభావుడు మాత్రం అదే గోకుడును కోట్లకు పడగలెత్తించే ఒక కార్పొరేట్ సామ్రాజ్యంగా మార్చేశాడు.

Update: 2026-09-03 18:30 GMT

శరీరంపై ఎక్కడైనా దురద పెడితే నాలుగు గోళ్లతో అలా రాక్కుంటే వచ్చే హాయి వర్ణనాతీతం. "ఇదేమన్నా గొప్ప పనా.. దీనికి కూడా ఓ నైపుణ్యం కావాలా?" అని చులకనగా తీసిపారేసే లోకానికి చెంపపెట్టులాంటి వార్త ఇది. మనమేమో దురద వస్తే ఇంట్లో ఉన్న అటక కర్రలకో.. ప్లాస్టిక్ దువ్వెనలకో.. చివరకు తలుపుల మూలలకో పనప్పజెప్పి ఉచితంగా గోకేసుకుంటుంటే.. చైనాకు చెందిన ‘జాంగ్’ అనే మహానుభావుడు మాత్రం అదే గోకుడును కోట్లకు పడగలెత్తించే ఒక కార్పొరేట్ సామ్రాజ్యంగా మార్చేశాడు.

సోషల్ మీడియాలో ఒక భార్య భర్త వీపు గోకుతున్న వీడియో చూసి అందరిలా నవ్వి ఊరుకోలేదు ఈ బిజినెస్ జీనియస్. జనాలు గోక్కోవడానికి కూడా తీరిక లేనంత బిజీ అయిపోయారని.. లోకంలో దురదలు ఎక్కువైపోయాయని గ్రహించి వెంటనే గ్రౌండ్ ఫీల్డ్‌లోకి దిగిపోయాడు. రూపాయి పెట్టుబడి లేదు.. అంతా ఉచిత సర్వీస్ ఐడియా. గోళ్లు పెంచాడు, పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు శానిటైజ్ చేశాడు.. కస్టమర్ వీపును తన కాన్వాస్‌గా మార్చుకున్నాడు. కస్టమర్ల కోరిక మేరకు గ్లౌజులు తొడిగి మరీ 'ప్రీమియం స్క్రాచింగ్' సేవలు అందిస్తున్నాడు. అసభ్యతకు తావులేకుండా సిసి కెమెరాల నిఘాలో ఎంతో ప్రొఫెషనల్‌గా "మీ దురద – మా బాధ్యత" అంటూ ఈ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు.

ఈ గోకుడు వ్యాపారంలో ఆదాయం చూస్తే ఎవరికైనా కళ్లు తిరగడం ఖాయం. జాంగ్ గంటకు ఏకంగా 4,200 రూపాయలు వసూలు చేస్తుంటే నెలకు అతడి సంపాదన అక్షరాలా 14 లక్షల రూపాయలకు చేరుకుంది. కేవలం పది గోళ్లు, కొంత శానిటైజర్ మినహా ఎలాంటి ముడిసరుకు అవసరం లేని ఈ బిజినెస్‌లో కస్టమర్ల డిమాండ్ బట్టి లైట్, మీడియం, లేదా హార్డ్ స్క్రాచింగ్ చేస్తూ నోట్ల వర్షం కురిపించుకుంటున్నాడు.

పెద్ద పెద్ద మసాజ్ సెంటర్లు, ఖరీదైన స్పా సర్వీసులను పక్కనబెట్టి జనాలు ఇప్పుడు ఈ 'హై-టెక్ గోకుడు' కోసం క్యూ కడుతున్నారు. కస్టమర్ల రద్దీ ఎంతగా ఉందంటే పాపం జాంగ్‌కు ప్రశాంతంగా కూర్చుని అన్నం తినడానికి కూడా సమయం దొరకడం లేదట. రోజంతా ఇతరుల వీపులు గోకి గోకి చేతులు అలసిపోతున్నా, నెలకు అకౌంట్‌లో పడే ఆ 14 లక్షల మెసేజ్ చూస్తుంటే ఆ అలసట అంతా మాయమైపోతోందని చెబుతున్నాడు.

తీరిక లేని ఐటీ ఉద్యోగులు, ఒత్తిడిలో ఉన్న కార్పొరేట్ దిగ్గజాలు ఇతగాడి దగ్గరకు వచ్చి వీపు అప్పజెప్పి మహానందం పొందుతున్నారు. ఉచితంగా దొరికే దురద నివారణను కూడా ఇలా లక్షల బిజినెస్‌గా మార్చచ్చని నిరూపించిన ఈ చైనా మేధావిని చూసి ఇన్నాళ్లూ సొంత వీపులను ఉచితంగా గోక్కుని ఎంత పెద్ద వ్యాపార నష్టం చేసుకున్నామో అని ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది.

Tags:    

Similar News