సణుగుడు...గొణుగుడు రేవంత్ దెబ్బకు సైలెంట్ !

మరో రెండేళ్లకు పైగా అధికారం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. ఈ మధ్యలో ఆయన్ని కదిపే వారు ఎవరూ ఉండరు అన్నది తాజా పరిణామాలతో బోధపడుతోంది.

Update: 2026-09-04 02:22 GMT

తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క దెబ్బతో అందరి నోళ్ళూ మూయించారు. అటు స్వపక్షం మరో వైపు విపక్షం ఇలా అన్ని వైపులా అంతా సైలెంట్ అయ్యేలా చేయగలిగారు. దానికి ఆయన్ని అభినందించి తీరాల్సిందే. రేవంత్ రెడ్డి 2023లో తెలంగాణాలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ముళ్ల కిరీటమే ధరించారు అని అంతా అనుకున్నారు. అయితే సముద్రమంత పార్టీ కాంగ్రెస్ లో రేవంత్ దాదాపుగా ఏకాభిప్రాయమే సాధించారు. ఇంకా అక్కడక్కడ అసంతృప్తి గళాలు కొన్ని వినిపిస్తూంటే కొన్నాళ్ళ నుంచి సహించారు, భరాయించారు. ఇపుడు కొండా సురేఖను అవుట్ చేయడం చిన్నా రెడ్డి పోస్ట్ తీసేయడం ద్వారా ఒక్క దెబ్బకు అనేక ప్రయోజనాలు సాధించారు అని విశ్లెషణలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మీద స్వపక్షంలోనే విమర్శలు చేస్తూ కొందరు గొంతులు పెంచారు, ఇపుడు వారికి కూడా ఇదొక షాక్ ట్రీట్మెంట్ అని అంటున్నారు.

అండగా హైకమాండ్ :

కీలకమైన సమయంలో రేవంత్ రెడ్డికి అండగా హైకమాండ్ ఉంది. అంతే కాదు అధినాయకత్వం వద్ద రేవంత్ రెడ్డికి పలుకుబడి పెద్దగా లేదని అనుకున్న వారికి తాజాగా ఒక బీసీని ఫైర్ బ్రాండ్ మహిళా మంత్రిని తీసి అలా పక్కన పెట్టడం చూస్తే ఆయన పవర్ ఏంటో అర్థం అయి ఉంటుంది. ఢిల్లీ పెద్దలకు తెలంగాణా కాంగ్రెస్ లో ఎవరేమిటో తెలియదా అన్నదే అందరి మాట. రేవంత్ రెడ్డి అన్న ఫేస్ తోనే 2023లో కాంగ్రెస్ గెలిచింది అన్నది వాస్తవం. నిజానికి కాంగ్రెస్ లో ఎంతో మంది లీడర్లు ఉండొచ్చు. కార్యకర్తలు ఉండొచ్చు. కానీ ప్రజాకర్షణ కలిగిన ఫేస్ రేవంత్ రెడ్డిని ముందు పెట్టుకుంటేనే కాంగ్రెస్ కి విజయం దక్కింది అన్నది ఎవరికి అర్థం కాకపోయినా ఆ పార్టీ పెద్దలకు బాగా అర్థం అయింది కాబట్టే రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు అని అంటున్నారు.

ఈ టెర్మ్ లో గప్ చిప్ గానే :

మరో రెండేళ్లకు పైగా అధికారం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. ఈ మధ్యలో ఆయన్ని కదిపే వారు ఎవరూ ఉండరు అన్నది తాజా పరిణామాలతో బోధపడుతోంది. 2028లో షెడ్యూల్ ప్రకారం తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. అలా అయితే ఆయనకు మరింత సమయం ఉంది. ముఖ్యమంత్రిగా తనను తాను ఇంకా నిరూపించుకునేందుకు కూడా చాన్స్ ఉంది. అంతే కాదు తనదైన పాలనను అందించేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యవస్థ పరంగా కాంగ్రెస్ పార్టీలో బలవంతుడిగా ఉన్నారు కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన కోరుకున్న వారికే టికెట్లు ఇప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

అన్నీ కుదిరితే మరోసారి :

ఇక కాంగ్రెస్ అధినాయకత్వం ఎటూ ఆయన్ని నమ్ముతోంది. ఆయన బలం కూడా పూర్తిగా తెలుసుకుంది కాబట్టి 2028లో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే రేవంత్ రెడ్డికే ఇంకో చాన్స్ ఉంటుంది అన్న దాంట్లో ఎలాంటి డౌట్లూ లేవని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు. వారంతా ఆయా ప్రాంతాలలో స్థానికంగా బలమైన నేతలుగా ఉంటారు, కానీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీని ముందుకు తీసుకుని వెళ్లి గెలిపించే వారు ఎంతమంది అన్నది ప్రశ్న కాదు కాంగ్రెస్ అధినాయకత్వానికి పక్కాగా తెలిసిన జవాబు. అందుకే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లాంటి క్రౌడ్ పుల్లర్ ని వదులుకోవడం లేదని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారని ఆరోపిస్తున్న వారు ఆయన కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్న సంగతి కనిపించకపోవచ్చు, కానీ హైకమాండ్ కి తెలుసు కాబట్టే ఆయనకే తమ మొగ్గు అని స్పష్టం చేసినట్లుగా తాజా పరిణామాలు చెబుతున్నాయి. మొత్తం మీద చూస్తే రేవంత్ రెడ్డి బాహు బలి అని చెప్పక తప్పదు. రేవంత్ రెడ్డికి ఇలాగే హైకమాండ్ నుంచి ఫుల్ సపోర్ట్ దక్కితే తెలంగాణాలో కాంగ్రెస్ మళ్లీ గెలిచే అవకాశాలు రెట్టింపు అవుతాయని అంటున్నారు.

Tags:    

Similar News